డ్రోన్స్.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలా రంగాల్లో విస్తరిస్తున్న టెక్నాలజీ. నిర్మాణ రంగంలో వాణిజ్య అవసరాలకు, దేశ నిఘా అవసరాలకు, పర్యాటక రంగం, వ్యవసాయ రంగం.. ఇలా చాలా రంగాల్లో డ్రోన్స్ విరివిగా వాడుతున్నారు. ఇటీవలి కాలంలో పబ్లిక్ ఫంక్షన్లలో, పెళ్లిళ్లలోనూ డ్రోన్స్ ఉపయోగం పెరిగింది. అయితే గాల్లో ఎగిరే డ్రోన్స్ మాత్రమే కాదు.. మున్ముందు నీళ్లలో ఈదే స్విమ్మింగ్ డ్రోన్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి.
స్విమ్మింగ్ డ్రోన్స్ అందుబాటులోకి వస్తే.. ప్రకృతి విపత్తులు, నదులు సముద్రాల్లో మనుషులు గల్లంతైన సందర్భాల్లో ఇవి ఎక్కువగా ఉపయోగపడుతాయి. ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు కావాల్సిన ఆహార ప్యాకెట్లు, మందులు ఇతరత్రా డ్రోన్స్ ద్వారా సరఫరా చేయవచ్చు. అలాగే నదులు, సముద్రాల్లో ప్రమాదవశాత్తు ఎవరైనా గల్లంతైతే.. లోతుకు వెళ్లి వారిని రక్షించడం గజ ఈతగాళ్లకు కష్టంగా మారింది. స్విమ్మింగ్ డ్రోన్స్ అందుబాటులోకి వస్తే... వేగంగా ఎంత లోతుకైనా వెళ్లి మునిగిపోతున్న వ్యక్తులను కాపాడగలవు.
ఏపీకి చెందిన అల్ఘీసర్ అనే మెకానికల్ ఇంజనీర్ భారత్‌లో మొట్టమొదటి స్విమ్మింగ్ డ్రోన్‌ను తయారుచేశారు. 2017 అగస్టులో 'సెయిఫ్ సీస్ వాటర్ డ్రోన్' పరికరాన్ని రూపొందించారు. ఇది నీళ్లలో వేగంగా ఈదుతూ.. సుమారు వంద కేజీల బరువును నీటి లోపలి నుంచి బయటకు మోసుకురాగలదు. సముద్రంలో దాదాపు 3కి.మీ వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చు.
ఒక అంచనా ప్రకారం రాబోయే 15 ఏళ్లలో అమెరికా గగనతలంపై నిరంతర పర్యవేక్షణకు దాదాపు 20 వేలకు పైగా డ్రోన్లను ఉపయోగించనున్నారు. భవిష్యత్తులో మరింత అత్యాధునిక స్విమ్మింగ్ డ్రోన్స్ అందుబాటులోకి వస్తే.. నేవీ నిఘా అవసరాల కోసం అన్ని దేశాలు ఈ టెక్నాలజీని వాడుకునే అవకాశం ఉంది. అటు వాణిజ్యపరంగా డ్రోన్ రంగంలో ఉద్యోగవకాశాలు కూడా పెరుగుతుండటం భవిష్యత్తులో దీని విస్తృతికి సంకేతంగా కనిపిస్తోంది.
Published by:Srinivas Mittapalli
First published:March 06, 2019, 10:30 am