Meta Head: ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా( Meta), ఇండియా విభాగానికి హెడ్‌గా సంధ్య దేవనాథన్‌ను అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత హెడ్‌గా ఉన్న అజిత్ మోహన్ తన ఉద్యోగానికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో సంధ్యను నియమిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఆమె 2023 జనవరి 1 నుండి మెటా ఇండియా హెడ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆమె మెటా గేమింగ్ విభాగం ఏషియా పసిఫిక్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఆమె ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకున్నారనే విషయం చాలా కొద్దిమందికే తెలుసు. ఇండియన్ టెక్ సెక్టార్లో టాప్ పర్సనాలిటీస్‌లో ఒకరైన సంధ్యా దేవనాథన్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ కెరీర్ గురించి తెలుసుకుందాం.
చదువు ఇలా
సంధ్య 1994లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (B.Tech) చేశారు. తర్వాత 1998లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ (MBA) చదివారు. 2014లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి లీడర్‌షిప్‌పై బ్రీఫ్ కోర్సు పూర్తి చేశారు.
కెరీర్
సంథ్య మొదట సిటీగ్రూప్‌లో కెరీర్ ప్రారంభించారు. 2009లో స్టాండర్డ్ చార్టర్డ్ సంస్థకి మారారు. 2016 జనవరిలో ఆమె మెటా(ఫేస్బుక్) ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఫేస్బుక్(Facebook)లో ఆమె మొదట సౌత్ ఈస్ట్ ఏషియాకు సంబంధించి గ్రూప్ డైరెక్టర్‌గా పని మొదలుపెట్టారు. ఎనిమిది నెలల తర్వాత సింగపూర్‌కు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా, వియత్నాం బిజినెస్ హెడ్‌గా ప్రమోట్ అయ్యారు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లు అన్నీ ఆమెకు మెటాను ముందుకు నడిపించడంలో ఎంతగానో ఉపయోగపడతాయని కంపెనీ భావించినట్లు తెలుస్తోంది.
సవాళ్లు బోలెడు
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాంటి వాటిని సంధ్య పర్యవేక్షించనున్నారు. వాట్సాప్‌లో జియోమార్ట్‌కు సంబంధించిన ప్రాజెక్టును హ్యాండిల్ చేస్తారు. అందుకు ఆమెకున్న ఇ-కామర్స్ అనుభవం ఎంతో ఉపకరిస్తుంది. దీనితో పాటు భారత దేశ ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం, చట్టాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ముందుకు వెళ్లడం వంటివి ఆమె ముందున్న సవాళ్లు. అంతేకాకుండా ఇక్కడ కొత్త రెవెన్యూలను సృష్టించుకోవడం పైనా ఆమె దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వీటన్నింటినీ ఆమె మునుపటి ఎక్స్‌పీరియన్స్‌లతో ముందుకు తీసుకెళ్లగలరని మెటా భావిస్తోంది.
ప్రస్తుతం మెటా ఆర్థిక కారణాల దృష్ట్యా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన కార్యాలయాలలో ఉద్యోగులను తీసివేసింది. భారత్‌లోని ఉద్యోగులపైనా ఈ ప్రభావం పడింది. దీంతో కంపెనీలో ఉద్యోగుల నుంచి కొంత తిరుగుబాటు ధోరణి ఉంది. ఈ సమయంలో సంధ్య తన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పరిస్థితులను ఆమె సమర్థవంతంగా ఎదుర్కోగలరని కంపెనీ ఆశిస్తోంది. తమ వ్యాపార, ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆమె ఇండియాలో కంపెనీని నడిపించగలరని, మెటా ఇండియాకు కొత్త దిశా నిర్దేశం చేయగలరని మెటా తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.