Home /News /technology /

NEW EXPERIMENT BY IISC RESEARCHERS MANUFACTURE OF NANO ROBOTS TO CLEAN TEETH HOW THEY WORK KNOW HERE GH VB

Robots: ఐఐఎస్‌సీ పరిశోధకుల కొత్త ప్రయోగం.. నానో రోబోల తయారీ.. ఇవి ఏ పని చేస్తాయంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) రిసెర్చర్లు చిన్న రోబోలను తయారు చేశారు. డెంటినల్ ట్యూబుల్స్‌ లేదా దంతాల సన్నటినాళాల్లోని బ్యాక్టీరియాను కూడా నాశనం చేయగల నానో-సైజ్ రోబోలను (Nano-size Robots) అభివృద్ధి చేసినట్లు ఐఐఎస్‌సీ మే 16న ప్రకటించింది.

ఇంకా చదవండి ...
దంతాల (Teeth) లోపల ఏర్పడిన బ్యాక్టీరియా (Bacteria)ను తొలగించడం చాలా కష్టంతో కూడుకున్నపని. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య విధానాలు కూడా దంతాలపై, చిగుళ్ల మధ్య ఉన్న బ్యాక్టీరియాను సమూలంగా నాశనం చేయలేకపోతున్నాయి. రూట్ కెనాల్ (Root Canal) చికిత్స చేసినా కూడా పళ్ల లోపల బ్యాక్టీరియా నశించడం లేదు. అందుకే రూట్ కెనాల్ చికిత్స పొందినవారు కూడా మళ్లీ దంతాల ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారు. అయితే ఈ సమస్యపై దృష్టిసారించిన బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) రిసెర్చర్లు చిన్న రోబోలను తయారు చేశారు. డెంటినల్ ట్యూబుల్స్‌ లేదా దంతాల సన్నటినాళాల్లోని బ్యాక్టీరియాను కూడా నాశనం చేయగల నానో-సైజ్ రోబోలను (Nano-size Robots) అభివృద్ధి చేసినట్లు ఐఐఎస్‌సీ మే 16న ప్రకటించింది. ఈ రోబో సాయంతో రూట్ కెనాల్ చికిత్సలు విజయవంతం అవుతాయి. ఈ బుల్లి రోబో ప్రత్యేకతలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (CeNSE), ఐఐఎస్‌సీ రీసెర్చ్ అసోసియేట్, ఐఐఎస్‌సీ థెరనాటిలస్ స్టార్టప్ కో-ఫౌండర్ షణ్ముఖ్ శ్రీనివాస్ ఈ రోబో గురించి వివరించారు. “దంతాలలో లోతుగా ఉన్న నాళాలు చాలా చిన్నగా ఉంటాయి. ఈ నాళాలలోని కణజాలంలో లోతుగా బ్యాక్టీరియా పేరుకుపోతుంది. ప్రస్తుత వైద్య పద్ధతులు లోపలికి వెళ్లి ఈ తరహా బ్యాక్టీరియాను చంపేంత సమర్థవంతంగా లేవు." అని షణ్ముఖ్ పేర్కొన్నారు. దంతాల ఇన్ఫెక్షన్లను వదిలించుకునేందుకు లక్షల మంది ప్రజలు రూట్ కెనాల్ చికిత్సలు చేయించుకుంటున్నారని పరిశోధకులు తెలిపారు. ఈ రూట్ కెనాల్ ఆపరేషన్‌ భాగంగా పల్ప్ అని పిలిచే పంటి లోపల ప్రభావితమైన మృదు కణజాలాన్ని తొలగిస్తారు. అలానే అనారోగ్యానికి కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడానికి యాంటీబయాటిక్స్ లేదా రసాయనాలతో పంటిని శుభ్రం చేస్తారని చెప్పుకొచ్చారు.

అయితే చాలా సందర్భాలలో ఈ చికిత్స బ్యాక్టీరియాను పూర్తిగా తొలగించలేదని వివరించారు. ముఖ్యంగా ఎంటరోకాకస్ ఫేకాలిస్ అనే యాంటీబయాటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియా దంతాల లోతుల్లో సజీవంగానే ఉంటుందని తెలిపారు. దంతపు గొట్టాలు అని పిలిచే పంటిలోని మైక్రోస్కోపిక్ భాగాల్లో ఇవి దాగి ఉంటాయని చెప్పుకొచ్చారు. తాము అభివృద్ధి చేసిన చిట్టి రోబోలు ఇలాంటి బ్యాక్టీరియాని సమర్థవంతంగా నాశనం చేయగలవని వెల్లడించారు.ఐఐఎస్‌సీ తాజా పరిశోధనను అడ్వాన్స్డ్ హెల్త్‌కేర్ మెటీరియల్స్ (Advanced Healthcare Materials) ప్రచురించింది. దీని ప్రకారం, తక్కువ-తీవ్రత గల అయస్కాంత క్షేత్రంతో కంట్రోల్ చేసేందుకు ఈ హెలికల్ నానోబోట్‌లను ఇనుముతో పూత పూసిన సిలికాన్ డయాక్సైడ్‌తో పరిశోధకులు తయారుచేశారు. అయస్కాంత క్షేత్రం ఫ్రీక్వెన్సీని సర్దుబాటు చేయడం ద్వారా వారు నానోబోట్‌లను ఎలా అంటే అలా కదిలేలా చేయవచ్చు. అలాగే వీటిని దంతాల లోపల లోతుగా చొచ్చుకుపోయేలా చేయవచ్చని పరిశోధకులు తెలిపారు. నిజానికి ఈ రోబోలను ఆల్రెడీ దంతాల లోతుల్లోకి తీసుకెళ్లామన్నారు. దీనికి సంబంధించిన ఫొటోని ట్విట్టర్ వేదికగా కూడా షేర్ చేశారు. ఆ ఫొటోల్లో దంతాల లోపలికి వెళ్లిన రోబోలను చూడొచ్చు. ఇలా లోపలికి వెళ్లిన వాటిని తిరిగి బయటికి తీసుకురావచ్చని కూడా పరిశోధకులు తెలిపారు. "మేం వాటిని రోగి పళ్ల నుంచి వెనక్కి తీసుకోగలం." అని షణ్ముఖ్ అన్నారు.

సీఈఎన్ఎస్ఈ (CeNSE)లోని రీసెర్చ్ అసోసియేట్, థెరనాటిలస్ సహ వ్యవస్థాపకుడు దేబయన్ దాస్‌గుప్తా వీటి పనితీరు గురించి వివరించారు. “నానోబోట్‌ల ఉపరితలం వేడిని ఉత్పత్తి చేసేలా అయస్కాంత క్షేత్రాన్ని చేంజ్ చేయవచ్చు" అని అన్నారు. ఇలా వేడెక్కిన నానోబోట్‌ల ఉపరితలం సమీపంలోని బ్యాక్టీరియాను చంపగలదని వివరించారు. అయితే రూట్ కెనాల్ చికిత్సలో జెర్మ్స్, కణజాల వ్యర్థాలను తొలగించేందుకు వాడే అల్ట్రాసౌండ్ లేదా లేజర్ పల్సెస్ కేవలం 800 మైక్రోమీటర్ల దూరం వరకు మాత్రమే చొచ్చుకుపోతాయని వారు తెలిపారు. వాటి ఎనర్జీ కూడా వేగంగా తగ్గిపోతుందని అన్నారు. నానోబోట్‌లు మాత్రం 2,000 మైక్రోమీటర్ల వరకు చొచ్చుకుపోగలిగాయని పేర్కొన్నారు. ఈ నానోబోట్‌లు బ్యాక్టీరియాను చంపడానికి వేడిని మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇవి హానికరమైన రసాయనాలు లేదా యాంటీబయాటిక్‌లకు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందన్నారు. వీటిని జీవ కణజాలాలలో ఉపయోగించడం సురక్షితమని తేలిందని స్పష్టం చేశారు.
Published by:Veera Babu
First published:

Tags: Nano, Robotics, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు