సోషల్ మీడియా రంగంలో తనదైన ముద్ర వేస్తూ దూసుకెళుతోంది ఫేస్బుక్ యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్. ఇతర కంపెనీల నుంచి పెరుగుతోన్న పోటీని ధీటుగా ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. తద్వారా యూజర్ల సంఖ్యను పెంచుకుంటోంది. ఇలా, ఇన్‌స్టాగ్రామ్‌కు పెద్దలే కాదు, పిల్లలు సైతం అట్రాక్ట్ అవుతుండటంతో, వారి కోసం మరో అడుగు ముందుకేస్తోంది ఆ సంస్థ. 6 నుండి 13 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌ను వాడేలా ప్రత్యేక ఛాట్ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తేనుంది. 2017లో ఫేస్బుక్ యాజమాన్యంలోని మెసెంజర్ కూడా 6 నుండి -12 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల కోసం మెసెంజర్ కిడ్స్ అనే చాట్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. పిల్లల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ‘మెసెంజర్ కిడ్స్’ ప్లాట్ఫార్మ్కు వారి నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో ఇప్పుడు ఫేస్బుక్ చూపు తన దృష్టి ఇన్స్టాగ్రామ్ యాప్‌పై పెట్టింది.
ఈ నూతన అప్డేట్పై ఇన్స్టాగ్రామ్ సీఈవో మోసేరి ట్వీట్ చేస్తూ.. ‘‘తమ స్నేహితులతో టచ్‌లో ఉండేందుకు సోషల్ మీడియా అకౌంట్ కావాలని పిల్లలు తమ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. అందువల్ల, అత్యంత సేఫ్టీ ఫీచర్లతో, పిల్లల కదలికలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రత్యేక ఫీచర్స్‌ను జోడించి కొత్త ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి తెస్తున్నాం. అతి త్వరలోనే ఇన్స్టాగ్రామ్ కిడ్స్ ప్లాట్ఫార్మ్ పిల్లలకు అందుబాటులోకి వస్తుంది. మా టీం ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై కసరత్తు ప్రారంభించింది." అని ఆయన అన్నారు. కాగా, ఈ ప్రాజెక్టు కోసం ఇన్స్టాగ్రామ్ వైస్ ప్రెసిడెంట్ పావ్ని దివాన్జీ, సీఈవో మోసేరి కలిసి పనిచేస్తున్నారు.
టీనేజర్స్‌కు కొత్త సేఫ్టీ ఫీచర్స్..
ఇదిలా ఉంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో టీనేజర్లకు సురక్షితమైన వాతావరణం అందించేందుకు ఇన్స్టాగ్రామ్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను చేర్చింది. 18 ఏళ్లలోపు టీనేజర్లకు అడల్ట్స్ సందేశాలను పంపకుండా నిరోధించే ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో, ఇకపై ఎవరైనా తమను ఫాలో చేయని టీనేజర్స్‌కు అడల్డ్స్ మెసేజ్ చేసే అవకాశం ఉండదు. దీనికి సంబంధించిన భద్రతా ఫీచర్‌ను చేర్చింది. మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ సహాయంతో ఈ ఫీచర్ రూపొందించింది ఇన్స్టాగ్రామ్. అయితే, సాధారణంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లో సైన్అప్ చేసేటప్పుడు వారి వయస్సు వివరాలు కోరుతుందన్న విషయం తెలిసిందే. అయితే, కొంత మంది టీనేజర్స్ ఎక్కువ వయసును నమోదు చేసి అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో, ఇలాంటి ఫేక్ అకౌంట్లను నిరోధించేందుకు, వారి అసలు వయస్సును నిర్థారించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని ఇన్స్టాగ్రామ్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌కు ప్రస్తుతం 1 బిలియన్కు పైగా నెలవారీ యాక్టివ్ వినియోగదారులు ఉన్నారు.
Keywords
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.