Redmi Laptop: ఆగస్ట్ 3న భారత మార్కెట్​లోకి రెడ్‌మి తొలి ల్యాప్‌టాప్​.. ధర ఎంతంటే..

రెడ్‌మీ ల్యాప్‌టాప్

Redmi Laptop: రెడ్​మీ ఇటీవల నిర్వహించిన నోట్​10టీ స్మార్ట్​ఫోన్​ లాంచింగ్​ ఈవెంట్​లో ఈ ల్యాప్​టాప్​కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

  • Share this:
షియోమి సబ్​బ్రాండ్​ రెడ్‌మి నుంచి భారత మార్కెట్​లోకి ఆగస్ట్​ 3న తొలి ల్యాప్‌టాప్‌ విడుదల కానుంది. ఇప్పటికే రెడ్​మీ 2019 నుంచి చైనా మార్కెట్​లో ల్యాప్‌టాప్‌లను విక్రయిస్తుంది. అయితే దాదాపు రెండేళ్ల తర్వాత గ్లోబల్​ మార్కెట్​లోకి వీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలిసారి భారత మార్కెట్​లోకి ల్యాప్​టాప్​ను విడుదల చేసేందుకు సన్నద్దమవుతోంది. రెడ్​మీ ఇటీవల నిర్వహించిన నోట్​10టీ స్మార్ట్​ఫోన్​ లాంచింగ్​ ఈవెంట్​లో ఈ ల్యాప్​టాప్​కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దీన్ని రెడ్​మిబుక్​ లైనప్​లో తీసుకురానున్నట్లు తెలిపింది. దీని డిజైన్​, కలర్​ ఆప్షన్లను ఇప్పటికే టీజ్​ చేసింది. ఇది ముదురు బూడిద రంగులో రానున్నట్లు పేర్కొంది.

ఈ ల్యాప్​టాప్​కు సంబంధించిన మరిన్ని వివరాలను ఆగస్టు 3న జరగనున్న లాంచింగ్ ఈవెంట్​లో వెల్లడించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ మేరకు రెడ్​మీ ఎండీ మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. ‘‘ఆగస్ట్ 3న భారత మార్కెట్​లోకి విడుదలయ్యే ‘రెడ్‌మిబుక్’తో లాప్​టాప్ మార్కెట్​లోకి కూడా ప్రవేశించనున్నాం. తద్వారా రెడ్‌మీ ఉత్పత్తులైన పవర్ బ్యాంక్, టిడబ్ల్యుఎస్ ఇయర్‌బడ్‌లు, స్మార్ట్ టివి సరసన రెడ్​మీ ల్యాప్​టాప్​లు కూడా చేరనున్నాయి” అని తన ట్వీట్​ ద్వారా వెల్లడించారు. ఇక, రెడ్​మీ వెబ్‌సైట్​లో అడిగే కొన్ని ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడం ద్వారా కస్టమర్లు రెడ్‌మీ గూడీస్‌ను కూడా గెలుచుకోవచ్చని తెలిపారు.

ఇప్పటికే చైనా మార్కెట్​లో విక్రయాలు..
అయితే, భారత మార్కెట్​లోకి లాంచింగ్​కు సిద్దంగా ఉన్న రెడ్​మీ బుక్​ ధర, ఫీచర్లను అధికారింగా వెల్లడించనప్పటికీ, సోషల్ మీడియాలో కొన్ని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఊహాగానాలే నిజమైతే.. రెడ్​మీబుక్​ ఎనిమిదవ జనరేషన్​ ఇంటెల్ కోర్ ఐ 7 ప్రాసెసర్​తో రానుంది. దీనిలో ఎన్విడియా జిఫోర్స్ MX250 గ్రాఫిక్స్ కార్డ్​ను అందించనున్నారు. ఇది 512GB వరకు సాలిడ్-స్టేట్ డ్రైవ్ (SSD), 10 గంటల బ్యాటరీ బ్యాకప్​తో వస్తుంది.

ఇక, ఈ ల్యాప్​టాప్​ 14 అంగుళాలు, 16 అంగుళాల డిస్​ప్లేలు గల రెండు వేరియంట్లలో రానుంది. ఈ రెండూ రూ .50 వేల ధరల శ్రేణిలో వచ్చే అవకాశం ఉంది. రెడ్‌మీ భారతీయ పీసీ మార్కెట్​లోకి ప్రవేశిస్తుండటంతో ఇది హెచ్‌పి, లెనోవా, డెల్, ఏసెర్ వంటి ప్రముఖ బ్రాండ్లకు గట్టి పోటీనివ్వనుంది. మరో చైనా బ్రాండ్​ రియల్​మీ కూడా ఇదే ఏడాది పిసి మార్కెట్​లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published: