SpaceX: సరికొత్త ప్రాజెక్టును దక్కించుకున్న స్పేస్ ఎక్స్ సంస్థ... చంద్రుడి పైకి వెళ్లే ల్యాండర్ తయారీ..

SpaceX: సరికొత్త ప్రాజెక్టును దక్కించుకున్న స్పేస్ ఎక్స్ సంస్థ... చంద్రుడి పైకి వెళ్లే ల్యాండర్ తయారీ..

(ప్రతీకాత్మక చిత్రం)

గత సంవత్సరం స్పేస్ ఎక్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సిబ్బందిని విజయవంతంగా పంపించింది. ఈ ఘనత సాధించిన మొదటి ప్రైవేట్ సంస్థగా స్పేస్ ఎక్స్ రికార్డు సాధించింది.

  • Share this:
అమెరికాకు చెందిన ప్రైవేటు స్పేస్ ఏజెన్సీ స్పేస్‌ ఎక్స్ (SpaceX) మరో పెద్ద కాంట్రాక్ట్‌ను సొంతం చేసుకుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన వ్యోమగాములను చంద్రుడి మీదకు తీసుకెళ్లేందుకు ల్యాండర్‌ను ఆ సంస్థ రూపొందించనుంది. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్‌ను స్పేస్ ఎక్స్‌ సొంతం చేసుకున్నట్టు నాసా తాజాగా ప్రకటించింది. 1972 తరువాత మనుషులు చంద్రుని మీదకు వెళ్లలేదు. ఈ క్రమంలో దాదాపు 50 ఏళ్ల తరువాత మళ్లీ చంద్రుడి ఉపరితలానికి వ్యోమగాములను తీసుకువెళ్లే ప్రాజెక్టులో స్పేస్ ఎక్స్ భాగమైంది. తాజా ఒప్పందం విలువ 2.9 బిలియన్ డాలర్లు కావడం విశేషం. సంస్థ పరీక్షిస్తున్న స్టార్‌షిప్ స్పేస్‌క్రాఫ్ట్‌ను నాసా ప్రాజెక్టులో వాడనున్నారు.

స్పేస్ ఎక్స్ కంపెనీకి కాంట్రాక్ట్ దక్కినట్టు నాసా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. దీనికి ప్రముఖ వ్యాపారవేత్త, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ సీఈఓగా ఉన్నారు. జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ, డిఫెన్స్ కాంట్రాక్టర్ డైనెటిక్స్‌లను ఓడించి స్పేస్ ఎక్స్ ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. ఎలాన్ మస్క్ 2002లో స్పేస్ ఎక్స్ కంపెనీని స్థాపించారు. నాసాకు అత్యంత నమ్మకమైన ప్రైవేట్ రంగ భాగస్వామిగా తమ సంస్థను మార్చాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతోపాటు అంగారకుడి మీద ఆవాసాలను ఏర్పాటు చేయాలనేది మస్క్ కల.

సంస్థ పేరుతో రికార్డులు
గత సంవత్సరం స్పేస్ ఎక్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సిబ్బందిని విజయవంతంగా పంపించింది. ఈ ఘనత సాధించిన మొదటి ప్రైవేట్ సంస్థగా స్పేస్ ఎక్స్ రికార్డు సాధించింది. చంద్రుడి మీదకు వ్యోమగాములను తీసుకెళ్లేందుకు ఆ సంస్థ పునర్వినియోగానికి అవకాశం ఉన్న స్టార్ షిప్ స్పేస్ క్రాఫ్ట్‌ను ఉపయోగించనుంది. అంతరిక్ష ప్రయాణాల కోసం, అక్కడ చేసే ప్రయోగాలకు అవసరమయ్యే సామగ్రిని తీసుకెళ్లడానికి ఈ వ్యోమనౌకను సంస్థ రూపొందిస్తోంది. ఇది భూమితో పాటు చంద్రుడు, అంగారకుడు వంటి ఇతర ఖగోళ వస్తువులపై కూడా విజయవంతంగా ల్యాండింగ్ కాగలదు.

మరోసారి చంద్రుడి మీదకు
నాసా 2024 నాటికి మరోసారి చంద్రుడి మీదకు మనుషుల్ని పంపేందుకు ఆర్టెమిస్ (Artemis) ప్రాజెక్టును చేపట్టనుంది. ఇందులో స్పేస్ ఎక్స్‌కు చెందిన స్టార్‌ షిప్‌ను ఉపయోగించనున్నారు. ఆర్టెమిస్ ప్రాజెక్టులో భాగంగా ఓరియన్ అంతరిక్ష నౌకలో నలుగురు వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలోకి వెళ్తారు. వీరిలో ఇద్దరు చంద్రుడి కక్ష్యలో ఉన్న గేట్‌వే స్పేస్ స్టేషన్‌లో ఉంటారు. మరో ఇద్దరు చంద్రుడి మీదకు వెళ్లనున్నారు. ఇక్కడి నుంచి చంద్రుడి ఉపరితలానికి ప్రయాణించేందుకు స్పేస్ ఎక్స్ హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్‌కు ఇద్దరు వ్యోమగాములు మారుతారు. వీరు సుమారు వారం రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపై అన్వేషించనున్నారు. ఆ తరువాత స్పేస్ షిప్‌లో గేట్‌వే స్టేషన్‌కు, అక్కడి నుంచి అందరూ కలిసి భూమికి రావాల్సి ఉంటుంది.

పునర్వినియోగానికి పనికొచ్చే వ్యోమ నౌక
చంద్రునిపై దిగడానికి రూపొందించిన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్‌లో విశాలమైన క్యాబిన్, మూన్‌వాక్ కోసం రెండు ఎయిర్ లాక్‌లు ఉంటాయని నాసా తెలిపింది. చంద్రుడు, అంగారకుడి మీదకు ప్రయాణాలకు ఈ వ్యోమనౌక ఉపయోగపడుతుంది. పునర్వినియోగానికి సాధ్యమయ్యే ఈ వ్యోమనౌకల ద్వారా అంతరిక్ష ప్రయాణాలు సులభమయ్యే అవకాశం ఉంది. వీటితో ప్రయోగాల ఖర్చు కూడా భారీగా తగ్గనుంది. ఆర్టెమిస్ ప్రాజెక్టులో మొదటిసారి ఒక మహిళను, నల్ల జాతి వ్యక్తిని నాసా చంద్రుడి మీదకు తీసుకెళ్లనుంది. అమెరికా 1969 నుంచి 1972 మధ్య 12 మంది వ్యోమగాములను చంద్రుని పైకి తీసుకెళ్లింది. ఆ తరువాత ప్రస్తుత ప్రాజెక్టులో మళ్లీ ఇద్దరిని చంద్రుడి మీదకు పంపనుంది.
First published:

అగ్ర కథనాలు