SEBI: పెట్టుబడిదారులకు అలర్ట్.. అలా చేయకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించిన సెబీ..!

SEBI: పెట్టుబడిదారులకు అలర్ట్.. అలా చేయకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించిన సెబీ..!

సెప్టెంబర్ 30 తర్వాత కొత్త ఖాతాలు తెరిచే పెట్టుబడిదారులు సీబీడీటీ ఆదేశాలను పాటించేలా చర్యలు చేపట్టాలని తమతో రిజిస్టర్ అయిన అన్ని సంస్థలను సెబీ ఆదేశించింది. ఖాతాదారుల నుంచి ఆధార్‌తో లింక్ అయిన పాన్ కార్డులు మాత్రమే స్వీకరించాలని మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు (MIIs) సెబీ ఆదేశాలు జారీ చేసింది.

  • Share this:
మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) భారతీయ పెట్టుబడిదారుల శ్రేయస్సు కొరకు సరికొత్త మార్పులను తీసుకు వస్తోంది. అమాయకపు రిటైల్ ఇన్వెస్టర్లు మోసపోకుండా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు కళ్లెం వేసేందుకు సెబీ ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే మదుపర్లు తమ ఆధార్ నంబర్‌ను పాన్( PAN ) కార్డుతో అనుసంధానం చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం సెప్టెంబర్ 30, 2021 వరకు గడువు ఇచ్చింది. మార్కెట్ లావాదేవీలు సజావుగా, నిరాటంకంగా కొనసాగాలంటే ఆధార్ నంబర్‌ను పాన్ (PAN) కార్డుతో లింక్ చేయటం తప్పనిసరని విస్పష్టం చేసింది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఆదేశాల ప్రకారం, ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్ కార్డులు సెప్టెంబర్ 30 తర్వాత పనిచేయవు. సెక్యూరిటీ మార్కెట్‌లో లావాదేవీలు నిరంతరాయంగా జరగాలంటే పెట్టుబడిదారులకు పాన్ చాలా అవసరం. కాబట్టి వారంతా కూడా ఆధార్, కార్డు అనుసంధానం చేయడం అనివార్యంగా మారింది. ఫిబ్రవరి 13, 2020 సీబీడీటీ నోటిఫికేషన్ GSR 112 (E) ప్రకారం జూలై 01, 2017 నాటికి పాన్ కార్డు పొందిన వ్యక్తులు ఆధార్‌తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అలా చేయకుంటే సెప్టెంబర్ 30, 2021 నాటికి పాన్ కార్డులు పనిచేయవని శుక్రవారం రోజు ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా సెబీ హెచ్చరించింది.

సెప్టెంబర్ 30 తర్వాత కొత్త ఖాతాలు తెరిచే పెట్టుబడిదారులు సీబీడీటీ ఆదేశాలను పాటించేలా చర్యలు చేపట్టాలని తమతో రిజిస్టర్ అయిన అన్ని సంస్థలను సెబీ ఆదేశించింది. ఖాతాదారుల నుంచి ఆధార్‌తో లింక్ అయిన పాన్ కార్డులు మాత్రమే స్వీకరించాలని మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు (MIIs) సెబీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత పెట్టుబడిదారులు సైతం సెప్టెంబర్ 30, 2021 లేదా సీబీడీటీ ప్రకటించిన నిర్ణీత గడువులోపు ఆధార్, పాన్ కార్డును అనుసంధానం చేయాలని కోరింది. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139AA ప్రకారం.. ఆధార్ పొందేందుకు అర్హత ఉన్న పాన్ కార్డుదారులు ఈ రెండూ లింక్ చేయడం తప్పనిసరి. అయితే ఆదాయపు పన్ను చట్టంలోని నాన్ రెసిడెంట్స్ , 80 ఏళ్లు.. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు, విదేశీ పౌరులు అనుసంధానం చేయాల్సిన అవసరం లేదు.

ఆధార్ నంబర్‌ను పాన్ కార్డుతో లింక్ చేసుకోండిలా..

1. ఇన్ కమ్ టాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను https://www.incometax.gov.in/iec/foportal సందర్శించండి.

2. పోర్టల్‌లో రిజిస్టర్ కాకపోతే.. రిజిస్టర్ అవ్వండి. మీ పాన్ కార్డే మీ యూజర్ ఐడీ అవుతుంది.

3. యూజర్ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత.. పాస్ వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

4. అప్పుడు ఒక పాప్-అప్ విండో ఓపెన్ అయ్యి ఆధార్‌తో మీ పాన్‌ని లింక్ చేయమని కోరుతుంది. ఒకవేళ పాప్-అప్ విండో కనిపించకపోతే.. మెనూ బార్‌లోని ‘ప్రొఫైల్ సెట్టింగ్స్’ పై క్లిక్ చేసి ‘లింక్ ఆధార్’ పై క్లిక్ చేయండి.

5. పాన్ వివరాల ప్రకారం మీ పుట్టిన తేదీ వంటి వివరాలను పొందుపరచండి.

6. ఆధార్‌, పాన్ వివరాలు ఒకేలా ఉన్నాయో లేదో సరిచూసుకోండి. ఒకవేళ రెండు డాక్యుమెంట్లలో వివరాలు డిఫరెంట్ గా ఉంటే.. మీరు ఏదో ఒక డాక్యుమెంట్ ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్‌, పాన్ లోని వివరాలు ఒకేలా ఉంటేనే లింక్ చేసుకోవడానికి వీలు అవుతుంది.

7. ఆధార్‌, పాన్ వివరాలు ఒకేలా ఉంటే.. 'లింక్ నౌ' ఆప్షన్ పై క్లిక్ చేయండి.

8. అప్పుడు ఆధార్ నంబర్‌ను పాన్ కార్డుతో విజయవంతంగా అనుసంధానం చేశారని మీ రిజిస్టర్​ మొబైల్​కు ఒక మెసేజ్ వస్తే మీ ఆధార్, పాన్ లింక్ అయినట్లే!
Published by:Krishna Adithya
First published: