ప్రస్తుతం ఊహించనంత వేగంగా టెక్నాలజీ అభివృద్ది చెందుతోంది. ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇవి రెండూ సాధారణ జీవితంలో భాగంగా మారిపోయాయి. అయితే ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని, వినియోగదారుల అవగాహన రాహిత్యాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మంబైకి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఆన్‌లైన్‌లో కంప్లైంట్ చేస్తూ రూ.9 లక్షలు పోగొట్టుకున్న విషయం బయటకు వచ్చింది. దహిసర్ పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్ 419& 420, IPC సెక్షన్ 66(c)&66(d)లో IT యాక్ట్ కింద FIR ఫైల్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఇటువంటి సైబర్ నేరాల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా.. మోసాలు జరుగుతున్నాయి. ఇలా మోసపోయిన వారిలో చదువుకున్నవారే ఎక్కువగా ఉండటం ఆలోచించాల్సిన అంశం.
WhatsApp తెచ్చిన ముప్పు
నివేదిక ప్రకారం.. 68 సంవత్సరాలు యూనియన్ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి అయిన పుష్పలత ప్రదీప్ చిందర్కార్ వాట్సాప్ ద్వారా వచ్చిన ఒక ఫ్రాడ్ లింక్ ద్వారా తన సేవింగ్స్ అకౌంట్ నుంచి రూ.9 లక్షలు పోగొట్టుకున్నారు. ఆమెకు వస్తున్న పెన్షన్ దానిపై వచ్చే వడ్డీనే ప్రధాన ఆదాయ వనరు.
తన ఫిక్స్డ్ డిపాజిట్‌లో వచ్చిన సమస్య గురించి యూనియన్ బ్యాంక్ గ్రీవెన్స్ సెల్‌కు కంప్లైంట్ చేసేటప్పుడు చేసిన పొరపాటుతో నష్టపోయారు.
ఆన్‌లైన్‌లో ఫోన్ నంబర్
కంప్లైంట్ చేస్తున్న సమయంలో ఆన్‌లైన్‌లో పుష్పలత ప్రదీప్ చిందర్కార్ తన ఫోన్ నంబర్ ఎంటర్ చేశారు. వెనువెంటనే ఆమెకు రెండు ఫోన్ కాల్స్ వచ్చాయి. రెండో సారి కాల్ చేసిన వ్యక్తి.. వాట్సాప్‌కు ఒక లింక్ పంపిస్తామని, కంప్లైంట్ చేయడానికి ఒక యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపాడు. దీనిపై డౌట్ వచ్చి ఆమె ప్రశ్నించగా ఇది సాధారణంగా జరిగే ప్రాసెస్ అని ఆమెను నమ్మించాడు. అతని మాటలు నమ్మేసిన పుష్పలత ప్రదీప్ చిందర్కార్.. ఫోన్ కాల్‌లో చెప్పిన ప్రకారం యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు.
తర్వాత యాప్‌లో లాగిన్ కావడానికి తన ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్, పాస్‌వర్డ్, బ్యాంక్ ఐడీ వివరాలను ఎంటర్ చేశారు. వెంటనే ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. అకౌంట్‌లోని రూ.9 లక్షలను కోల్పోయాక ఆమెకు ఇది స్కామ్ అని తెలిసింది. తర్వాత తేరుకుని తన భర్త ఫోన్ నుంచి యూనియన్ బ్యాంక్‌కు కంప్లైంట్ చేశారు. పోలీసులకు కంప్లైంట్ చేయగా కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CYBER CRIME, Whatsapp