‘అద్భుతం జరిగినప్పుడు ఎవరూ గుర్తించరు’.. డైలాగ్ గుర్తుందా? ఇది అచ్చం అలాంటిదే

గత శుక్రవారం ఖగోళశాస్త్ర పరంగా ఒక అద్బుతం జరిగింది. ఆరోజు ఒక గ్రహశకలం భూమికి అత్యంత చేరువగా వచ్చిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది.

news18-telugu
Updated: November 19, 2020, 11:19 PM IST
‘అద్భుతం జరిగినప్పుడు ఎవరూ గుర్తించరు’.. డైలాగ్ గుర్తుందా? ఇది అచ్చం అలాంటిదే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
‘అద్భుతాలు జరిగినప్పుడు ఎవరూ గుర్తించారు. జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు.’ ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందా? ఖలేజా సినిమాలోది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఏ ఆలోచనతో అది రాశాడో కానీ, అలాంటి ఘటన ఒకటి రియల్‌గా జరిగింది. గత శుక్రవారం ఖగోళశాస్త్ర పరంగా ఒక అద్బుతం జరిగింది. ఆరోజు ఒక గ్రహశకలం భూమికి అత్యంత చేరువగా వచ్చిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. కానీ దాని గమనాన్ని, మార్గాన్ని శాస్త్రవేత్తలు గుర్తించలేకపోయారు. నవంబరు 13న ఈ అనుకోని సంఘటన జరిగినట్టు నాసా వెల్లడించింది. ఆ గ్రహశకలం పేరు 2020 VT4. దీని వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ స్పేస్ రాక్ మన గ్రహానికి 250 మైళ్ల దూరం (400 కిలోమీటర్లు) వరకు వచ్చింది. ముంబై నుంచి ఢిల్లీ మధ్య ఉండే దూరం 878 మైళ్లు. దీన్ని బట్టి ఆ ఆస్ట్రాయిడ్ మనకు ఎంత చేరువగా వచ్చిందో అంచానా వేయవచ్చు.

గత కొన్ని దశాబ్దాలుగా ఖగోళ పరిశోధనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అంతరిక్షంలో ఏ చిన్న మార్పు కనిపించినా శాస్త్రవేత్తలు గుర్తించగలుగుతున్నారు. అయినా తాజా ఆస్ట్రాయిడ్ గమనాన్ని ఎవరూ అంచనా వేయలేకపోవడం విశేషం. గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చి, దిశ మార్చుకొని వెళ్లిపోయినట్లు ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టం (ATLAS) గుర్తించింది. అంతరిక్ష వ్యర్థాలు బ్లైండ్ స్పాట్ (సూర్యుని దిశ)లో పడిపోయినప్పుడు ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల గ్రహశకలం కక్ష్య ప్రభావితమై, అది భూమికి దగ్గరగా వచ్చినట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మళ్లీ రావచ్చు
ఈ సంఘటనను ఖగోళ శాస్త్రవేత్త టోనీ డన్ యానిమేటెడ్ రిప్రజెంటేషన్ ద్వారా ఆదివారం ట్విట్టర్‌లో వివరించారు. గ్రహశకలం భూమి వద్దకు ఎలా చేరుకుందో ఆయన తెలిపారు. కొన్ని వందల మైళ్ల దూరం ప్రయాణించి, దక్షిణ పసిఫిక్ మహాసముద్రం వద్ద అది కక్ష్యను మార్చుకుంది. ఇది భవిష్యత్తులో మళ్లీ భూమి వైపునకు వచ్చే అవకాశం ఉంది. ఈ స్పేస్ రాక్ సుమారు 10 మీటర్ల (32 అడుగులు) పరిమాణంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇంత చిన్న సైజులో ఉండే గ్రహశకలాల వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం ఏర్పడదు. మన వాతావరణంలోకి ప్రవేశిస్తే రాపిడి వల్ల అది కాలిపోయి, పూర్తిగా నశించిపోతుంది. ఈ సంవత్సరం చాలా గ్రహశకలాలు భూమికి దగ్గరగా వచ్చాయి. 2020 QG అనే ఆస్టరాయిడ్ ఆగస్టు 16న భూమికి 2,000 మైళ్ల (3218 కిలోమీటర్లు) వరకు చేరువగా వచ్చింది. ఇది హ్యాచ్‌బ్యాక్ కారు పరిమాణంలో ఉంది.

గుర్తిస్తేనే మేలు
ఇలాంటి గ్రహశకలాల వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం ఉండదు. అయినా వాటిని గుర్తించడం ముఖ్యం. అంతరిక్షంలో జరిగే మార్పులపై నిఘా ఉంచడం వల్ల అంతరిక్ష వ్యర్థాలు భూమికి హాని కలిగించే ప్రమాదాలను తగ్గించవచ్చు. ఇది శాస్త్రీయ విచారణకు కూడా ఉపయోగపడుతుంది. భూమికి దగ్గరగా వచ్చే వస్తువులను NEOలు (నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్‌) అంటారు. గ్రహాల గురుత్వాకర్షణ శక్తి అంతరిక్ష వస్తువుల మార్గాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో NEOల ద్వారా తెలుసుకోవచ్చు. ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వాన్ని అధ్యయనం చేసేందుకు కూడా ఇవి తోడ్పడతాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 19, 2020, 11:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading