ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు (Ola Electric Scooter) మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. దీన్ని కొందరు మోసగాళ్లు అవకాశంగా తీసుకుంటున్నారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల(Ola Electric Scooters)ను ఆన్లైన్లో విక్రయిస్తున్నామంటూ వెబ్సైట్ పెట్టి ఇప్పటికే 1000 మందికి పైగా వినియోగదారుల్ని మోసగించారు. ఈ మోసానికి సంబంధించి మూడు రాష్ట్రాలకు చెందిన మొత్తం ఇరవై మందిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. దీంతో ఈ నకిలీ వెబ్సైట్ విషయం వెలుగులోకి వచ్చింది. బయట ఫిజికల్ డీలర్ల ద్వారా కొనుగోలు చేయడానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో లేవు. ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ ఎనర్జీ.. లాంటి సంస్థల ఈవీ(EV)లను కొనుక్కోవాలంటే ఆన్‌లైన్‌పై ఆధారపడక తప్పని పరిస్థితి. దీంతో నకిలీ వెబ్సైట్లు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ముఠా నకిలీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వెబ్సైట్(Fake Ola Electric Scooter Website)ను ప్రారంభించి, ఎంతోమందిని మోసగించింది. దీని ద్వారా స్కూటర్ల బుకింగ్స్, పర్చేజింగ్ ఫార్మాలిటీలని చెప్పి డబ్బులు గుంజుతారు. తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపిణీ చేయకుండా జాప్యం చేస్తారు.
ఈ మోసగాళ్ల చేతిలో ఓ బాధితురాలు ఇటీవల రూ.30,998 పోగొట్టుకున్నారు. ఆమె ఫిర్యాదుతో ఈ మోసం బయటపడింది. పోలీసులు రంగంలోకి దిగి, ముఠా సభ్యుల్లో ఒకరిని బెంగళూరులో గుర్తించారు. అతడిని విచారించిన తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాను మొత్తం పట్టుకోగలిగారు. వారి నుంచి ఏడు ల్యాప్‌టాప్‌లు, 38 స్మార్ట్ఫోన్లు, 25 బేసిక్ ఫోన్లు, రెండు హార్డ్ డిస్క్‌లు, రెండు స్మార్ట్‌వాచ్‌లు, 114 సిమ్ కార్డ్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో నలుగురు తెలంగాణ , ముగ్గురు జార్ఖండ్, 11 మంది బీహార్, ఇద్దరు కర్ణాటకకు చెందిన వారని తెలిపారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఓలా స్కూటర్లను ఆన్లైన్లో కొనుగోలు చేయాలనుకున్నప్పుడు మీరు అధికారిక కంపెనీ వెబ్సైట్(Official Company Website)లో బ్రౌజ్ చేస్తున్నారా? లేదా? అనేది కచ్చితంగా చెక్ చేసుకోండి. OEMలు సాధారణంగా రిజర్వేషన్ టోకెన్ మొత్తాన్ని మాత్రమే అడుగుతాయి. కానీ ఇతర ఏ ఛార్టీలను కట్టమని అడగవు. కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్ రసీదు మీ మెయిల్ ఐడీ(ID)కి ఫార్వర్డ్ అవుతుంది. లేదా కంపెనీ కస్టమర్ కేర్ సెంటర్లకు కాల్ చేయడం ద్వారా ఈ విషయాన్ని ధ్రువీకరించుకోవచ్చు. రవాణా ఖర్చులు, బీమాకు సంబంధించిన పేమెంట్లను కంపెనీలు ముందే అడగవు. డెలివరీ సమయంలో మీరు పూర్తి డబ్బులు చెల్లించేటప్పుడు వాటితోపాటే ఇవీ కట్టించుకుంటారు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకోవడం ద్వారా సేఫ్‌గా EVలను కొనుగోలు చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CYBER CRIME, Electric Scooter, Ola e Scooter, Ola Electric Scooter