Spinach: పాలకూరతో మరో ప్రయోజనం.. అలా కూడా వాడొచ్చట

ప్రతీకారాత్మక చిత్రం

Spinach: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఉండే పాలకూరతో రసాయన చర్యల్లో మంచి ఫలితాలు రాబట్టవచ్చని తాజా ప్రయోగాలు నిరూపిస్తున్నాయి. ఫ్యూయెల్ సెల్స్‌లో క్యాటలిస్ట్‌గా ఈ ఆకుకూరను ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

  • Share this:
పాలకూర ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతుంటారు. దీంట్లో ఉండే సూక్ష్మ పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అందుకే పాలకూరను ఆకుకూరల్లో రారాజుగా పిలుస్తారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఉండే పాలకూరతో రసాయన చర్యల్లో మంచి ఫలితాలు రాబట్టవచ్చని తాజా ప్రయోగాలు నిరూపిస్తున్నాయి. ఫ్యూయెల్ సెల్స్‌లో క్యాటలిస్ట్‌గా ఈ ఆకుకూరను ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఎందుకీ ప్రయోగాలు?

శక్తిని ఇచ్చే ఒక రకం బ్యాటరీలను ఫ్యూయెల్ సెల్స్‌ అంటారు. సాధారణంగా ఫ్యూయెల్ సెల్స్‌లో హైడ్రోజన్, ఆక్సిజన్ రసాయన చర్య జరిగి మనకు శక్తి(పవర్) లభిస్తుంది. కెమికల్ రియాక్షన్ రేటును పెంచే పదార్థాన్ని క్యాటలిస్ట్(ఉత్ప్రేరకం) అంటారు. ఆక్సిజన్-రిడక్షన్ రియాక్షన్ లేదా ఆక్స్-రెడాక్స్ (ORR)లను ఎనర్జీ కన్వర్జేషన్లలో వాడతారు. ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్ సహాయంతో కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడానికి ORR తోడ్పడుతుంది. ఆక్స్-రెడాక్స్ రియాక్షన్లో ఎలక్ట్రాన్లు ట్రాన్సఫర్ అవుతాయి. దీంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఫ్యూయెల్ సెల్స్‌, మెటల్ ఎయిర్ బ్యాటరీలలో ఉత్పత్తి అయ్యే శక్తిని ఆక్స్-రెడాక్స్ రియాక్షన్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు.

ప్లాటినానికి బదులుగా పాలకూర

పాలకూరను కార్బన్ నానోషీట్‌లుగా మార్చి క్యాటలిస్ట్‌గా వాడుకోవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ నానోషీట్లను ఫ్యూయల్ సెల్స్‌లో జరిగే ఆక్సిజన్-రిడక్షన్ రియాక్షన్లో క్యాటలిస్ట్‌గా వాడితే మంచి ఫలితాలు ఉంటాయని శాస్ర్తవేత్తలు నిరూపించారు. సాధారణంగా ఇలాంటి ఆక్స్-రెడాక్స్ రియాక్షన్లో ప్లాటినంను క్యాటలిస్ట్‌గా వాడుతారు. దీన్ని ఎక్కువగా ఆభరణాల తయారీలో వాడుతారు. ప్లాటినం అరుదైన, ఖరీదైన లోహం. దీన్ని క్యాటలిస్ట్ గా వాడాలంటే ఖర్చు అధికంగా అవుతుంది. అందుకే ప్లాటినం స్థానంలో తక్కువ ధర ఉండే కొన్ని రకాల కార్బన్ ఆధారిత పదార్థాలను వాడేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. ఇవి ప్లాటినంతో సమానంగా పనితీరును కనబరుస్తాయి.

ప్రయోగంలో ఏం తేల్చారు?

ప్లాటినం కంటే చౌకగా ఉండటంతో పాటు, సమర్థవంతంగా పనిచేసే పదార్థాలను కనిపెట్టాలనే లక్ష్యంతో ప్రయోగాలు జరిగాయి. వాషింగ్టన్ యూనివర్సిటీలోని కెమిస్ట్రీ విభాగానికి చెందిన నలుగురు శాస్త్రవేత్తలు ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు. దీనికి సంబంధించిన వివరాలను ACS ఒమేగా జర్నల్లో ప్రచురించారు. సహజ వనరుల నుంచి ఆక్సిజన్ రిడక్షన్ రియాక్షన్ కు అవసరమయ్యే క్యాటలిస్ట్‌లను తయారు చేయవచ్చని తాము నిరూపించినట్లు అధ్యయన బృందం సభ్యుడు ప్రొఫెసర్ షౌజోంగ్ జౌ తెలిపారు.

పాలకూరతో మంచి ఫలితాలు


ఫ్యూయెల్ సెల్ సిస్టమ్ లకు అవసరమయ్యే క్యాటలిస్ట్ గా పాలకూర నుంచి అభివృద్ధి చేసిన నానో షీట్లు మంచి పనితీరును కనబర్చినట్లు నిరూపించారు. పాలకూర నుంచి కార్బన్ బేస్డ్ క్యాటలిస్ట్ లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించిన పద్ధతుల గురించి ప్రొఫెసర్ షౌజోంగ్ జౌ వివరించారు. ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయని చెప్పారు. ఇది పునరుత్పాదక బయోమాస్ గా కూడా ఉపయోగపడుతుందని వెల్లడించారు. స్థిరత్వం(స్టెబిలిటీ), కార్యాచరణ(ఎబిలిటీ) పరంగా ఖరీదైన ప్లాటినంకు బదులుగా దీన్ని వాడుకోవచ్చని జౌ అభిప్రాయపడ్డారు.

వీటిని కూడా వాడొచ్చట..

కట్టైల్ గ్రాస్(ఒకరకం గడ్డి), బియ్యం వంటి వాటిని క్యాటలిస్ట్ గా వాడవచ్చని ఇతర అధ్యయనాలు నిరూపించాయి. కానీ పాలకూర అన్నిటికంటే మంచి ఎంపికగా తేలింది. దీంట్లో అధిక మొత్తంలో ఉండే ఐరన్, నైట్రోజన్ రెండూ ORR క్యాటలిస్ట్ గా పనిచేస్తాయి. పాలకూర నుంచి సేకరించిన క్యాటలిస్ట్‌ను కార్బన్ నానోషీట్ గా మారుస్తారు. ఇది వెంట్రుక కంటే వేల రెట్లు సన్నగా ఉంటుంది. ప్లాటినంను క్యాటలిస్టట్ గా వాడడం వల్ల క్రమంగా అది బలహీనపడే అవకాశం ఉంది. కానీ ఈ కార్బన్-షీట్ క్యాటలిస్ట్‌లు ఎక్కువ కాలం సమర్థవంతంగా పనిచేస్తాయని పరిశోధన బృందం అభిప్రాయపడింది.
Published by:Nikhil Kumar S
First published: