ఓటీటీ రంగంలో దూసుకుపోతున్న స్ట్రీమింగ్ సర్వీస్ నెట్‌ఫ్లిక్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భారీ యాక్షన్ చిత్రాలను సైతం ఓటీటీ కోసమే ప్రత్యేకంగా నిర్మించిన ఘనత ఒక్క నెట్‌ఫ్లిక్స్‌కే దక్కిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అమెరికాకు చెందిన ఈ సంస్థ కేవలం ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే కాదు తెలుగు, తమిళం, మలయాళం వంటి అనేక ప్రాంతీయ భాషల్లో వెబ్‌సిరీస్‌లను రూపొందిస్తుంది. తద్వారా ఎక్కువ మంది యూజర్లకు త్వరగా చేరువైంది. ఇప్పుడు ప్రపంచ ఓటీటీ మార్కెట్లో శరవేగంగా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే, ఇప్పటివరకు ఓటీటీ వేదికగా ఎంటర్టైన్మెంట్ సేవలు అందించిన నెట్‌ఫ్లిక్స్ తాజాగా గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసిందని వార్తలొస్తున్నాయి.
అయితే ఈ సేవలను నెట్‌ఫ్లిక్స్ తన యాప్‌లో కాకుండా ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా అందించనుందని టాక్ నడుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రైబర్లకు ఉచితంగా గేమింగ్ సర్వీసులకు అందించనున్నట్లు సమాచారం. ఈ నెట్‌ఫ్లిక్స్ గేమింగ్ యాప్ ఆండ్రాయిడ్, యాపిల్ ఐఫోన్ రెండింటిలోనూ అందుబాటులోకి రానుంది. ఈ గేమింగ్ ప్లాట్‌ఫామ్ యాపిల్ ఆర్కేడ్‌ను పోలి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు గేమింగ్ రంగంలో ముందున్న గూగుల్ స్టాడియా, ఎక్స్‌బాక్స్ క్లౌడ్ తరహాలోనే నెట్‌ఫ్లిక్స్ గేమింగ్ సేవలు ఉండనున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రైబర్లకు ఫ్రీ యాక్సెస్..
ఈ గేమింగ్ సేవలను యూజర్ క్లౌడ్ సర్వీసెస్ ద్వారా ఆన్లైన్లోనే వినియోగించుకోవచ్చు. డాక్యుమెంటరీస్, స్టాండ్ అప్ స్పెషల్స్ తరహాలోనే గేమింగ్ సేవలను కూడా ప్రత్యేక కేటగిరీల్లో అందించనున్నారు. ఇప్పటికే వీడియో స్ట్రీమింగ్‌లో సత్తా చాటుతున్న నెట్‌ఫ్లిక్స్.. రాబోయే కాలంలో గేమ్ స్ట్రీమింగ్ సేవల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని ఆకర్షించేలా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖ వీడియో గేమ్స్ డెవలపింగ్ సంస్థ ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ (ఈఏ)కు చెందిన ఉద్యోగి.. మైక్ వెర్డూ అనే గేమ్ డెవలపర్‌ను నియమించుకున్నట్లు సమాచారం.
కాగా, నెట్‌ఫ్లిక్స్ ఆదాయం సంవత్సరానికి 19% పెరుగుతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 209 మిలియన్ల మంది పెయిడ్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. వచ్చే ఏడాది వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నెటిఫ్లిక్స్ గేమింగ్ యాప్ అందుబాటులోకి వస్తే వీరందరికీ ఫ్రీ యాక్సెస్ లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Netflix