దేశంలోని ప్రధాన నగరాల్లో కాళ్లు బయటకు పెట్టాలంటే క్యాబ్(Cab) కావాల్సిందే. ఆఫీస్(Office), షాపింగ్(Shopping), షీకారుకు వెళ్లాలంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్లు కూడా క్యాబ్ ను ఉపయోగిస్తున్నారు. ప్రధాన నగరాల్లో ముఖ్య రవాణా సౌకర్యం ఇది. అయితే ఇప్పుడు క్యాబ్ ఎక్కాలంటే చుక్కలు కనపడుతున్నాయి. ఎందుకంటారా? ఛార్జీల బాదుడు సామాన్యుడి వంట గదిలోనే కాదు.. ప్రయాణంపైన పడింది. ఇంధన ధరల పెంపు నేపథ్యంలో ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ఉబెర్(Uber) తాజాగా ట్రిప్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. తమ సంస్థ దేశంలోని అనేక నగరాల్లో రైడ్(Ride) ధరలను పెంచిందని కంపెనీ సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ నితీష్ భూషణ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంధన ధరల పెంపు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపింది. ఇంధన ధరల పెంపుతో రైడ్ షేరింగ్ సంఖ్య పెరిగిందని కంపెనీ భావిస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరలను ప్రధాన సమస్యగా డ్రైవర్లు చెప్పారని డైరెక్టర్ నితీష్ భూషణ్ బ్లాగ్ పోస్టు ద్వారా తెలియజేశారు. క్యాబ్, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు ఇటీవల పలు సందర్భాల్లో ధర్నాలు చేయడం ఇందుకు ప్రధాన కారణం. అన్ని చోట్ల ఇంధన ధరలు పెరిగాయి. దీంతో వీళ్లంతా ప్రయాణ చార్జీల ధరలను కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే ఉబెర్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి : సీఎం జగన్ ఇలాకాలో ఏం జరుగుతోంది? చంద్రబాబుటూర్ గ్రాండ్ సక్సెస్ కు రీజనేంటి..?
మార్చి నెల నుంచి చూస్తే సీఎన్‌జీ ధర దేశ రాజధానిలో కేజీకి రూ.12.48 మేర పెరిగింది. దీంతో దీని రేటు రూ.69.11కు చేరింది. ధరల పెంపు నేపథ్యంలో డ్రైవర్లపై ప్రతికూల ప్రభావం పడకూడదని ఉబెర్ ప్రయాణ చార్జీలను 12 శాతం పెంచేసింది. ఉబెర్ ఇండియా అండ్ దక్షిణాసియా హెడ్ ఆఫ్ సెంట్రల్ ఆపరేషన్స్ నితీశ్ భూషన్ ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న వారాల్లో కూడా ఇంధన ధరల్లో కదలికలను గమనిస్తూ ఉంటామని, అందుకు అనుగుణంగా రేట్లలో మార్పు ఉంటుందని తెలిపారు.
అయితే గత వారం ఉబర్ క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించే అంశంలో మెరుగు పడకపోతే, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రయాణం రద్దు విధానంతో పాటు పలు అంశల్లో క్యాబ్ అగ్రిగేటర్లు అన్యాయమైన వాణిజ్య విధానాలను పాటిస్తున్నట్లు వినియోగదార్ల నుంచి ఫిర్యాదులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీ ప్రతినిథులతో ప్రభుత్వం సమావేశమై.. వినియోగదార్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని హెచ్చరించింది. బుకింగ్ లను అంగీకరించిన అనంతరం, డ్రైవర్ల ఒత్తిడితో వినియోగదార్లు రైడ్ ను రద్దు చేసుకోవడంతో ఆ అపరాధ రుసుములను వినియోగదార్లు కట్టాల్సి వస్తోందన్న విషయాన్ని ప్రభుత్వ దృష్టికి వచ్చిందని తెలిపారు. క్యాబ్ అ్రగినేటర్లు తక్షణం పరిష్కారాలతో ముందుకు రావాలని సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ చీఫ్ కమిషనర్ నిధి ఖరే పేర్కొన్నారు.
క్యాబ్ ధరలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేలా ఒక అగ్రిగేటర్ పాలసీని తీసుకురావాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఓలా, ఇతర క్యాబ్ అగ్రిగేటర్లు ధరలు పెంచుతాయా? లేదా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Technology, Uber