Microsoft: అమెరికా ఆర్మీతో మైక్రోసాఫ్ట్ భారీ ఒప్పందం.. సైనికులకు ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్‌సెట్లు.. ప్రత్యేకతలు తెలిస్తే షాకవుతారు..

ప్రతీకాత్మక చిత్రం

ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అమెరికన్ ఆర్మీతో భారీ ఒప్పందం చేసుకుంది. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సంస్థ యూఎస్ ఆర్మీకి ఆగుమెంటెడ్ రియాలిటీ హెడ్‌సెట్‌లను విక్రయించనుంది. ఈ ఒప్పందం విలువ సుమారు 22 బిలియన్ డాలర్లు.

  • Share this:
గత కొన్ని సంవత్సరాలుగా వివిధ దేశాల రక్షణ బడ్జెట్‌ క్రమంగా పెరుగుతోంది. ప్రపంచ దేశాలు సైనిక వ్యవస్థను బలోపేతం చేసుకునే పనిలో ఉన్నాయి. ఇందుకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. తాజాగా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అమెరికన్ ఆర్మీతో భారీ ఒప్పందం చేసుకుంది. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సంస్థ యూఎస్ ఆర్మీకి ఆగుమెంటెడ్ రియాలిటీ హెడ్‌సెట్‌లను అమ్మనుంది. ఈ ఒప్పందం విలువ సుమారు 22 బిలియన్ డాలర్లు కావడం విశేషం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మైక్రోసాఫ్ట్ బుధవారం ప్రకటించింది. వీడియో గేమ్స్‌, వినోద పరిశ్రమలో ఉపయోగించే మైక్రోసాఫ్ట్ హోలోలెన్స్ ప్రొడక్ట్, అజూర్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ సాయంతో ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్‌సెట్లను మైక్రోసాఫ్ట్ రూపొందించనుంది. ఈ ఒప్పందం ద్వారా వచ్చే పదేళ్లలో మొత్తం 21.88 బిలియన్ అమెరికన్ డాలర్లను మైక్రోసాప్ట్‌ అర్జించనుంది. ఆర్మీ క్లోజ్ కంబాట్ ఫోర్స్‌లోని 1,20,000 సైనికులకు ఇంటిగ్రేటెడ్ విజువల్ ఆగ్మెంటెడ్ సిస్టమ్ హెడ్‌సెట్లను కంపెనీ అందించనుంది.

మైక్రోసాఫ్ట్ టెక్నికల్ విభాగానికి చెందిన అధికారి అలెక్స్ కిప్ మన్ ఒప్పందం గురించి ఒక బ్లాగ్‌పోస్ట్‌లో వివరించారు. రెస్క్యూ ఆపరేషన్లలో, శత్రువులతో పోరాడే సందర్భంలో సైనికులకు అందుబాటులో ఉన్న సమాచారంతో, సందర్భానికి తగ్గట్టు మెరుగైన నిర్ణయం తీసుకునేందుకు మైక్రోసాఫ్ట్ ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్‌సెట్‌ ఉపయోగపడుతుందని చెప్పారు. నిర్ణీత సందర్భం గురించి అవగాహన పెంచేందుకు, సమాచార మార్పిడికి వీలు కల్పిస్తూ.. సందర్భానుసారం నిర్ణయం తీసుకునేందుకు ఈ హెడ్‌సెట్‌లను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. డ్రోన్లతో చిత్రీకరించే లైవ్ ఫుటేజీని సైనికులు వీటి ద్వారా చూస్తూ ఎలా ముందుకెళ్లాలో నిర్ణయించుకోవచ్చు. వీటిని అమెరికాలోనే తయారు చేస్తామని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

ఆర్మీతో ఇతర ఒప్పందాలు
గత రెండు సంవత్సరాలుగా మైక్రోసాఫ్ట్ సంస్థ ఇంటిగ్రేటెడ్ విజువల్ ఆగ్మెంటేషన్ సిస్టమ్ (IVAS) ప్రోటోటైపింగ్ ఫేజ్‌ కోసం అమెరికన్ ఆర్మీతో కలిసి పనిచేస్తోంది. అమెరికా సైనికులకు స్మార్ట్ లెన్స్ టెక్నాలజీని అందించేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టారు. అమెరికా రక్షణ శాఖతో 10 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన మరో ఒప్పందం కోసం కూడా మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు చేస్తోంది. పెంటగాన్‌తో JEDI క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని గెలుచుకునే ప్రయత్నాల్లో ఆ సంస్థ ఉంది. కానీ దీనిపై అమెజాన్ సంస్థ ఫెడరల్ కోర్టులో దావా వేసింది. కోర్టులో ఈ వివాదం కొనసాగితే ఒప్పందాన్ని పక్కన పెట్టే అవకాశం ఉందని రక్షణ శాఖ ఉన్నతాధికారులు అమెరికా చట్టసభలకు తెలిపారు. వివాదం తేలితేనే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఒప్పందాలపై వివాదాలు
మైక్రోసాఫ్ట్ 2018లో అమెరికన్ ఆర్మీతో చేసుకున్న ఒక ఒప్పందంపై వివాదం చెలరేగింది. అప్పట్లో ఆర్మీకి ప్రోటోటైప్స్‌ సరఫరా చేయడానికి 480 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం చేసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. కానీ దీనిపై 94 మంది ఉద్యోగులు అక్కడి కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేశారు. ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు ఆయుధాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడాన్ని ఆపాలని కంపెనీకి విజ్ఞప్తి చేశారు. యుద్ధ రంగాన్ని వీడియో గేమ్స్‌ మాదిరిగా మారిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని వీరు ఆరోపించారు.
Published by:Nikhil Kumar S
First published: