ట్విట్టర్ ఉద్యోగులకు ఎలాన్ మస్క్(Elon Musk) షాక్ ఇచ్చిన కాసేపటికే, ట్విట్టర్ డౌన్ అయింది. ఈరోజు నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు, ఆఫీస్‌లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. మాస్ ఫైరింగ్, లేఆఫ్స్ కారణంగా ట్విట్టర్ వర్క్ ఫోర్స్ భారీగా తగ్గింది. దీంతో యాప్ పనితీరుపై ఈ ప్రభావం పడింది. ఇండియాతో పాటు ఇతర ప్రాంతాల్లో నవంబర్ 4 ఉదయం నుంచి చాలా మంది వినియోగదారులకు ట్విట్టర్(Twitter) పని చేయడం లేదు. దీంతో ఈ ప్లాట్‌ఫామ్ కొత్త ఓనర్ ఎలాన్ మస్క్ నిర్ణయాలే ఇందుకు కారణమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ట్విట్టర్‌ను మస్క్ కొనుగోలు చేసినప్పటి నుంచి, సంస్థ ఉద్యోగులు జాబ్ సెక్యూరిటీపై ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా వారి భయాలు నిజమయ్యాయి. ఎలాన్ మస్క్ ఇప్పుడు టెస్లా, స్పేస్‌ఎక్స్‌లోని సన్నిహిత సహోద్యోగులతో కలిసి లేఆఫ్ ప్లాన్లను రూపొందించే పనిలో ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈమేరకు ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు ఈమెయిల్లో లెటర్ కూడా పంపించారు. మస్క్ మొత్తం 3,738 మంది ట్విట్టర్ ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పని చేయటి ప్లాట్‌ఫామ్
ట్విట్టర్ డెస్క్‌టాప్‌లో అస్సలు లోడ్ కావడం లేదు. మొబైల్ యాప్ నుంచి కొత్త ట్వీట్లు, వీడియోలు లేదా ఫోటోలు లోడ్ అవ్వట్లేదు. చాలా మంది యూజర్లు ట్విట్టర్‌ను యాక్సెస్ చేయలేకపోతున్నారు. ట్విట్టర్ డెస్క్‌టాప్ వెబ్సైట్లో పూర్తిగా డౌన్ అయినప్పటికీ, కొంతమంది యూజర్లకు అప్పుడప్పుడు యాప్ బాగానే పని చేస్తున్నట్లు కనిపిస్తోంది.
మాస్ ఫైరింగ్
ఉద్యోగులను సామూహికంగా తొలగించాలని నిర్ణయించిన మస్క్, ట్విట్టర్ ఆఫీస్‌లను తాత్కాలికంగా మూసివేశారు. ‘ట్విట్టర్‌ను సరైన మార్గంలో కొనసాగించే ప్రయత్నంలో భాగంగా నేడు గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించే ప్రక్రియను ప్రారంభిస్తున్నాం. కంపెనీని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు నడిపించేందుకు ఈ నిర్ణయం తీసుకోక తప్పట్లేదు. ప్రతి ఉద్యోగితో పాటు ట్విట్టర్ సిస్టమ్స్, కస్టమర్ డేటా భద్రతను నిర్ధారించడానికి, మా ఆఫీస్‌లు తాత్కాలికంగా మూతబడతాయి. బ్యాడ్జ్ యాక్సెస్ సస్పెండ్ అవుతుంది. మీరు ఇప్పటికే ఆఫీస్‌లో ఉంటే లేదా ఆఫీస్‌కి వెళ్లే మార్గంలో ఉంటే, దయచేసి ఇంటికి తిరిగి వెళ్లండి.’ అని ఉద్యోగులకు ట్విట్టర్ ఈరోజు మెయిల్ చేసింది.
నవంబర్ 4, ఉదయం 9 గంటలలోపు ఉద్యోగులందరికీ 'యువర్ రోల్ ఎట్ ట్విట్టర్' అనే సబ్జెక్ట్ లైన్‌తో ఈమెయిల్ ద్వారా వారి ఎంప్లాయిమెంట్ స్టేటస్ గురించి తెలియజేస్తామని ట్విట్టర్ ఈ-మెయిల్లో పేర్కొంది. అయితే విధుల్లో కొనసాగించాలనుకుంటున్న ఉద్యోగుల ఆఫీస్ అకౌంట్‌కు, ఉద్యోగం కోల్పోయిన వారి పర్సనల్ అకౌంట్‌కు ఈ-మెయిల్ వస్తుందని కంపెనీ వెల్లడించింది.
మస్క్ నిర్ణయంపై దావా
మరోవైపు, ట్విట్టర్ తన వర్క్‌ఫోర్స్‌లో సగం మందిని తొలగించాలనే ప్లాన్‌పై శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో క్లాస్-యాక్షన్ లాసూట్ దాఖలైనట్టు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ రిపోర్ట్ వెల్లడించింది. ఫెడరల్ లా, కాలిఫోర్నియా చట్టాలను ఉల్లంఘిస్తూ, నోటీసు లేకుండానే ట్విట్టర్ వర్కర్స్‌ను తొలగిస్తోందని కంపెనీ ఉద్యోగులు చెబుతున్నారని నివేదిక పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Elon Musk, Employees, Twitter, Twitter review