Male Infertility: రాత్రిపూట మొబైల్ అతిగా వాడుతున్నారా? అయితే ఈ సమస్యలు రావచ్చు..

ప్రతీకాత్మక చిత్రం

మొబైల్ ఫోన్.. ఇది లేకుండా ఇప్పుడు మనకు ఒక్కరోజు కూడా గడవదు. ఇప్పుడు ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యవసరంగా మారింది. జేబులో పెన్ను లేని వారైనా ఉంటారేమో కాని సెల్ ఫోన్ ఉండని వారు లేరంటే అతిశయోక్తి కాదు. కనీసం అరగంటకోసారైనా మొబైల్ చూడనిదే రోజు గడవని పరిస్థితి. ముఖ్యంగా, ఈ జాడ్యం యువతలో...

  • Share this:
మొబైల్ ఫోన్.. ఇది లేకుండా ఇప్పుడు మనకు ఒక్కరోజు కూడా గడవదు. ఇప్పుడు ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యవసరంగా మారింది. జేబులో పెన్ను లేని వారైనా ఉంటారేమో కాని సెల్ ఫోన్ ఉండని వారు లేరంటే అతిశయోక్తి కాదు. కనీసం అరగంటకోసారైనా మొబైల్ చూడనిదే రోజు గడవని పరిస్థితి. ముఖ్యంగా, ఈ జాడ్యం యువతలో ఎక్కువగా కనబడుతోంది. వారు రోజులో ఎక్కువ సేపు మొబైల్ తోనే గడిపేస్తూ దానికి బానిసగా మారుతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా మొబైల్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. అయితే, అతిగా మొబైల్ వినియోగించడం వల్ల ఉపయోగాల కంటే అనర్థాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి పూట మొబైల్ వినియోగం చాలా ప్రమాదమని, దాని నుండి వచ్చే నీలి కాంతి నిద్రలేమికి కారణమవుతుందని, అది క్రమంగా మగవారిలో వంధ్యత్వానికి కారణమవుతుందని ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో తేలింది. కాగా, ఈ అధ్యయనం ఫలితాలను వర్చువల్ SLEEP 2020 సమావేశంలో పంచుకున్నారు శాస్త్రవేత్తలు.

గాడ్జెట్ల నుండి వచ్చే కాంతి మగవారి శుక్ర కణాల నాణ్యతను దెబ్బతీస్తుందని అధ్యయనంలో తేల్చి చెప్పింది. కాగా, ఆరోగ్యకరమైన పురుషుల స్పెర్మ్, సంతానోత్పత్తిపై ఫోన్ రేడియేషన్ ప్రభావంపై ఈ అధ్యయనం కొనసాగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం, మొబైల్ అతి వినియోగం వల్ల పురుషుల్లో 15 నుండి 20 శాతం వంధ్యత్వం వచ్చే అవకాశం ఉందని, తద్వారా పురుషుల సంతానోత్పత్తి రేటు 20 నుండి 40 శాతం మేర తగ్గుతుందని తేలింది. ఈ కారణంగా భారతదేశంలో 23 శాతం మంది పురుషులు వంధ్యత్వంతో బాధపడుతున్నారని షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. వంధ్యత్వానికి వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడం, వాటికి చికిత్స చేయడం చాలా అవసరం అని ఈ అధ్యయనం నొక్కి చెప్పింది. ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా పరికరాల వాడకాన్ని కూడా తగ్గించాలని హెచ్చరించింది.

రేడియేషన్‌తో డీఎన్‌ఏకు హానికరం..
స్మార్ట్ ఫోన్ల అతి వినియోగం, సాయంత్రం తర్వాత అతిగా వాడకం స్పెర్మ్ మొటిలిటీ, స్పెర్మ్ ప్రోగ్రెస్సివ్ మొటిలిటీను తగ్గిస్తుందని అధ్యయనం తెలిపింది. ఈ ఎలక్ట్రానిక్ పరికరాల నుండి వెలువడే షార్ట్ వేవ్ లెంత్ లైట్ (SWL) స్పెర్మ్ కౌంట్ పై ప్రభావం చూపుతుందని, తద్వారా పురుషుల్లో వంధ్యత్వ రేటు పెరుగుతుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా, స్మార్ట్ ఫోన్ల నుండి వెలువడే కాంతి నిద్రకు భంగం కలిగిస్తుందని, తద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వెల్లడించింది. వీటి నుండి వెలువడే రేడియేషన్ అనారోగ్యానికి గురిచేస్తుదని హెచ్చరించింది.

ఈ రేడియేషన్ DNA కి కూడా హాని కలిగిస్తుందని పేర్కొంది. దీని వల్ల కణాలు స్వయంగా కోలుకునే సామర్థ్యాన్ని కోల్పోతాయని, ఈ రేడియేషన్లు ఆడవారిలోనూ సమస్యలను కలిగిస్తాయట. వారిలో గర్భస్రావం కావడానికి ఇది కూడా ఓ కారణమని స్పష్టం చేసింది. అందువల్ల, సాయంత్రం తర్వాత.. ముఖ్యంగా రాత్రి చీకటి సమయంలో మొబైల్ వినియోగాన్ని తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. పడుకోవడానికి కనీసం అరగంటకు ముందైనా మీ స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని మానేయాలని అధ్యయనవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Published by:Sambasiva Reddy
First published: