NASA: ప్రైవేట్ స్పేస్ సెంటర్స్‌కు నాసా బంపర్ ఆఫర్, చంద్రుడిపై మట్టిని తెస్తే

2024 నాటికి మనుషులను చంద్రుడి మీదకి పంపించి, అక్కడి వనరులను ఉపయోగించుకుని అంగారక గ్రహంపై ప్రయోగాలు చేసేందుకు ప్రణాళిక రచించింది.

news18-telugu
Updated: September 11, 2020, 6:28 PM IST
NASA: ప్రైవేట్ స్పేస్ సెంటర్స్‌కు నాసా బంపర్ ఆఫర్, చంద్రుడిపై మట్టిని తెస్తే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చంద్రునిపై ఉండే రాళ్లను తీసుకువచ్చే ప్రైవేట్ సంస్థలకు డబ్బు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని నాసా ప్రకటించింది. అక్కడి మట్టి, ఫోటోలు వంటి వాటిని భవిష్యత్తు ప్రాజెక్టులకు వనరులుగా ఉపయోగించుకోనుంది. ఇందుకోసం ప్రైవేటు కంపెనీలకు డబ్బు చెల్లించాలనుకుంటుంది. 2024 నాటికి మనుషులను చంద్రుడి మీదకి పంపించి, అక్కడి వనరులను ఉపయోగించుకుని అంగారక గ్రహంపై ప్రయోగాలు చేసేందుకు ప్రణాళిక రచించింది. అంటే మార్స్ మీద ప్రయోగాలు చేసేందుకు చందమామను ఒక వే పాయింట్‌గా ఉపయోగించుకోవడమే లక్ష్యంగా నాసా పనిచేస్తోందని తెలుస్తోంది. ఇప్పటి వరకు మూడు దేశాలు మాత్రమే ప్రయోగాల ద్వారా చంద్రుడి ఉపరితలానికి చేరువయ్యాయి. "నాసా ఒక ప్రైవేటు సంస్థ నుంచి చంద్రుడి మట్టిని కొనుగోలు చేయనుంది. అంతరిక్ష వనరులను సేకరించేందుకు, వాటితో వ్యాపారం చేయడానికి నియమ నిబంధనలు రూపొందించాల్సిన సమయం ఆసన్నమైంది" అని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్స్టైన్ ట్వీట్ చేశారు.

ఇలాంటి చర్యలపై అంతర్జాతీయంగా ఎలాంటి నియమ నిబంధనలు లేవు. చట్టపరమైన ఏకాభిప్రాయం కూడా లేదు. అయినా గత సంవత్సరం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన ఒక కార్యనిర్వాహక ఉత్తర్వులలో కొన్ని విషయాలు పేర్కొన్నారు. దాని ప్రకారం గ్రహాంతర మైనింగ్ నిర్వహించడానికి, గ్రహాలు, చంద్రుడి మట్టి లేదా మట్టిలో లభించే వనరుల సేకరణ విషయంలో అమెరికా ముందుండాలని కోరుకుంటుంది. అంతరిక్ష ఒప్పందాలు సరిగ్గా లేకపోవడం అమెరికాకు మంచి అవకాశంగా మారింది.

జాబిల్లి ఉపరితలంపై ఎక్కడి నుంచైనా 50 నుంచి 500 గ్రాముల మూన్ రాక్ లేదా రెగోలిత్ ను సేకరించాలని, అందుకు ఆధారంగా ఫొటోలు కూడా చూపించాలని ప్రస్తుత టెండర్లో నాసా పొందుపరిచింది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు పోటీ పడొచ్చని తెలిపింది. సేకరించిన వాటిపై అన్ని రకాల హక్కులు నాసాకే ఇవ్వాలని కండీషన్ పెట్టింది. టెండర్ పత్రాల ప్రకారం, కాంట్రాక్టు కొన్ని వేల డాలర్ల విలువ చేసేదిగా తెలుస్తోంది. ప్రాజెక్టు తేదీలను నాసా త్వరలో నిర్ణయిస్తుందని బ్రిడెన్స్టైన్ చెప్పాడు.

చందమామ ధ్రువ ప్రాంతాల నుంచి మంచును తవ్వి తాగునీటికి, దాని నుంచి అణువులను విడదీసి రాకెట్ ఇంధనాన్ని తయారు చేయాలని నాసా భావిస్తోంది. అమెరికా అంతరిక్ష సంస్థ ఇలాంటి ప్రాజెక్టులకు ఎక్కువగా ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంపై ఆధారపడుతోంది. ఇలాంటి సంస్థల్లో స్పేస్ ఎక్స్ ఒకటి. ఈ సంస్థ నాసా కోసం సరకును అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళుతుంది. వ్యోమగాములను అంతరిక్షానికి తీసుకువెళ్లే పరీక్షలు స్పేస్ ఎక్స్ పూర్తిచేసింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 11, 2020, 6:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading