Solar Technology: ఇండోర్ ఎల్‌ఈడీ లైట్లతో విద్యుత్ శక్తి.. సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన శాస్త్రవేత్తలు..

ప్రతీకాత్మక చిత్రం

Solar Technology: సోలార్‌ప్యానెల్స్‌ గురించి వినగానే మనకు మొదట గుర్తొచ్చేది సూర్యకాంతి. ఈ ‌ప్యానెల్స్ పై‌ సూర్యకాంతి పడగానే విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ సూర్యకాంతి అవసరం లేకుండానే ఇంట్లో లైట్ బల్బుల ద్వారా కూడా విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయవచ్చని చెబుతున్నారు పరిశోధకులు. పూర్తి వివరాలను తెలుసుకోండి..

  • Share this:
సోలార్‌ప్యానెల్స్‌ గురించి వినగానే మనకు మొదట గుర్తొచ్చేది సూర్యకాంతి. ఈ ‌ప్యానెల్స్ పై‌ సూర్యకాంతి పడగానే విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ సూర్యకాంతి అవసరం లేకుండానే ఇంట్లో లైట్ బల్బుల ద్వారా కూడా విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయవచ్చని చెబుతున్నారు పరిశోధకులు. అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీకి చెందిన ఆండ్రూ షోర్, బెహ్రాంగ్ హమదానీ అనే పరిశోధకులు ఇండోర్ సోలార్ సెల్‌ల సామర్థ్యాలపై తమ పరిశోధనలను ప్రదర్శిస్తున్నారు. ఎఐపీ పబ్లిషింగ్ హారిజన్స్-ఎనర్జీ స్టోరేజ్ అండ్ కన్వర్షన్ వర్చువల్ కాన్ఫరెన్స్ ఆగస్టు 4, 5, 6వ తేదీలలో జరుగుతోంది. ఈ కాన్ఫరెన్స్ లో పరిశోధకులు ఎల్‌ఈడీ కింద విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే ఇండోర్ సోలార్ సెల్‌ల సామర్థ్యాలపై తమ పరిశోధనలను ప్రదర్శిస్తున్నారు.  ఈ మూడు రోజుల కాన్ఫరెన్స్ లో "ఇండోర్ ఫోటోవోల్టాయిక్స్ ఫర్ బ్యాటరీ పవర్డ్ సెన్సార్" పేరిట వారు తమ పరిశోధనలను పరిచయం చేస్తున్నారు.

అయితే సోలార్ సెల్‌లను ఛార్జింగ్ చేయడానికి పరిశోధకులు ఒకటే ఒక లైటు ఉపయోగించారు. అదే వైట్ కలర్ లో ఉన్న ఎల్‌ఈడీ లైట్. ఇది 3000K కలర్ కోఆర్డినేట్ టెంపరేచర్ కలిగి ఉంటుంది. ఇది సాధారణ ఇండోర్ లైట్స్ మాదిరి 1,000 లక్స్ ఇల్లుమినన్స్ కలిగి ఉంటుంది. దీనిని ఉపయోగించి మూడు వేర్వేరు మాడ్యూల్స్ పరీక్షించారు. అవి గాలియం ఇండియం ఫాస్ఫైడ్ (GaInP) సెమీకండక్టర్, గాలియం ఆర్సెనైడ్ (GaAs) సెమీకండక్టర్, సిలికాన్ (Si) సెమీకండక్టర్. అయితే ఎల్‌ఈడీ లైట్ సెట్టింగ్‌ల కింద, GaInP మినీ-మాడ్యూల్ అత్యధిక పవర్ కన్వర్షన్ ఎఫిషియెన్సీతో మొదటి స్థానంలో నిలిచింది. తరువాత GaAs మినీ-మాడ్యూల్ నిలిచింది. ఇక అత్యల్ప పనితీరుతో సిలికాన్ మినీ-మాడ్యూల్ నిరాశపరిచింది. ఈ విషయాన్ని తాజాగా ఆండ్రూ వెల్లడించారు. GaInP, GaAs మాడ్యూల్స్ కనిపించే-స్పెక్ట్రం అయిన LED లైట్ సోర్స్‌తో మంచి స్పెక్ట్రల్ మ్యాచ్‌ను కలిగి ఉన్నాయని ఆండ్రూ తెలిపారు. వివిధ వనరుల నుంచి ఇండోర్ ప్రదేశాల్లో పుష్కలంగా పరిసర కాంతి లభిస్తుంది.

అందువల్ల ఆఫీసులలో ఉండే ఒక్క సీలింగ్ లైట్ అయినా, సరే.. చిన్న-మాడ్యూల్స్‌ని ఛార్జ్ చేయడానికి సరిపోతుందని ఆండ్రూ చెప్పుకొచ్చారు. పరిసర కాంతి ఇండోర్ బ్యాటరీలు, సెన్సార్‌లకు విద్యుత్ వనరుగా ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. GaInP చాలా తక్కువ కాంతిలో కూడా అధిక సామర్థ్యాన్ని కొనసాగిస్తుందని ఆండ్రూ చెప్పారు. అయితే అన్ని ఇండోర్ లైట్ సోర్స్‌లు ఎల్‌ఈడీలు కావని ఆయన అన్నారు. రకరకాల లైట్ సోర్స్‌లు ఫోటోవోల్టాయిక్‌ టెక్నాలజీ పవర్ కన్వర్షన్ ఎఫిషియెన్సీని ప్రభావితం చేస్తాయని తెలిపారు. త్వరలోనే రియల్ లైఫ్ పరిస్థితులలో మినీ-మాడ్యూల్స్ టెస్ట్ చేస్తామని వివరించారు. ఈ టెస్టులో మినీ-మాడ్యూల్ శక్తితో ఒక సెన్సార్ ని ఆపరేట్ చేయాలని పరిశోధకులు భావిస్తున్నారు.
Published by:Veera Babu
First published: