అమ్మో, అక్కడ నుంచీ చూస్తే, కళ్లు తిరగడం ఖాయం

థాయ్‌ల్యాండ్ అంటేనే ఎన్నో విశేషాలు. అక్కడి స్ట్రీట్ ఫూడ్, ఆలయాలు, షాపింగ్ మాళ్లు అన్నీ చెప్పుకోతగ్గవే. ఇప్పుడు ఆ లిస్టులోకి మరొకటి వచ్చి చేరింది. అదే మహానఖోన్ స్కైవాక్. ఒక్కసారి అక్కడికి వెళ్లామంటే చాలు. చేతులకు చెమటలు, కాళ్లకు వణుకూ తప్పదు. ఇప్పటికే చాలా మంది ఆ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందుతున్నారు.

news18-telugu
Updated: November 25, 2018, 12:20 PM IST
అమ్మో, అక్కడ నుంచీ చూస్తే, కళ్లు తిరగడం ఖాయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎత్తైన భవనాలు, విగ్రహాలూ నిర్మించేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. థాయ్‌ల్యాండ్ లాంటి దేశాలైతే, ఎత్తైన టవర్లు కట్టడమే కాదు, వాటిపై ఇంకా ఏదైనా ప్రత్యేకత ఉండేలా చేస్తున్నాయి. అలాంటి పొడవాటి ఆకాశ భవనమే కింగ్ పవర్ మహానఖోన్. బ్యాంకాక్‌లోని ఈ టవర్ ఎక్కి, దీనిపై ఉన్న గ్లాస్‌పై నడిస్తే, గుండె జారిపోతుంది. వెన్నులో వణుకు తప్పదు. అడుగు తీసి అడుగు వెయ్యాలంటే కాళ్లు తడబడతాయి. నోట మాట రాదు. 

ఈ టవర్ ఎత్తు 1,030 అడుగులు. పైన అబ్జర్వేషన్ డెక్ వుంది. అక్కడే ఓ బార్ కూడా ఉంది. ఇక్కడ కాక్‌టెయిల్స్, సాఫ్ట్ డ్రింక్స్, బీర్, బెల్జియం స్టైల్ బీర్ వైట్ ఎలే సెర్వ్ చేస్తున్నారు. ఆ బార్‌లో కూర్చుంటే, మందు తాగకుండానే మైండ్ బ్లాంకవుతుంది. ఎందుకంటే బార్ కింద ఉండే గ్లాస్‌లోంచీ 360 డిగ్రీల్లో చుట్టూ ఉన్న ప్రపంచం, ఎత్తైన భవనాలు, కింద రోడ్లపై వెళ్లే కార్లు, వాహనాలూ కనిపిస్తూ ఉంటాయి. గ్లాస్ పగిలిపోతుందేమో, కింద పడిపోతామేమో అనిపిస్తుంది. మరి గుండె జారిపోకుండా ఎలా ఉంటుంది.

ఇంత ఎత్తైన టవర్‌లో 78వ అంతస్తులో ఉంది గ్లాస్ ఫ్లోర్. కింది నుంచీ అక్కడకు లిఫ్టులో చేరుకోవడానికి 50 సెకండ్లు పడుతుంది. ఆ లిఫ్టులోంచీ పైకి వెళ్లేటప్పుడు కూడా బయటి ప్రపంచం కనిపిస్తుంది. అది ఎంతో మజా ఇస్తోందని పర్యాటకులు చెబుతున్నారు. 

ఈ గ్లాస్‌ ఫ్లోర్ పైకి వెళ్లేముందు పర్యాటకులు ఎవరైనా సరే, కాళ్లకు ఫ్యాబ్రిక్ బూటీలు వేసుకోవాల్సిందే. ఎందుకంటే, అక్కడి నుంచీ కిందకు చూస్తే, కచ్చితంగా కాళ్లు వణుకుతాయి. అక్కడికి వెళ్లేంత ధైర్యం లేని వాళ్లు, టవర్‌లోని ఇతర ఫ్లోర్లలోంచీ సిటీని చూడొచ్చు.జనరల్‌గా పర్యాటకులు ఈ గాజు ఫ్లోర్‌పై పడుకొని సెల్ఫీలు తీసుకుంటున్నారు. మోకాళ్లపై నిలబడి ఫొటోలకు పోజులిస్తున్నారు.ఇక్కడకు ఎక్కువగా సాయంత్రం 4 గంటలకు పర్యాటకులు వస్తున్నారు. ఐదున్నరకు అద్భుతమైన సూర్యాస్తమయం కనిపిస్తుంది. ఆ టైమ్‌లో ఫ్లోర్ మొత్తం నిండిపోతోంది.ఈ టవర్‌ను 7 వేల కోట్ల రూపాయలతో నిర్మించారు. 2016లో పూర్తైంది. థాయ్‌ల్యాండ్‌లో ఎత్తైన టవర్‌గా రికార్డుల కెక్కింది. స్థానికంగా దీన్ని పిక్సెల్ టవర్ అంటున్నారు. కారణం దీని నిర్మాణ శైలే. స్కైబాక్సెస్ కంపెనీ దీన్ని నిర్మించింది. ఇందులో హోటళ్లు, రెసిడెన్షియల్ ఫ్లాట్లు, షాపింగ్ మాళ్లు ఉన్నాయి.
First published: November 24, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు