Rusting on Moon: చంద్రుడికి తుప్పు పడుతోంది తెలుసా?

Rusting on Moon: అదేంటి... చందమామకు తుప్పేంటి? అనిపిస్తోంది కదూ. అదే సమయంలో... అయ్యో అని కూడా అనిపించి ఉండాలే. ఎందుకంటే మన చందమామ తుప్పట్టిపోతే ఎలా?

news18-telugu
Updated: September 7, 2020, 2:04 PM IST
Rusting on Moon: చంద్రుడికి తుప్పు పడుతోంది తెలుసా?
Rusting on Moon: చంద్రుడికి తుప్పు పడుతోంది తెలుసా?
  • Share this:
చందమామ అందాలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ అలరిస్తాయి. అలాంటి చంద్రుడికి ఇనుముకి పట్టినట్లు తుప్పు పడుతోందని శాస్త్రవేత్తలు తాజాగా తెలిపారు. ఇందుకు కారణాలను అన్వేషిస్తున్నారు. 2008లో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 1 ఆర్బిటర్ ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. చంద్రుడిపై నీరు ఉందని కనుక్కున్న చంద్రయాన్ 1, తాజాగా జాబిల్లికి సంబంధించిన చిత్రాల్ని పంపింది. వాటి ఆధారంగా చంద్రుడి ధ్రువాల దగ్గర శిలలు తుప్పు పట్టి ఉన్నట్టు తెలిసింది. ఇనుము తుప్పు పట్టడానికి నీరు, ఆక్సిజన్ అవసరం. అవి రెండూ ఇనుముతో చర్య జరిపినప్పుడు... ఇనుము ఉపరితలంపై ఎరుపు రంగులో ఐరన్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. దీన్నే మనం తుప్పు అంటాం. ఇప్పటివరకు భూమి, అంగారకుడి మీదనే తుప్పు పట్టడానికి అవకాశముండే ధాతువులు ఉన్నట్టు శాస్త్రవేత్తలు భావించారు.

చంద్రుడి ఉపరితలంపై ఆక్సిజన్ ఉన్నట్లు ఇప్పటి వరకు తేలలేదు. దీంతో శాస్త్రవేత్తలు ప్రయోగాలు మొదలుపెట్టారు. దీనిపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. "చంద్రయాన్ 1 పంపిన తాజా చిత్రాలు ప్రపంచానికి కొత్త విషయాలు తెలిసేలా చేశాయి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు మొదలయ్యాయి. ఇస్రో ప్రయోగించబోయే చంద్రయాన్ 3లో కూడా ల్యాండర్, రోవర్ ఉంటాయి. కానీ ఆర్బిటార్ మాత్రం ఉండదు" అని చెప్పారు.

నాసా శాస్త్రవేత్తలు కూడా దీనిపై స్పందించారు. "చందమామ ఉపరితలంపై తుప్పు ఏర్పడేందుకు అవకాశమే లేదు. కానీ చంద్రుడి ఉపరితలంపై నీరు ఉన్నట్లు ఇంతకు ముందే కనుక్కున్నాం. అంటే అక్కడ ఖనిజాలు ఉండే అవకాశమూ ఉంది. ఆ నీరు, ఇనుము వంటి ఖనిజాలతో రసాయన చర్య జరిపినప్పుడు తుప్పు ఏర్పడే అవకాశం ఉంది. మరిన్ని ప్రయోగాలు చేశాకే దీనికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది" అని నాసా జేపీఎల్ శాస్త్రవేత్త అభిగెల్ ఫ్రేమన్ వివరించారు.

చంద్రుడి ఉపరితలంపై చాలావరకు పొడి వాతావరణమే ఉంటుంది. గాలి లేని అలాంటి ప్రాంతంలో తుప్పు కనిపించడం ఆశ్చర్యమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎప్పుడూ సౌర గాలులతో నిండి ఉండే ఉపరితలంపై హెమటైట్ అనే ధాతువు ఏర్పడటం, అది రసాయన చర్యగా మారి తుప్పు ఏర్పడటం ఆశ్చర్యంగా ఉందని స్పేస్ సైంటిస్టులు చెబుతున్నారు. సాధారణంగా అక్కడ అధిక మొత్తంలో ఉండే హైడ్రోజన్ రసాయన చర్యలను అడ్డుకుంటుంది. అలాంటప్పుడు ఐరన్ ఆక్సైడ్ ఏర్పడటం నమ్మలేని విధంగా ఉందని చెబుతున్నారు. భూమి అయస్కాంత క్షేత్రం నుంచి చంద్రుడు వెళ్లినప్పుడు ఆ అయస్కాంత ప్రభావం చంద్రుడి మీద పడి కాస్త భాగం హెమటైట్ ప్రభావానికి గురయ్యే అవకాశమూ ఉండొచ్చనీ, దాని వల్ల కూడా చంద్రుడి ధ్రువాల దగ్గరున్నరాతి శిలలు ఎర్రగా మారి తుప్పు పట్టే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. సాధారణంగా సూర్యుడు, చంద్రుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉందట. కానీ ఇవన్నీ శాస్ర్తీయంగా నిరూపితం కాని అంశాలే. ఏది ఏమైనా మరింత లోతుగా పరిశోధనలు చేశాకే జాబిల్లి ధ్రువాలు తప్పు పట్టడానికి కారణాలు తెలుస్తాయి.
Published by: Krishna Kumar N
First published: September 7, 2020, 1:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading