• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • SIGNAL FOUNDATION EXECUTIVE CHAIRMAN SAID THAT DATA PROTECTION AND PRIVACY WERE AT THE CORE OF SIGNALS PHILOSOPHY NS GH

Explainer: Signal appకు పెరుగుతున్న ఆదరణ.. రానున్న రోజుల్లో అందుబాటులోకి ఆ కొత్త సేవలు.. వివరాలివే

Explainer: Signal appకు పెరుగుతున్న ఆదరణ.. రానున్న రోజుల్లో అందుబాటులోకి ఆ కొత్త సేవలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

వాట్సాప్ కొత్త సర్వీస్ రూల్స్, ప్రైవసీ పాలసీపై ఆందోళన వ్యక్తం చేస్తున్న యూజర్లు ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫాంలకు మారుతున్నారు. ఈ క్రమంలో సిగ్నల్ యాప్ పేరు తెరపైకి వచ్చింది.

  • Share this:
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. అయితే ఇటీవల ఆ సంస్థ ప్రకటించిన కొత్త ప్రైవసీ పాలసీ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. కొత్త సర్వీస్ రూల్స్, ప్రైవసీ పాలసీపై ఆందోళన వ్యక్తం చేస్తున్న యూజర్లు ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫాంలకు మారుతున్నారు. ఈ క్రమంలో సిగ్నల్ యాప్ పేరు తెరపైకి వచ్చింది. ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు కూడా ఈ యాప్‌ను వాడమని సలహా ఇచ్చారు. దీంతో సిగ్నల్ డౌన్‌లోడ్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఇతర మెసేజింగ్ యాప్‌ల మాదిరిగా కాకుండా, సిగ్నల్ తన కార్యకలాపాలకోసం గ్రాంట్లు, విరాళాలపై ఆధారపడుతుంది. ఈ నేపథ్యంలో CNBC-TV18 వార్తాసంస్థ సిగ్నల్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బ్రియాన్ ఆక్టన్‌ను ఇంటర్యూ చేసింది. సిగ్నల్ యాప్ పనితీరు, డేటా ప్రైవసీ, ఇతర అంశాల గురించి ఆయన వివరించారు. మరికొన్ని ముఖ్యమైన అంశాలపై ఆయన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ ఇంటర్యూ పూర్తి సారాంశం...

కొత్త యాప్ కాదు
సిగ్నల్ యాప్‌ను 2014లోనే అభివృద్ధి చేశారు. ఈ ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్ మాదిరిగానే పనిచేస్తుంది. 2017లో వాట్సాప్‌ను ఫేస్‌బుక్ సంస్థ కొనుగోలు చేసింది. దీంతో వాట్సాప్ వ్యవస్థాపకుడు బ్రియాన్ ఆక్టన్ ఆ సంస్థ నుంచి బయటకు వచ్చారు. ఆ తరువాత ఆయన సిగ్నల్ సంస్థలో 50 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి, సంస్థను ఫౌండేషన్‌గా మార్చారు.

ప్రముఖుల ట్వీట్లతో గుర్తింపు
ఎలాన్ మస్క్, ఆనంద్ మహీంద్రా వంటి ప్రముఖులు వాట్సాప్ ప్రైవసీ పాలసీపై మిమర్శలు చేశారు. డేటా ప్రైవసీ విషయంలో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో సిగ్నల్ యాప్‌ను వాడాలని వారు ప్రజలకు సూచించారు. దీంతో జనవరి 1 నుంచి 9 వరకు భారత్‌లో సిగ్నల్ యాప్ 18 లక్షల డౌన్‌లోడ్లను నమోదు చేసింది. అంతకు ముందు వారంతో పోలిస్తే డౌన్‌లోడ్లు 14 శాతం పెరిగాయి.

వాట్సప్ వంటి యాప్‌లతో పోటీ
కొత్త ప్రైవసీ వివాదానికి ముందు వాట్సాప్‌కు ప్రత్యామ్నాయాల గురించి ప్రజలు ఆలోచించలేదు. సిగ్నల్ యాప్ మొదటి నుంచి మెరుగైన సేవలను అందిస్తోంది. యాప్ పనితీరుకు మంచి గుర్తింపు ఉండటంతో ఎక్కువ మంది సిగ్నల్‌కు మారుతున్నారు. ఇతర యాప్‌లతో పోలిస్తే డేటా ప్రైవసీకి సిగ్నల్ ఎక్కువ విలువ ఇస్తుంది. అందుకే యాప్‌ను వాడేవారి సంఖ్య పెరుగుతోంది.

డేటా ప్రైవసీకి భరోసా అవసరం
వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమంది వినియోగదారులు ఉన్నారు. ఫేస్‌బుక్ కొనుగోలు చేయడానికి ముందే ఆ సంస్థకు మంచి రెవెన్యూ ఉంది. ఇప్పుడు ఫేస్‌బుక్ రూపొందించిన నియమ నిబంధనల ప్రకారం వాట్సాప్‌ను కొత్తగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ విషయంలో ఫేస్‌బుక్‌కు ఒక నిర్దిష్ట అజెండా ఉంది. వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త మార్గాలను అన్వేషించడం సహజం. కానీ గోప్యత విషయంలో ఆ సంస్థ రాజీపడదని వినియోగదారులకు భరోసా ఇవ్వాలి. కమ్యూనికేషన్ విషయంలో భద్రత, గోప్యత, నమ్మకం ఉండేలా సిగ్నల్ జాగ్రత్తలు తీసుకుంటోంది. అందువల్ల యూజర్లు దీన్ని వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు.

సమాచారంతో వ్యాపారం చేయవద్దు
కొత్త ప్రైవసీ పాలసీ కూడా సేవలో భాగంగా ఉండాలి. కానీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికే వాట్సాప్‌ కొత్త నియమాలు తీసుకువచ్చినట్టు అర్థమవుతోంది. వీటిని ఒకటికి రెండుసార్లు చదివితేనే ఈ విషయాలు అర్థమవుతాయి. వీటి గురించి పూర్తిగా తెలిసిన కస్టమర్లు తమ సమాచారం ఎక్కడ దుర్వినియోగం అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. సిగ్నల్‌ యూజర్లకు ఇలాంటి అనుమానాలు అవసరం లేదని బ్రియాన్ తెలిపారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సమయంలోనే ప్రైవసీ పాలసీని కస్టమర్లు సులభంగా అర్థం చేసుకోవచ్చు. యూజర్ల డేటాను సంస్థ ఎలా ఉపయోగిస్తుందని ఆలోచించాల్సిన అవసరం లేదని బ్రియాన్ చెప్పారు. కస్టమర్ల డేటాను సిగ్నల్ యాక్సెస్ చేయలేదని వివరించారు.

సేవల విస్తరణకు ప్రాధాన్యం
భవిష్యత్తులో కేవలం మెసేజింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఇతర సేవలను కూడా సిగ్నల్ అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉంది. ప్రస్తుతానికి సంస్థ డొనేషన్లపై ఆధారపడి పనిచేస్తోంది. కస్టమర్లకు రోజువారీ సేవలను మెరుగ్గా అందించడమే సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. రానున్న రోజుల్లో ఇలాంటి సేవలను విస్తరించనుంది. భవిష్యత్తులో ఫౌండేషన్ పనితీరును మెరుగుపరచడానికి, ఆర్థిక ఇబ్బందులను తీర్చడానికి ఒక దీర్ఘకాలిక సేవింగ్స్ ఫండ్‌ను ఏర్పాటు చేయనుంది.

ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ముందుకు
భారత్ వంటి ప్రధాన మార్కెట్‌లో కస్టమర్ల అభిరుచుల ప్రకారం సేవలు అందిచాల్సి ఉంటుంది. యూజర్లకు ఎదురయ్యే అసౌకర్యాలను, ఇబ్బందులకు పరిష్కరించేందుకు, పనితీరును మెరుగుపరచుకునేందుకు సిగ్నల్ ఫౌండేషన్ ప్రాధాన్యం ఇస్తుంది. ఇందుకు సిగ్నల్ కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను ప్రామాణికంగా తీసుకోనుంది. సపోర్టింగ్ ఛానల్స్, రివ్యూల ద్వారా పరిశోధన చేస్తూ ముందుకు సాగనుంది.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు