ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటరోలా ఇటీవల రెండు స్మార్ట్ఫోన్లను భారత్‌లో లాంచ్ చేసింది. మోటరోలా ఎడ్జ్ 20, మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ డివైజ్‌లు ఇటీవల విడుదలయ్యాయి. వీటిలో మోటరోలా ఎడ్జ్ 20 వేరియంట్ అమ్మకాలు ఆగస్టు 24 నుంచి ప్రారంభం కానున్నాయి. మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ వేరియంట్ సేల్స్ ఆగస్టు 27 నుంచి ప్రారంభం అవుతాయని సంస్థ గతంలో ప్రకటించింది. అయితే భారతదేశంలో ఎడ్జ్ 20 మోడల్ సేల్స్ ఇప్పట్లో ప్రారంభం కావని మోటరోలా తాజాగా ప్రకటించింది. సేల్స్ ప్రారంభమయ్యే తేదీని త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది. అయితే ఇప్పటికిప్పుడు అమ్మకాలను ఎందుకు వాయిదా వేశారనే వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
భారతదేశంలో మోటరోలా ఎడ్జ్ 20 అమ్మకాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మోటరోలా ప్రకటించింది. ముందుగా ప్రకటించినట్లు ఆగస్టు 24న సేల్స్ ప్రారంభం కావని స్పష్టం చేసింది. అయితే ఆగస్టు 24 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఎడ్జ్ 20 మోడల్ ప్రీ-ఆర్డర్స్ ప్రారంభమవుతాయని, విక్రయ తేదీని త్వరలో ప్రకటిస్తామని సంస్థ వెల్లడించింది. మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు మాత్రం ముందుగా ప్రకటించినట్లు ఆగస్టు 27న మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్, ప్రధాన రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలుకు ఈ మోడల్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.
ఎడ్జ్ 20, ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్ఫోన్లకు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించిందని, కానీ అనుకోని పరిస్థితుల కారణంగా ఎడ్జ్ 20 సేల్స్ ప్రారంభ తేదీని వాయిదా వేయాల్సి వచ్చిందని మోటరోలా వెల్లడించింది. మోటరోలా ఎడ్జ్ 20 స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 29,999గా నిర్దేశించింది. ఇది ఫ్రోస్టెడ్ పెర్ల్, ఫ్రోస్టెడ్ ఎమరాల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,499 కాగా.. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999గా ఉంది. ఈ ఫోన్ సైబర్ టీల్, ఎలక్ట్రిక్ గ్రాఫైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ప్రీమియం ఫీచర్లతో రూపొందించిన మోటరోలా ఎడ్జ్ 20 స్మార్ట్‌ఫోన్.. 30W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో.. 4,000mAh బ్యాటరీ సామర్థ్యంతో లభిస్తుంది. 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, USB టైప్-సి పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లతో ఈ డివైజ్ కస్టమర్ల దృష్టిని ఆకర్షించింది. అయితే దీన్ని కొనుగోలు చేయాలనుకునే వారు మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Smartphones