ప్రముఖ సోషల్ నెట్వర్క్ కంపెనీ 'ట్విటర్' (Twitter) టెస్లా సీఈవో ఎలన్ మస్క్ (Elon Musk) చేతుల్లోకి వెళ్లింది. ట్విటర్ కొనుగోలు డీల్‌ను పూర్తిచేస్తామని చెప్పిన ఆయన.. గురువారం శాన్ఫ్రాన్సిస్కోలోని హెడ్ ఆఫీస్‌కు వెళ్లారు. ఆ తర్వాత ట్విటర్‌ను పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఆయన ఆఫీసుకు వెళ్లిన కొన్ని గంటల్లోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్ (Parag Agrawal), సీఎఫ్‌వో నెడ్ సెగల్ (Ned Segal),లీగల్ పాలసీ, ట్రస్ట్ అండ్ సేఫ్టీ విభాగం అధిపతి విజయ గద్దె (Vijaya Gadde), జనరల్ కౌన్సెల్ సియాన్ ఎడ్జెట్‌ను ఎలన్ మస్క్ తొలగించారు. పరాగ్ అగర్వాల్, నెడ్ సెగల్ ఇప్పటికే ఆఫీసును వదిలిపెట్టి వెళ్లిపోయారు.
Twitter CEO Parag Agrawal and chief financial officer Ned Segal ‘have left the company’s San Francisco headquarters and will not be returning’, reports US media
— ANI (@ANI) October 28, 2022
పరాగ్ అగర్వాల్, విజయ గద్దె.. వీరిద్దరు భారతీయులు. పరాగ్ అగర్వాల్ దాదాపు పదేళ్లుగా ట్విటర్లో పనిచేస్తున్నారు. గతంలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్న ఆయన.. గత ఏడాది నవంబరులో ట్విటర్ సీఈవోగా బాధత్యలు చేపట్టారు. ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతాను తొలగించడంలో లీగల్ పాలసీ, ట్రస్ట్ అండ్ సేఫ్టీ విభాగం అధిపతిగా విజయ గద్దె కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఆమెను కూడా విధుల నుంచి ఎలన్ మస్క్ తప్పించడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, ఆరు నెలల హైడ్రామా తర్వాత ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్ ట్విటర్ కొనుగోలును ఆమోదించిన విషయం తెలిసిందే. గురువారమే ఈ విషయాన్ని వెల్లడించారు. ట్విటర్ కొత్త చీఫ్-ఇన్చార్జ్గా ప్రకటించుకున్నారు. అనంతరం శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.ఆఫీసుకు వెళ్తున్న సమయంలో తన చేతులో ఓ సింక్ పట్టుకుని వెళ్లారు. ఆ వీడియోను షేర్ చేసిన ఆయన.. ట్విట్టర్ హెడ్క్వార్టర్స్లోకి ఎంటర్ అవుతున్నానని.. అది సింక్ కావాల్సిందే అని క్యాప్షన్ పెట్టారు.
Entering Twitter HQ – let that sink in! pic.twitter.com/D68z4K2wq7
— Elon Musk (@elonmusk) October 26, 2022
ట్విట్టర్ సోషల్ నెట్వర్క్ కంపెనీనీ 44 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు మొదట ప్రకటించారు. ఆ తర్వాత మాట మార్చారు. స్పామ్ ఖాతాల సాకుతో డీల్‌కు బ్రేక్ వేస్తున్నట్లు చెప్పడం సంచలనంగా మారింది. అనంతరం ట్విట్టర్, మస్క్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఫేక్ అకౌంట్లను చూపిస్తూ.. ట్విట్టర్ మోసాలకు పాల్పడుతున్నట్లు ఆయన ఆరోపించారు. డీల్ నుంచి తప్పించుకునేందుకే మస్క్ ఆరోపణలు చేస్తున్నారని ట్విటర్ ఎదురుదాడికి దిగింది. అప్పటి నుంచీ సీఈవో పరాగ్ అగర్వాల్, ఎలన్ మస్క్‌కు పడడం లేదు. చివరకు ఈ డీల్ వ్యవహారం కోర్టుకు వరకు వెళ్లింది. కేసును ఎదుర్కోవడమా? ఒప్పందం ప్రకారం ట్విటర్‌ను కొనుగోలు చేయడమా? అనే దానిపై శుక్రవారం వరకు ఆయనకు గడువు ఉంది. అందుకు ఒక్కరోజు ముందే ట్విటర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన.. ఒప్పందాన్ని పూర్తి చేస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. ఇవాళ్టి నుంచి ట్విటర్ పూర్తిగా ఎలన్ మస్క్ నియంత్రణలో ఉంటుందని అమెరికా మీడియా తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.