Home /News /technology /

Glaucoma: స్మార్ట్‌ఫోన్‌ సహాయంతో కంటి సమస్యలకు చెక్​ పెట్టొచ్చు.. ఎలాగో తెలుసుకోండి

Glaucoma: స్మార్ట్‌ఫోన్‌ సహాయంతో కంటి సమస్యలకు చెక్​ పెట్టొచ్చు.. ఎలాగో తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తీవ్రమైన కంటి సమస్యలకు కారణమయ్యే స్మార్ట్​ఫోన్​ల​ ద్వారానే కంటి సమస్యలకు చెక్​ పెట్టవచ్చని చెబుతోంది తాజా అధ్యయనం. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నేటి యువత ఎక్కువ సమయం స్మార్ట్​ఫోన్​లోనే గడుపుతున్నారు. దీంతో కొన్నిసార్లు అనారోగ్య సమస్యలకు కూడా గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నవయస్సులోనే వారిలో కంటి సమస్యలు అధికమవుతున్నాయి. అయితే, ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లు,​ తీవ్రమైన కంటి సమస్యలకు కారణమయ్యే స్మార్ట్​ఫోన్​ల​ ద్వారానే కంటి సమస్యలకు చెక్​ పెట్టవచ్చని చెబుతోంది తాజా అధ్యయనం. స్మార్ట్​ఫోన్​తో కళ్లను స్కాన్ చేయడం ద్వారా వ్యక్తుల్లో గ్లకోమా తీవ్రతను ముందుగానే పసిగట్టవచచ్చని బ్రిటన్​లోని బర్మింగ్​హోమ్​ యూనివర్సిటీ పరిశోధకుల బృందం పేర్కొంది. తద్వారా తీవ్రమైన కంటి వ్యాధులు, అంధత్వాన్ని నివారించవచ్చని వారు స్పష్టం చేశారు. గ్లకోమా అనేది ఆప్టిక్ నరాలకు చెందిన వ్యాధి. ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 79.6 మిలియన్ల మంది గ్లకోమా వ్యాధితో బాధపడుతున్నారని ఒక అంచనా. సాధ్యమైనంత త్వరగా దీనికి చికిత్స చేయకపోతే, భవిష్యత్తులో ఇది కోలుకోలేని నష్టాన్ని కలుగజేస్తుంది.

అయితే, తగిన నియంత్రణ చర్యలు, చికిత్స పద్ధతులను పాటించడం ద్వారా గ్లకోమా నుండి బయటపడొచ్చని, అంధత్వాన్ని నివారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా ఈ గ్లకోమా వ్యాధి తీవ్రత ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్ (IOP)తో ముడిపడి ఉంటుంది. కంటి ద్రవాలను నిరంతరం పునరుద్ధరించడం ద్వారా ఏర్పడే పీడనాన్నే ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్ అంటారు. కాగా, స్మార్ట్​ఫోన్​ సహాయంతో ఒక వ్యక్తి ఇంట్రాకోక్యులర్ ప్రెజర్ (IOP) ని సుదీర్ఘ కాలం పాటు పర్యవేక్షించి వారిలో గ్లకోమా తీవ్రతను అంచనా వేయవచ్చు.

వృద్ధుల్లో తీవ్రత ఎక్కువ..
IOP ఫలితాలు ప్రారంభంలో రోగ నిర్ధారణ, చికిత్సకు ఉపయోగపడతాయని అధ్యయనవేత్తలు తెలిపారు. బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందం సౌండ్‌వేవ్స్, కంటి నమూనాను ఉపయోగించి విజయవంతంగా వ్యక్తుల్లో గ్లకోమాను అంచనా వేయగలిగింది. కాగా, అధ్యయన ఫలితాలపై బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయంలోని అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ గ్రూప్ డైరెక్టర్ ఖమిస్ ఎస్సా మాట్లాడుతూ “పరిశోధనలో భాగంగా ఒక వస్తువు అంతర్గత పీడనం​, దాని శబ్ద ప్రతిబింబ గుణకం మధ్య సంబంధాన్ని కనుగొన్నాము. కంటికి, సౌండ్‌వేవ్‌లతో పరస్పర చర్యను ఎలా ప్రభావితం చేస్తాయి? స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి IOPని ఖచ్చితంగా ఎలా కొలవగలం? అనే విషయాలపై మేం అధ్యయనం చేశాము.

ఇతర కంటి వ్యాధుల ప్రమాద కారకాలను కూడా స్మార్ట్ ఫోన్​తో సులభంగా అంచనా వేయవచ్చని మా అధ్యయనంలో తేలింది.” అని అన్నారు. ఉదాహరణకు, డయాబెటిక్ రెటినోపతి విషయంలో, కంటి రక్తనాళాలలో అభివృద్ధి చెందుతున్న చిన్న క్లాట్స్ లను స్మార్ట్​ఫోన్​ సహాయంతో నిరంతరం పర్యవేక్షించవచ్చని ఆయన తెలిపారు. కాగా, ఈ అధ్యయన ఫలితాలు ఇంజనీరింగ్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి. కాగా, గ్లకోమా వ్యాధి కంటి నుంచి కారే ద్రవాల అసమతుల్యత వలన సంభవిస్తుంది. ఈ వ్యాధి వృద్ధులలో సర్వసాధారణం. వయస్సు పెరిగేకొద్ది గ్లకోమా ప్రమాదం కూడా పెరుగుతుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Health Tips, Mobiles, Smartphones

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు