Twitterకు చుక్కలు చూపిస్తున్న భారత్ యూజర్లు.. 3 మిలియన్లు దాటిన Koo App ఖాతాదారులు..

ప్రతీకాత్మక చిత్రం

ఆత్మనిర్భర్ విదేశీ కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. ట్విట్టర్ తోపాటు వాట్సప్ వంటి పలు విదేశీ కార్పొరేట్ కంపెనీలకు ధీటుగా స్వదేశీ సంస్థలు సత్తా చాటడం మొదలెట్టాయి. ఇప్పుడు ట్విట్టర్ కు కూ యాప్ చెక్ పెడుతోంది. 

  • Share this:
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో భారత వ్యతిరేక ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో వెయ్యికి పైగా ట్విట్టర్ ఖాతాలను తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వం గతవారంలో ట్విట్టర్ ను ఆదేశించింది. అయితే. తాము ఆ పని చేయలేమంటూ ట్విట్టర్ తెగేసి చెప్పింది. తమ యూజర్లు భావప్రకటన స్వేచ్ఛను కాపాడటం తమ విధి అంటూ ట్విట్టర్ సవివరమైన లెటర్ ను కేంద్రానికి రాసింది. దీంతోపాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని ఖాతాలను ఇండియాలో నిలిపివేసినట్టు మాత్రం ట్విట్టర్ వెల్లడించింది. దేశంలో హింసను రెచ్చగొట్టేలా ఉన్న హ్యాష్ ట్యాగ్ లను తొలగించినట్లు చెబుతున్న ట్విట్టర్ రైతుల ఆందోళనపై సోషల్ మీడియాలో సాగుతున్న తప్పుడు ప్రచారానికి అతిపెద్ద వేదికగా మారింది. ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు ట్వీట్ చేస్తూ రైతుల ఉద్యమానికి మద్దతు పలుకుతుండటంతో మోడీ ప్రభుత్వం ట్విట్టర్ పై ఆగ్రహంగా ఉంది.

పాకిస్తాన్‌, ఖలిస్తాన్‌తో లింకులు ఉన్న ఖాతాలను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన ట్విట్టర్ ఇప్పుడు షాక్ తింటోంది. కేంద్ర ప్రభుత్వ విభాగమైన ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్ట్రీతో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలు, అధికారులంతా ఇప్పుడు కూ వైపు అడుగులు వేస్తున్నారు. స్వదేశీ మైక్రోబ్లాగింగ్ సైట్ ఆత్మనిర్భర్ అవార్డు గెలుచుకున్న కూ అద్భుతంగా ఉందని, భారతీయ భాషల్లో చక్కగా పోస్టులు పెట్టుకోవచ్చంటూ ఇప్పుడు కూపై పెద్ద సోషల్ మీడియా ప్రచారం మొదలైంది.

మంత్రుల పోస్టులు..
మంత్రులు తాము కూలో అకౌంట్ ఓపన్ చేసుకున్నట్టు, ఇది చాలా బాగుందని పోస్టులు పెట్టడం అవి వైరల్ అవ్వటం చూస్తుంటే ట్విట్టర్ కు షాక్ తప్పేలా లేదు. రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్ వంటి మంత్రులు ఈమేరకు అప్పుడే చురుగ్గా పోస్టులు పెడుతున్నారు. నీతి ఆయోగ్, రైల్వే శాఖ, ఐటీ శాఖలు అధికారిక పోస్టులు కూడా కూలో పెడుతున్నాయి. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, క్రికెటర్ అనిల్ కుంబ్లే, సద్గురు జగ్గీ వాసుదేవ్ వంటివారంతా ఇప్పుడు కూలో చురుగ్గా ఉంటున్నారు. ఐటీ మంత్రి అమిత్ మాలవీయ, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర వంటివారు తాము కూలో ఎంటర్ అయినట్టు ట్వీట్లు పెడుతుండగా గత రెండు రోజుల్లోనే కూ యాప్ కు 3 మిలియన్ యూజర్లు వచ్చిచేరారు.

దీంతో కూకు 10 రెట్ల డౌన్లోల్డు పెరిగాయి. ఈమేరకు గత 48 గంటల్లో తమకు యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగిందంటూ కూ సంస్థ ఫౌండర్ మయాంక్ బిండవాట్కే అధికారిక ప్రకటన చేశారు. ట్విట్టర్ మన దేశ చట్టాలను గౌరవించటం లేదంటూ బీజేపీ నేషనల్ జనరల్ సెక్రెటరీ బీఎల్ సంతోష్ పేర్కొనగా, ఇదే విషయాన్ని యంగ్ ఎంపీ తేజస్వీ సూర్య కూడా ట్వీట్ చేశారు. దీంతో బెంగళూరు బేస్డ్ స్టార్టప్ కూను ట్విట్టర్ కు పోటీగా కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది.

వాయిస్ ఆఫ్ ఇండియా..
మేడిన్ ఇండియా, వాయిస్ ఆఫ్ ఇండియా దేశీ యాప్ గా ప్రజాదరణ పొందుతున్న కూ యాప్ ఇప్పుడు ట్రెండింగ్ గా నిలుస్తోంది. హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, తమిళం, మళయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఒరియా, అస్సామీ భాషల్లో ఇప్పటికే ఈ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫాం అందుబాటులోకి వచ్చింది. పది నెలలక్రితం సేవలు ప్రారంభమైన కూ శరవేగంగా డౌన్ లోడ్ అవుతున్న యాప్ గా రికార్డు సృష్టిస్తోంది కూడా.  25 లక్షలమందికిపైగా యూజర్లు కూకు ఉన్నారు. ఇక ట్విట్టర్ విషయానికి వస్తే మనదేశం ట్విట్టర్ కు మూడవ అతిపెద్ద కస్టమర్ గా 18.9 మిలియన్ యూజర్లతో ఉంది. మన భారత యూజర్లు కనుక ట్విట్టర్ వినియోగాన్ని నిలిపివేస్తే ఈ అమెరికన్ కంపెనీకు చిక్కులు తప్పవన్నమాట.
Published by:Nikhil Kumar S
First published: