TVs Block Feature: శామ్‌సంగ్‌ టీవీల్లో కొత్త ఫీచర్‌.. దొంగిలించిన టీవీలను డిసేబుల్ చేయవచ్చట

ఫ్రతీకాత్మక చిత్రం

తమ కంపెనీ టీవీలను ఎవరైనా తస్కరిస్తే.. వాటిని రిమోట్ గానే డిసేబుల్ చేసే సదుపాయముందని సదరు సంస్థ ఇటీవల స్పష్టం చేసింది. ఇంటర్నెట్‌కు అనుసంధానమైన ఏ టీవీ అయినా పనిచేయకుండా చేయవచ్చని ఆగస్టు 6న వెల్లడించింది.

  • Share this:
టీవీలను ఎవరైనా దొంగిలిస్తే వాటిని మర్చిపోవాల్సిందే. దొంగలు వాటిని అమ్మి, సొమ్ము చేసుకుంటారు. టీవీ యజమానులు మాత్రం నష్టపోవాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి దొంగతనాల ప్రభావాన్ని నిరోధించేందుకు కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది శామ్‌సంగ్‌. తమ కంపెనీ టీవీలను ఎవరైనా తస్కరిస్తే.. వాటిని రిమోట్ గానే డిసేబుల్ చేసే సదుపాయముందని సదరు సంస్థ ఇటీవల స్పష్టం చేసింది. ఇంటర్నెట్‌కు అనుసంధానమైన ఏ టీవీ అయినా పనిచేయకుండా చేయవచ్చని ఆగస్టు 6న వెల్లడించింది. ఈ ఫీచర్‌కు టీవీ బ్లాక్ అని పేరు పెట్టింది. గత నెలలో దక్షిణాఫ్రికాలో నిరసనలు, ఆందోళనల జరిగిన సమయంలో శామ్‌సంగ్‌ గిడ్డంగుల నుంచి ఎన్నో టీవీలు తస్కరణకు గురయ్యాయి. అయితే ఈ టీవీల్లో ఇప్పటికే ఆ సాంకేతికతను పొందుపరిచినట్లు దక్షిణకొరియా టెక్ దిగ్గజం వెల్లడించింది.

"టీవీ బ్లాక్ సెక్యూరిటీ సొల్యూషన్ ద్వారా ఏవైనా టీవీ యూనిట్లు అనవసరంగా యాక్టివేట్ అయి ఉంటే వాటిని గుర్తించవచ్చు. ఈ టెక్నాలజీ ఇప్పటికే అన్నీ శామ్‌సంగ్‌ టీవీ ఉత్పత్తుల్లోనూ ముందే లోడ్ చేశాం. దొంగతనం, థర్డ్ పార్టీ కొనుగోళ్లను పరిమితం చేయడమే దీని లక్ష్యం. టెలివిజన్ సెట్లను సరైన యజమానులు మాత్రమే చెల్లుబాటు అయ్యే రుజువుతో ఉపయోగించగలరని ఈ ఫీచర్ నిర్ధారిస్తుంది. దొంగిలించిన టీవీలను ఆపరేట్ చేయడానికి ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసినప్పుడు.. ఈ టీవీ బ్లాక్ ఫీచర్ పనిచేస్తుంది" అని శామ్‌సంగ్‌ సంస్థ స్పష్టం చేసింది.

అయితే అనుకోని ప్రమాదాల వల్ల కూడా టీవీలు బ్లాక్ చేసే అవకాశముందని శామ్‌సంగ్ తెలిపింది. అందువల్ల సంబంధిత యజమానులు టీవీలు కొనుగోలు చేసేటప్పుడు తమ ప్రూఫ్‌ను అందజేయాలని సంస్థ పేర్కొంది. తనిఖీ/ధ్రువీకరణ కోసం కొనుగోలు ప్రూఫ్‌ను zaservicemanager@samsung.comకు కూడా పంపాలని, 48 గంటల్లో డీలర్ మీకు సమాచారమిస్తారని తెలిపింది.

టీవీ బ్లాక్ ఫీచర్ పనిచేయడానికి, దొంగిలించిన టీవీ సీరియల్ కోడ్ అవసరం. తస్కరణకు గురైన టీవీ యూనిట్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయిన తర్వాత శామ్‌సంగ్‌ తన సీరియల్ కోడ్‌ను కంపెనీ సర్వర్ల లిస్టుతో చెక్ చేస్తుంది. మ్యాచ్ అయితే టీవీని డిసేబుల్ చేస్తుంది.
Published by:Krishna Adithya
First published: