news18-telugu
Updated: August 3, 2020, 6:34 AM IST
Moon Pragyan Rover : చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ కదలికలు?... పరిశీలిస్తున్న ఇస్రో (credit - twitter)
ISRO Pragyan Rover : చంద్రయాన్ 2 భారత దేశ అంతరిక్ష ప్రయోగాలను మరో మెట్టు పైకి ఎక్కించిన విషయం మనకు తెలుసు. ఐతే... ఇందులో భాగంగా చంద్రుడిపై దింపాలనుకున్న విక్రమ్ ల్యాండర్... చివరిక్షణంలో అతి వేగంతో దిగి కూలిపోవడంతో... అప్పట్లో ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశ చెందారు. ఆ ల్యాండర్‌లోని బుజ్జి రోవర్ ప్రజ్ఞాన్... 2 వారాలపాటూ... సేవలు అందించాల్సి ఉండగా... అది స్పందించలేదు. దాంతో... బెటర్ లక్ నెక్ట్స్ టైమ్ అనుకున్నారు శాస్త్రవేత్తలు. ఐతే... ఇదివరకు నాసా ఉపగ్రహ చిత్రాల ద్వారా విక్రమ్ ల్యాండర్ శకలాల్ని గుర్తించిన... షణ్ముగ సుబ్రహ్మణ్యన్... మరోసారి కొత్త విషయం చెప్పారు. నాసా తాజా శాటిలైట్ ఫొటోల ఆధారంగా... ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై కొంత దూరం కదిలివెళ్లినట్లు ఉందని చెప్పారు.
చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ కొంత దూరం వెళ్లినట్లుగా దాని చక్రాల గుర్తులను షణ్ముగ గుర్తించారు. ఎక్కడైతే విక్రమ్ ల్యాండర్ కూలిపోయిందో... అక్కడి నుంచే ఆ చక్రాల దారి కనిపిస్తోంది. కొన్ని మీటర్ల దూరం వరకూ ప్రజ్ఞాన్ వెళ్లిందన్నది తాజా వాదన.
విక్రమ్ ల్యాండర్ కూలినప్పుడు... ప్రజ్ఞాన్ రోవర్‌ను కదిపేందుకు ఇస్రో ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఫలించలేదు. రోవర్ నుంచి సిగ్నల్స్ ఇస్రోకి చేరలేదు. అందువల్ల అది కదలట్లేదని ఇస్రో శాస్త్రవేత్తలు భావించారు. ఇప్పుడు షణ్ముగ చెప్పిన విషయాన్ని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ పరిశీలిస్తున్నారు. తమకు నాసా నుంచి సమాచారం ఏదీ రాలేదని ఆయన చెప్పారు. షణ్ముగ నుంచి తమకు ఈమెయిల్ సమాచారం వచ్చిందన్న శివన్... శాటిలైట్ ఫొటోలను తాము విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. ఐతే... అది నిజంగానే కదిలిందా లేదా అన్నదానిపై క్లారిటీ అప్పుడే ఇవ్వలేమని అన్నారు.

విక్రమ్ ల్యాండర్ కూలిన చోటుకి సంబంధించి నాసా ఇదివరకు విడుదల చేసిన ఫొటో (Source - Twitter - NCCS User News)
ఒకవేళ ప్రజ్ఞాన్ రోవర్ నిజంగానే కదిలివుంటే... ఇండియా అంతరిక్ష ప్రయోగాల్లో ఇదో విజయంగానే చెప్పుకోవాలి. అలాగే... ఆ రోవర్ నుంచి ఏదైనా సమాచారం, ఫొటోల వంటివి ఉంటే పొందవచ్చు. దీనిపై నాసా ఏమీ చెప్పకపోవడం వల్ల ఇస్రో శాస్త్రవేత్తలు పెద్దగా ఆశలు పెట్టుకోవట్లేదని తెలుస్తోంది.

విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్... ప్రతీకాత్మక చిత్రం
2019 జులై 22న చంద్రయాన్ 2కి సంబంధించి GSLV రాకెట్... చంద్రయాన్ 2 ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ను చంద్రుడి చెంతకు తీసుకెళ్లింది. షణ్ముగ ప్రకారం... జనవరి 4, 2020న నాసాకి చెందిన LRO తీసిన ఫొటోల ప్రకారం... ప్రజ్ఞాన్ రోవర్ కదులుతోందనే భావన ఉంది.
Published by:
Krishna Kumar N
First published:
August 3, 2020, 6:34 AM IST