మీరు ట్విట్టర్ (Twitter) వాడుతున్నారా! అయితే, ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే. సైబర్ నేరగాళ్లు మీపై ఓ కన్నేసి ఉంచారు. మీ సమాచారం వాళ్ల దగ్గరికి ఎలా వెళ్లిందని అనుకుంటున్నారా? ప్రముఖ సోషల్ మీడియా (Social Media) దిగ్గజమైన ట్విట్టర్.. హ్యాకింగ్‌కు గురైనట్లు తెలుస్తోంది. దాదాపు 200 మిలియన్లకు పైగా అంటే 20 కోట్లకు పైగా వినియోగదారుల ఈమెయిల్ అడ్రస్, చిరునామా వంటి వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిందట. అందులో మీ వివరాలు కూడా ఉండొచ్చు! ఈ వార్త విని సైబర్ నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో వినియోగదారుల సమాచారం లీకైందంటే ఇదొక భారీ సైబర్ మోసం అంటూ అభివర్ణిస్తున్నారు.
డిసెంబర్‌లో ట్విట్టర్ హ్యాకింగ్
గత డిసెంబరులోనే ట్విట్టర్ హ్యాకింగ్‌కి గురైనట్లు బహిర్గతమైంది. ఇజ్రాయెల్‌కు చెందని సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘హడ్సన్ రాక్’ తొలుత ఈ విషయాన్ని వెల్లడించింది. 2022 డిసెంబరు 24న హడ్సన్ రాక్ కో-ఫౌండర్ అలోన్ గాల్ ఓ పోస్టు ద్వారా ట్విట్టర్ హ్యాక్‌కి గురైనట్లు తెలిపారు. సుమారుగా 200 మిలియన్ల(20 కోట్లు) వినియోగదారులు ఈమెయిల్ అడ్రస్‌లు లీకైనట్లు ఆయన పోస్టులో వెల్లడించారు. అయితే, చిన్న ట్వీట్‌కి కూడా రెస్పాండ్ అయ్యే ఎలన్ మస్క్ దీనిపై స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ట్విటర్ హ్యాక్‌కి గురికాలేదని ప్రకటన చేయకపోవడం, సంస్థ నైతికతకు భంగం కలిగించేలా పోస్టు పెట్టిన అలోన్ గాల్‌పై ఉల్లంఘన చర్యలకు పాల్పడకపోవడం ఈ రూమర్లకు ఊతమిస్తోంది.
కొరవడిన స్పష్టత
వాస్తవానికి ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ని టేకోవర్ చేయడానికి ముందే ఈ సమాచారం లీకైనట్లు తెలుస్తోంది. 2021 డిసెంబరులోనే 20 కోట్ల మంది యూజర్ల ఈమెయిల్ అడ్రస్‌లు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కినట్లు సమాచారం. అయితే, తొలుత 40 కోట్ల యూజర్ల డేటా లీకైనట్లు ప్రచారం జరగడం గమనార్హం. అయితే, ఈ హ్యాకింగ్ ఎక్కడి నుంచి జరిగిందనే విషయంలో స్పష్టత కరువైంది. దీని వెనకాల హ్యాకర్ల ఉద్దేశమేంటో ఇప్పటివరకు తెలియరాలేదు. అయితే, ఇలా చేయడమనేది తీవ్రంగా పరిగణించాలని అలెన్ గాల్ అభిప్రాయపడ్డారు. తస్కరించిన డేటా సహకారంతో సైబర్ నేరగాళ్లు భవిష్యత్తులో మరిన్ని ఫిషింగ్, డాక్సింగ్ దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని గాల్ హెచ్చరించారు.
పెద్ద సమస్య!
గత కొద్ది నెలలుగా ట్విట్టర్ తరచూ వార్తల్లో నిలుస్తుంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్‌ని 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాక ఇది మరింత తీవ్రమైంది. భావ ప్రకటనా స్వేచ్ఛకు ట్విటర్‌ని ఒక వేదికగా మారుస్తానంటూ సమూల ప్రక్షాళన చేపట్టారు. ఈ మేరకు ఉద్యోగులను తీసివేశారు. వారంలో పనిచేసే వేళలను పొడిగించారు. ఉద్యోగులకు కఠినమైన షరతులు విధిస్తూ విమర్శల పాలయ్యారు. అయితే, మస్క్‌కి ఇప్పుడు అంతకన్నా పెద్ద సమస్య వచ్చి పడినట్లు తెలుస్తోంది. ట్విట్టర్ యూజర్ల డేటా లీక్ నిజమని తేలితే.. ఈ మైక్రో బ్లాగింగ్ సిస్టంపై వినియోగదారుల విశ్వసనీయత పడిపోతుంది. ఫలితంగా ట్విట్టర్ వినాశనానికే దారి తీసే ప్రమాదముంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.