టెక్ దిగ్గజం గూగుల్ (Google) ఇంటర్నెట్ యూజర్లు ఆన్‌లైన్ వేదికగా చేసే ప్రతి పనిని గమనిస్తుంటుంది. యూజర్ల బ్రౌజింగ్ యాక్టివిటీ, జీమెయిల్, యూట్యూబ్ యాక్టివిటీ, లొకేషన్ హిస్టరీ, గూగుల్ సెర్చ్‌లు, ఆన్‌లైన్ కొనుగోళ్ల వంటి వివరాలన్నీ గూగుల్ ట్రాక్ (Google Track) చేస్తుంది. అయితే ఇటీవల గూగుల్ తన యూజర్ల నుంచి 39 రకాల ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తోందని స్టాక్‌యాప్స్.కాం (StockApps.com) స్టడీ వెల్లడించింది. అమెజాన్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి కంపెనీల కంటే గూగుల్ కలెక్ట్ చేసే యూజర్ డేటా (User Data) చాలా ఎక్కువేనని ఆ స్టడీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే యూజర్ డేటాను గూగుల్ సేకరించిన ప్రతిసారీ యూజర్లకు తెలియజేసే ఒక యాప్ (App) అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త అప్లికేషన్‌ను బెర్ట్ హుబెర్ట్ డెవలపర్ క్రియేట్ చేశారు. దీని వల్ల ఉపయోగం ఏంటి? ఇది ఎలా పని చేస్తుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
"మీ కంప్యూటర్ గూగుల్‌కి డేటాను పంపిన ప్రతిసారీ ఒక శబ్దం వచ్చేలా నేను చాలా సింపుల్ టూల్ తయారు చేశాను" అని హుబెర్ట్ తన అప్లికేషన్‌కు లింక్‌ను షేర్ చేస్తూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అలాగే ఒక వీడియో కూడా పంచుకున్నారు. ఈ వీడియోలో అఫీషియల్ డచ్ గవర్నమెంట్ జాబ్ వెబ్‌సైట్‌ను ఆ డెవలపర్ ఓపెన్ చేస్తుండటం చూడవచ్చు. ఆ సైట్ లింక్‌ను టైప్ చేస్తుండగానే ఈ టూల్ ఒక బీప్ లాంటి సౌండ్ చేసింది.
గూగుల్ సెర్చ్ ఇంజన్ తాను టైప్ చేస్తున్న డేటాను కలెక్ట్ చేయడం వల్లే ఆ బీప్ సౌండ్ వచ్చినట్లు డెవలపర్ పేర్కొన్నారు. ఆ తరువాత చాలాసార్లు ఆ టూల్ సౌండ్స్ చేసింది. బహుశా ఆ సైట్ గూగుల్ అనలిటిక్స్ (Google Analytics) ఉపయోగిస్తుందేమోనని.. అందుకే గూగుల్ ప్రతి క్లిక్‌కి సమాచారం సేకరిస్తుందని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఏదేమైనా గూగుల్ యూజర్ ఆన్‌లైన్ డేటా మొత్తాన్ని ట్రాక్ చేస్తోందని ఈ యాప్ డెమో చూస్తుంటే స్పష్టంగా తెలుస్తోంది.
ప్రస్తుతానికి ఈ యాప్ లైనక్స్ (Linux) వాడే యూజర్ల కోసం మాత్రమే తయారు చేశారు. అందువల్ల ఇది ప్రస్తుతం విండోస్ కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్లలో పని చేయదు. గూగుల్‌టెల్లర్ (Googleteller) అని పిలిచే ఈ యాప్ (App) వివిధ సేవల కోసం గూగుల్ ఉపయోగించే IP అడ్రస్‌ల లిస్ట్ ఉపయోగిస్తూ పని చేస్తుంది. అలా ఈ యాప్ మీ పీసీ ఈ IP అడ్రస్‌లలో దేనికైనా కనెక్ట్ అవుతే.. మీ డేటా గూగుల్‌తో షేర్ అవుతుందని ఒక అలర్ట్ సౌండ్ ప్లే ద్వారా మీకు తెలియజేస్తుంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని ఉపయోగించినప్పుడు మాత్రమే కాకుండా ఫైర్‌ఫాక్స్‌ని యూజ్ చేస్తున్నప్పుడు కూడా ఈ యాప్ సౌండ్ చేస్తోంది.
https://twitter.com/bert_hu_bert/status/1561466204602220544?t=Bv6zozIdBpxCQkLhGkcClw&s=19
మీరు ఆన్‌లైన్‌లో ఎంతలా ట్రాకింగ్‌కి గురవుతున్నారో, మీ డేటా ఎంతగా గూగుల్‌కి సెండ్ అవుతుందో ఈ యాప్ ద్వారా తెలుసుకోవడం ఈజీ అవుతుంది. గూగుల్ బిజినెస్ మోడల్ మొత్తం తన యూజర్ డేటా కలెక్షన్ పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఆ కంపెనీ ప్రైవసీ పాలసీ తీసుకొచ్చి యూజర్ల అంగీకారంతో వారి ప్రైవేట్ డేటా ట్రాక్ చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Applications, Data theft, Google