Electric Scooter HOPE: కేవలం 20 పైసలతో కిలో మీటర్ ప్రయాణం.. మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం పెట్రోల్ రేటు రూ.100 చేరువలో ఉంది. దీంతో సామాన్యుడు బైక్ ను బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఓ స్టార్ట్ అప్ కేవలం రూ. 20 పైసలతో కిలో మీటర్ ప్రయాణించే వాహనాన్ని తయారు చేసింది.

  • Share this:
పెరుగుతున్న జనాభాతో పాటు అవసరాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మనదేశంలో ద్విచక్రవాహనాలకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పాటు ఇంధన ధరలు కూడా వృద్ధి చెందుతుండటంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు వాహన ప్రియులు. ఈ కారణంగా చాలా కంపెనీలు విద్యుత్ ద్విచక్రవాహనాల ఉత్పత్తిపై దృష్టి సారించాయి. తాజాగా ఓ స్టార్టప్ సంస్థ వినూత్న ఈ-స్కూటర్ ను అభివృద్ధి చేసింది. ఈ టూ-వీలర్ ద్వారా ప్రయాణ ఖర్చు కిలోమీటరుకు 20 పైసలే ఉంటుందని ఆ సంస్థ స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఐఐటీ-దిల్లీకి చెందిన ఆదిత్య తివారీ గేలోస్ మొబిలిటీ అనే అంకుర సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ స్టార్టప్ ద్వారా హోప్(HOPE) అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంఛ్ చేశాడు. "ఇది అందుబాటు ధరకు దొరికే ఇంటర్నెట్ కనెక్టెడ్ స్కూటర్. ప్రస్తుతం మార్కెట్లో లాంఛ్ చేశాం. బడ్జెట్ ధరకే వచ్చే ఈ టూ-వీలర్ నడిపేందుకు కిలోమీటరుకు 20 పైసల ఖర్చు మాత్రమే అవుతుంది. సాధారణ పెట్రోల్ స్కూటర్లో కిలోమీటరుకు రూ.2.5 ఖర్చు అవుతుంది" అని కంపెనీ వ్యవస్థాపకుడు ఆదిత్యా తివారీ అన్నారు.

ప్రస్తుతం దీని ధర రూ.46,999లని, పోర్టబుల్ బ్యాటరీ సదుపాయం ఇందులో ఉందని చెప్పాడు. అంతేకాకుండా రేంజ్ విషయంలో వినియోగదారులకు ఇందులో రెండు ఆప్షన్లు ఇచ్చామని తెలిపాడు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 75 కిలోమీటర్లు రేంజ్ ఇచ్చే ఆప్షన్ మొదటిది కాగా.. 50 కిలోమీటర్ల రేంజ్ రెండోది అని అతడు స్పష్టం చేశాడు. ఈ స్కూటర్లో పోర్టబుల్ బ్యాటరీ ఉంది. దీనికి సాధారణ సాకెట్ ద్వారా ఎక్కడి నుంచైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అయితే గంటకు గరిష్ఠంగా 25 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. ఇందులో పాడిల్ అసిస్ట్ టెక్నాలజీని కూడా పొందుపరిచారు.

వినియోగదారులు ఫిట్ నెస్ కోసం పెడల్స్ లేదా కంఫర్ట్ కోసం థ్రాటిల్ కు మార్చే ఆప్షన్ కూడా ఇందులో ఉంది. అత్యాధునిక ఫీచర్లను ఇందులో పొందుపరిచిన ఈ విద్యుత్ స్కూటర్ వాహన ప్రియులను ఆకర్షిస్తోంది. ఇంటర్నెట్ ఆప్షన్ తో పాటు చౌక ధరకు ఇది లభ్యమవుతుంది. మైలేజీ విషయంలోనూ మెరుగైన పనితీరును ఇది కనబరుస్తుంది. చిన్న చిన్న గమ్యాలను చేరేందుకు ఈ స్కూటర్ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పర్యావరణ హితంగా రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారుల ప్రయాణ ఖర్చును బాగా తగ్గిస్తుంది. కేవలం కిలోమీటరుకు 20 పైసలకే తక్కువ దూరం ఉన్న గమ్యాలను సులువుగా చేరుకోవచ్చు.
Published by:Nikhil Kumar S
First published: