ట్విటర్.. దాదాపు అందరి ఫోన్లలో ఉండే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లను సంపాదించుకున్న అమెరికన్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అలరిస్తూనే ఉంటుంది. ప్రపంచ దేశాల అధినేతలు, సెలబ్రెటీలు సైతం ట్విట్టర్‌ను వాడేందుకు ఆసక్తి చూపుతుంటారు. మారుతున్న యూజర్ల అభిరుచికి తగ్గట్లు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తేవడమే దీని పాపులారిటీకి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. తరచూ కొత్త కొత్త అప్ డేట్లను అందించే ట్విట్టర్ తాజాగా ఇదే తరహాలో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు ఇక నుంచి తమ మొబైల్ యాప్‌లో యూట్యూబ్‌కు సంబంధించిన వీడియోలను అక్కడే చూసే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇది వరకు ట్విట్టర్లో పోస్ట్ చేసిన యూట్యూబ్ వీడియోలను చూడటానికి, దానిపై క్లిక్ చేయగానే యూట్యూబ్ యాప్ ఓపెన్ అయ్యేది. అక్కడే వీడియోలను చూడాల్సి వచ్చేది. తద్వారా కొత్తగా వచ్చిన ట్వీట్స్, అప్డేట్స్ను చూడటంలో ఇబ్బందులు ఏర్పడేవి. కానీ తాజా ఫీచర్‌తో ఈ ఇబ్బందులు తొలిగిపోనున్నాయి.
ప్రస్తుతం యూట్యూబ్ లింక్‌పై క్లిక్ చేస్తే మాత్రం నేరుగా బ్రౌజర్ లేదా యూట్యూబ్ యాప్ ఓపెన్ అవుతుంది. అక్కడే సంబంధిత వీడియోను చూడాల్సి వస్తుంది. ఫేస్బుక్ ఈ ఫీచర్‌ను తన మొబైల్ యాజర్లకు ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఫేస్బుక్ మొబైల్ యాప్ వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇప్పుడు ఇదే ఫీచర్‌ను ట్విట్టర్ కూడా అందించి యూజర్లను పెంచుకోవాలని యోచిస్తోంది. ఈ నూతన ఫీచర్ ప్రస్తుతానికి, కొంతమంది iOS వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
కొత్త ఫీచర్‌పై ట్విట్టర్ స్పందిస్తూ.. ‘‘యూజర్ ఫ్రెండ్లీ విధానాల్లో భాగంగా సంస్కరణలను చేపడుతున్నాం. ప్రస్తుతం, ట్విట్టర్లో పోస్ట్ చేసిన యూట్యూబ్ వీడియోలను యాప్ వదలకుండా నేరుగా అక్కడే చూసేలా కొత్త ఫీచర్‌ను డిజైన్ చేశాం. ఇది కొంతమంది ఐఓఎస్ యూజర్లకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. దీన్ని త్వరలోనే అన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందించనున్నాం. మీ ట్విట్టర్ మొబైల్ యాప్‌ను అప్డేట్ చేయడం ద్వారా ఈ సరికొత్త ఫీచర్‌ను ట్రై చేయవచ్చు.” అని ట్విట్టర్ తెలిపింది.
అయితే, డెస్క్‌టాప్ యూజర్లకు ఈ ఫీచర్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. ట్విట్టర్ వెబ్‌లో యూజర్లు తమ అకౌంట్‌ను సహజంగా బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తారు కాబట్టి, ఆయా యూట్యూబ్ వీడియోలు అక్కడే ప్రసారమవుతాయి. కానీ, ఫోన్లో చూసే సమయంలో ట్విట్టర్ నుంచి యూట్యూబ్‌కు వెళ్లాల్సి వస్తుంది. ఇది యూజర్‌కు చిరాకు తెప్పించే అంశం. ఈ ఇబ్బందిని తొలగించేందుకు ట్విట్టర్ ఈ సరికొత్త ఫీచర్‌ను చేర్చింది. కాగా, ట్విట్టర్ ఇటీవలి కాలంలో వరుస ఫీచర్లను టెస్ట్ చేస్తూ దూకుడు మీదుంది. గత వారం, 4K ఫోటోలను అప్‌లోడ్ చేసే సామర్థ్యాన్ని పెంచింది. వీటి ద్వారా మీ టైమ్‌లైన్‌లో ఇక నుంచి పూర్తి హెచ్డీ క్వాలిటీ చిత్రాలను చూడవచ్చు. దీనితో పాటు ఇతర వ్యక్తులతో వాయిస్ చాట్ చేయడానికి అనుమతించే కొత్త ఫీచర్‌ను కూడా చేర్చింది. ఈ నెల ప్రారంభంలోనే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకి అందుబాటులోకి వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Technology, Twitter, Youtube