VPN ban: వీపీఎన్​ను బ్యాన్ చేయండి.. కేంద్రానికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు.. ఎందుకంటే?

వీపీఎన్ బ్యాన్ చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు (ప్రతీకాత్మక చిత్రం)

భారతదేశంలో వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) సేవలను నిషేధించాలని హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

  • Share this:
భారతదేశంలో వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) సేవలను నిషేధించాలని హోం వ్యవహారాల  (Home Affairs) పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (Parliamentary Standing Committee) ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో దేశంలో వీపీఎన్​ బ్యాన్​ అవుతుందా? అనే ఊహాగానాలు రేకెత్తుతున్నాయి. అసలు వీపీఎన్​ ఎంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏంటి? దీన్ని భారత ప్రభుత్వం ఎందుకు బ్యాన్​ చేయాలనుకుంటుంది? అనే విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం.

VPN అంటే ఏమిటి?

VPN (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్) అనేది ఇంటర్నెట్ టూల్. ఇది యూజర్లకు, ఇంటర్నెట్​కు మధ్య సురక్షితమైన కనెక్షన్​ అందిస్తుంది. దీని సహాయంతో ఆన్​లైన్​లో మనల్ని ఎవరూ ట్రాక్​ చేయకుండా సురక్షితంగా కావాల్సిన వెబ్​సైట్లను స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, అనేక కార్పొరేట్​ సంస్థలు రిమోట్ వర్కింగ్ కోసం వీపీఎన్​ను ఉపయోగిస్తున్నాయి. పనికి సంబంధించిన సమాచారాన్ని, ఫైళ్లను ఎక్కడి నుంచైనా యాక్సెస్​ చేసే వీలు దీని ద్వారా కలుగుతుంది. అంతేకాదు, హ్యాకర్ల నుంచి మీ డేటాను సురక్షింతంగా కాపాడుకోవచ్చు. నెట్‌వర్క్ ట్రాఫిక్‌ను ఎన్‌క్రిప్ట్ చేయడం, మీ ఐపీ అడ్రస్​, లొకేషన్​ను సేఫ్టీగా ఉంచడం దీని పని. తద్వారా థర్డ్ పార్టీ ట్రాకర్లు, మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP), వెబ్‌సైట్లు, మాల్వేర్‌లు, స్పైవేర్‌లు మీ డివైజ్​లోకి చొరబడలేవు. అలాగే, మీరు వీపీఎన్​ ఉపయోగిస్తున్నంత సేపు మీ IP అడ్రస్​, లొకేషన్‌ను ఎవరూ ట్రాక్ చేయలేరు. మీరు ఆన్‌లైన్‌లో ఏం సెర్చ్​ చేస్తున్నారో కూడా తెలుసుకోలేరు.

వీపీఎన్​ ప్రాముఖ్యత ఏంటి?

కార్పొరేట్ సంస్థల డేటాను భద్రపరచడంలో VPN లు అత్యంత కీలకంగా పనిచేస్తాయి. చాలా కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్​ ఫ్రమ్​ హోమ్​ విధానంలో పనిచేయించుకుంటున్నాయి. అందుకే కంపెనీలు తమ విలువైన డేటా సేఫ్టీ కోసం వీపీఎన్​ను ఉపయోగిస్తున్నాయి. తద్వారా హ్యాకర్లు అధికారిక డేటా, కీలకమైన అడ్మిన్ పాస్‌వర్డ్‌లతో సహా ఫైల్‌లను హ్యాక్​ చేయలేరు.

ఆన్‌లైన్‌ సెర్చింగ్​కు వీపీఎన్ ఎందుకు అవసరం?

కేవలం ఆఫీసు పనులకే కాదు, మీ పర్సనల్​ ఇంటర్నెట్​ యూసేజ్​కు కూడా వీపీఎన్​ చాలా అవసరం. VPN లను ఉపయోగించడం ద్వారా మీ ఆన్‌లైన్ బ్యాంకింగ్, సోషల్ మీడియా, ఈ–మెయిల్ మొదలైన వాటి పాస్‌వర్డ్‌లను సురక్షితంగా కాపాడుకోవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో ఏమి చేస్తున్నారో ఇతరులకు తెలియజేసే కొన్ని నెట్‌వర్క్ ట్రాకింగ్ టూల్స్ ఉంటాయి. వీపీఎన్​ ఈ ట్రాకర్లను అడ్డుకుంటాయి.

ఐఎస్​పీలు మీ డేటా హిస్టరీ ట్రాక్​ చేయకుండా..

మీరు జియో, ఎయిర్​టెల్​, బీఎస్​ఎన్​ఎల్​కు చెందిన బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను కొనుగోలు చేసినప్పుడు మీ డేటా, ఆన్‌లైన్ యాక్టివిటీస్​ను ISP ద్వారా అవి సులభంగా ట్రాక్ చేయవచ్చు. మీకు ఇష్టమైన ప్రకటనలను చూపడానికి మీ బ్రౌజింగ్ హిస్టరీని ట్రాక్ చేయవచ్చు. అందువల్ల, వీపీఎస్​ ఉపయోగించడం ద్వారా మీ డేటా హిస్టరీ సురక్షితంగా ఉంటుంది.

నిషేధించిన వెబ్​సైట్లు సైతం చూసుకోవచ్చు..

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అడల్డ్​ కంటెంట్​ సినిమాలు, సోషల్ మీడియా హ్యాండిల్స్, గేమ్స్​, పార్న్​ వెబ్​సైట్లను యాక్సెస్ చేయడాన్ని నిషేధించాయి. అయితే, VPN లు వాడటం వల్ల ప్రభుత్వాలు నిషేధించిన కంటెంట్​ను సైతం చూసే అవకాశం ఉంటుంది. అలాగే, లైసెన్సింగ్ నిబంధనల కారణంగా కొన్ని దేశాలకే పరిమితమయ్యే స్పోర్ట్స్ స్ట్రీమింగ్ ఛానెల్‌లు, న్యూస్​ ప్లాట్​ఫామ్​లకు అందరూ చూసుకోవచ్చు.

పబ్లిక్ వై-ఫైకి కనెక్ట్ అయినప్పుడు మీ డేటాకు భద్రత

రైల్వే స్టేషన్లు, సైబర్ కేఫ్‌లు, కాఫీ షాపులు, రెస్టారెంట్లు మొదలైన వాటిలో అందుబాటులో ఉండే పబ్లిక్ వై-ఫై సైబర్ నేరగాళ్లకు అడ్డా. మీ డివైజ్​లో మాల్వేర్లను జొప్పించడానికి, హ్యాకర్లు మీ లొకేషన్​ను ట్రాక్ చేయడానికి, పాస్‌వర్డ్‌లను దొంగిలించడానికి, వీడియో/ఆడియోని రహస్యంగా రికార్డ్ చేయడానికి పబ్లిక్ నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుంటారు. వీపీఎన్​ ఉపయోగించడం ద్వారా హ్యాకర్ల బారీ నుంచి కాపాడుకోవచ్చు.

నిషేదించాలని పార్లమెంటరీ కమిటీ ఎందుకు కోరుతోంది?

భారతదేశం అంతటా VPN సేవలను శాశ్వతంగా నిరోధించాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. "వీపీఎన్​ సేవలు, డార్క్ వెబ్ ద్వారా అనేక టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. వీపీఎన్​ అనేది సైబర్ నేరగాళ్లకు వరంగా మారిందని పేర్కొంది. నేరస్థులు ఆన్‌లైన్‌లో తమ వివరాలు తెలియకుండా యథేఛ్చగా సైబర్​ నేరాలకు పాల్పడుతున్నారు. వారిని గుర్తించడం హోమ్​ శాఖకు సవాలుగా మారింది. అందువల్ల, దేశంలో VPN లను శాశ్వతంగా బ్లాక్ చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రభుత్వాన్ని కోరింది.

నిఘూ వ్యవస్థను బలోపేతం చేయాలి..

VPN లను శాశ్వతంగా బ్లాక్ చేయడానికి అంతర్జాతీయ ఏజెన్సీలతో ఒక సమన్వయ యంత్రాంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని కమిటీ సూచించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత మెరుగుపరచడం ద్వారా ట్రాకింగ్, నిఘా యంత్రాంగాన్ని బలోపేతం చేవవచ్చని, దీనిపై ఐటీ మంత్రిత్వ శాఖ చొరవ తీసుకోవాలని కమిటీ కోరుతోంది.

మీపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది?

భారతదేశంలో VPN ని నిషేధించడం వల్ల వర్క్​ ఫ్రమ్​ హోమ్​ లేదా 'రిమోట్ వర్కింగ్' కల్చర్​ వెంటనే ప్రమాదంలో పడవచ్చు. ఇదే జరిగితే మీరు ఆఫీసుకు వెళ్లి సురక్షితమైన ఇంటర్నెట్ కనెక్షన్‌లో మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.

Richest Cricketers: ఇండియాలో అత్యధిక సంపాదన కలిగిన క్రికెటర్లు ఎవరో తెలుసా? కోహ్లీ, ధావన్, జడేజా ఎంత సంపాదిస్తారు?

Published by:John Naveen Kora
First published: