ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్‌కి బదులుగా వేరే వాటిని పంపిస్తున్న మోసాలు పెరుగుతున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ సైట్స్ నుంచి కొనుగోలు చేసినప్పుడు కూడా ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. దిగ్గజ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) దీనికి మినహాయింపేమీ కాదు. ఈ కంపెనీ ఖరీదైన ప్రొడక్ట్స్‌కి బదులు సబ్బులు, ఇటుకలు పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో కొద్ది నెలల క్రితం ఐఫోన్‌ను ఆర్డర్ చేసిన వినియోగదారుడికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. అతనికి కంపెనీ ఐఫోన్‌కు బదులుగా డిటర్జెంట్ సోప్ (Detergent Soap), కీప్యాడ్ ఫోన్‌ను పంపించింది. దాంతో షాక్ అయిన సదరు కస్టమర్ కన్జ్యూమర్ కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ కేసును నిషితంగా పరిశీలించిన కన్జ్యూమర్ కమిషన్ కస్టమర్‌కి పరిహారంగా రూ.25,000 చెల్లించాలని ఫ్లిప్‌కార్ట్‌తో సహా రిటైలర్‌ను కమిషన్ ఆదేశించింది. అంతేకాదు, కస్టమర్ చెల్లించిన డబ్బును రీఫండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే.. కొద్ది నెలల క్రితం కర్ణాటకకు చెందిన హర్ష ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ ఐఫోన్ 11 (Green 65GB)ను ఆర్డర్ చేశారు. ముందుగానే రూ.48,999 కూడా కట్టారు. కొద్ది రోజుల తర్వాత ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్ ఒక ప్యాకేజ్ ఇచ్చి వెళ్లిపోయాడు. దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో ఐఫోన్ 11కి బదులుగా చిన్న కీప్యాడ్ ఫోన్, 140-గ్రాముల నిర్మ బట్టల సబ్బు కనిపించింది. ఐఫోన్ ఉంటుందని ఎంతో ఆశగా బాక్స్ తెరిచిన అతనికి ఇవి కనిపించడంతో షాక్ తగిలినట్లు అయింది. తర్వాత తేరుకున్న ఆ వినియోగదారుడు తాను మోసపోయానని గ్రహించారు. న్యాయం కోసం తప్పుడు ఉత్పత్తులను పంపిన ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్, సేన్ రిటైల్స్‌లపై కొప్పల్‌లోని డిస్టిక్ కన్జ్యూమర్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
హర్ష 2021లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో తాను అందుకోని ఐఫోన్ కోసం రూ. 48,999 చెల్లించానని, వాపసు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వీస్‌లో లోపం కారణంగా తాను అనుభవించిన మానసిక వేదనకు పరిహారం కూడా చెల్లించాలని కోరారు. ఈ వ్యవహారంలో ఫ్లిప్‌కార్ట్, రిటైలర్ తప్పు ఉన్నట్లు కమిషన్ గుర్తించింది. డెలివరీ సేవలలో లోపాలు, అన్యాయమైన వాణిజ్య పద్ధతులతో వినియోగదారుడికి మానసిక వేదన కలిగించినందుకు, శారీరక వేధింపులకు గురి చేసినందుకు ఫ్లిప్‌కార్ట్ పరిహారం చెల్లించాల్సిందేనని కమిషన్ తీర్పు ఇచ్చింది. కస్టమర్ల శాటిస్ఫాక్షన్‌ను కంపెనీలు ముఖ్య బాధ్యతగా తీసుకోవాలని, దానిని నిర్లక్ష్యం చేయకూడదని ఈ సందర్భంగా గుర్తు చేసింది. తప్పుడు వస్తువులను పంపించడం ద్వారా డబ్బులు దండుకొని, తర్వాత శిక్ష అనుభవించకుండా కంపెనీలు కస్టమర్ల నుంచి తప్పించుకోలేవని కూడా పేర్కొంది.
కస్టమర్ నుంచి ఫుల్ అమౌంట్ కలెక్ట్ చేసి తప్పుడు ఉత్పత్తులను పంపించినందుకు ఫ్లిప్‌కార్ట్, రిటైలర్ బాధ్యత వహించాల్సిందిగా కమిషన్ వ్యాఖ్యానించింది. సర్వీస్‌లో లోపం, అన్యాయమైన వ్యాపార పద్ధతులకు గానూ రూ.10,000.. మానసిక వేదన, శారీరక వేధింపులు, వ్యాజ్యం ఖర్చులకు గానూ మరో రూ.15,000 పరిహారం చెల్లించాలని ఫ్లిప్‌కార్ట్, సేన్ రిటైల్స్‌ను కమిషన్ ఆదేశించింది. అలాగే, ఫోన్ కోసం కస్టమర్ చెల్లించిన రూ.48,999 మొత్తాన్ని కూడా ఎనిమిది వారాల్లోగా వాపసు (Refund) చేయాలని ఆదేశించింది. ఈ సంఘటనతో ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికైనా కరెక్ట్ ప్రొడక్ట్స్ మాత్రమే పంపించేలా జాగ్రత్తలు తీసుకుంటుందో లేదో చూడాలి. ఇక మోసపోయిన వినియోగదారులు తమ హక్కులను వినియోగించుకుని న్యాయం పొందచ్చని కూడా ఈ సంఘటన చెప్పకనే చెబుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flipkart, Flipkart offers, IPhone 15, Technology