Samsung Galaxy S21: లగ్జరీ స్మార్ట్ఫోన్ల విభాగంలో యాపిల్, శామ్సంగ్ సంస్థల మధ్య పోటీ ఎప్పటినుంచో ఉంది. ఈ రెండు కంపెనీలు పోటీలుపడుతూ కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తుంటాయి. మార్కెట్లో తమదే పైచేయి కావాలనే ఉద్దేశంతో గతంలో సున్నితమైన విమర్శలు సైతం చేసుకున్నాయి. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటాయి. తాజాగా గతంలో యాపిల్ కంపెనీపై ఫేస్బుక్లో చేసిన కామెంట్లను శామ్సంగ్ డిలీట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. గతంలో యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ 12ను చార్జర్ లేకుండానే కస్టమర్లకు అందించింది. అప్పట్లో ఈ చర్యను విమర్శించిన శామ్సంగ్ కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తోంది. ఆ సంస్థ నుంచి త్వరలో రానున్న గెలాక్సీ ఎస్ 21 సిరీస్ (Galaxy S21 series) ఫోన్లతో ఛార్జర్లను ఇవ్వట్లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
యాపిల్‌పై కామెంట్లు
ఛార్జర్ ఇవ్వకుండా ఐఫోన్ 12ను విడుదల చేసినప్పుడు యాపిల్‌ను ఇతర పోటీ సంస్థలు విమర్శించాయి. కస్టమర్లకు సరైన సేవలందించడం మన బాధ్యత అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశాయి. తాజాగా తమ అధికారిక కరేబియన్ ఫేస్బుక్ పేజీ నుంచి శామ్సంగ్ ఇలాంటి పోస్ట్‌ను తొలగించింది. “కస్టమర్లకు గెలాక్సీ ఫోన్‌తో పాటు అవసరమైన ప్రతిదాన్ని శామ్సంగ్ అందిస్తుంది. ఛార్జర్ నుంచి మంచి కెమెరా, బ్యాటరీ, మెమరీ, స్క్రీన్ వరకు ప్రతిదీ ఫోన్‌తో పాటే వస్తుంది" అని ఆ పేజీలో పోస్ట్ చేసింది. ఈ పాత పోస్ట్‌ను డిలీట్ చేయడంతో గెలాక్సీ S21 సిరీస్ స్మార్ట్ఫోన్లతో ఛార్జర్ ఇవ్వట్లేదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కానీ దీనిపై శామ్సంగ్ అధికారికంగా స్పందించలేదు.
* కొత్త సిరీస్‌లో మూడు ఫోన్లు
గెలాక్సీ ఎస్ 21 సిరీస్ ఫోన్లు 2021 జనవరిలో మార్కెట్లోకి విడుదల కానున్నాయి. గతంలో వచ్చిన గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా స్మార్ట్ఫోన్కంటే ఉత్తమ ఫీచర్లు కొత్త మోడళ్లలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో గెలాక్సీ ఎస్ 21 (Galaxy S21), గెలాక్సీ ఎస్ 21 + (Galaxy S21+), గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా(Galaxy S21 Ultra) అనే మూడు కొత్త మోడళ్లు ఉన్నాయి. వీటిల్లో గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా మోడల్‌ను రెండు ఆకర్షణీయమైన రంగుల్లో (ఫాంటమ్ సిల్వర్, ఫాంటమ్ బ్లాక్) డిజైన్ చేశారు. గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా వేరియంట్‌ను 6.8 అంగుళాల Infinity-O AMOLED స్క్రీన్‌తో, గ్లాస్ ఫినిషింగ్‌తో రూపొందించారు. దీంతో పాటు గతంలో గెలాక్సీ ఫోన్లతో పాటు వచ్చిన ఎస్ పెన్ (S Pen)ను కూడా శామ్సంగ్ ఇవ్వనుంది. ఎస్ సిరీస్‌లో ఈ సపోర్ట్ ఉన్న మొట్టమొదటి ఫోన్ గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా మాత్రమే కావడం విశేషం.
Published by:Shiva Kumar Addula
First published:December 23, 2020, 10:49 IST