బుధవారం నాడు ( 25 జనవరి) ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవలకు (Microsoft Services) అంతరాయం ఏర్పడింది. దీనివల్ల మైక్రోసాఫ్ట్ సర్వీసులపై ఆధారపడే అనేక రకాల సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. బుధవారం భారతదేశంలో చాలా మంది వ్యక్తులు మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్‌ను ఉపయోగించలేకపోయారు. ఆస్ట్రేలియా, బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కూడా ఇలాంటి సమస్యలే తలెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా యూజర్లు తాము ఔట్‌లుక్ (Outlook), టీమ్స్ (Teams), మైక్రోసాఫ్ట్ 365 (Microsoft 365), Azure వంటి అనేక Microsoft సేవలను యాక్సెస్ చేయలేకపోయామని నివేదించారు. ఈ నేపథ్యంలో 'మైక్రోసాఫ్ట్ 365 స్టేటస్' ట్విట్టర్ పేజీ ఈ సమస్యపై స్పందించింది.
ప్రపంచవ్యాప్తంగా తమ సేవలకు అంతరాయం కలుగుతున్నాయని గుర్తించినట్లు వరుస ట్వీట్ల ద్వారా మైక్రోసాఫ్ట్ ట్విట్టర్ పేజీ పేర్కొంది. ఈ అంతరాయానికి కారణమైన సమస్యను ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు తెలిపింది. తమ నెట్‌వర్క్‌లోని సమస్య వల్ల ఇలా జరిగి ఉండవచ్చని పేర్కొంది.
దానిని ఎలా పరిష్కరించాలో తెలుసుకోవడానికి డేటాను చెక్ చేస్తోంది. అలానే సమస్యను పరిష్కరించడానికి తన నెట్‌వర్క్‌లో కొన్ని మార్పులు కూడా చేసింది. ప్రస్తుతం ఇది పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. అంటే ఇంకా ఈ సమస్య సాల్వ్ కాలేదు. ఇది ఎప్పుడు సాల్వ్ అవుతుందో మైక్రోసాఫ్ట్ సంస్థ కచ్చితంగా క్లారిటీ ఇవ్వలేదు.
ప్రపంచవ్యాప్తంగా సేవలు అంతరాయం కలిగించి ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఏంటనేది మైక్రోసాఫ్ట్ వెల్లడించలేదు. అయితే దీనిని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి మైక్రోసాఫ్ట్ టీమ్ తన వంతు కృషి చేస్తోంది. కాగా పాపులర్ వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ సేవలలో అంతరాయాలు, ఇతర సమస్యలు రిపోర్ట్ చేసే DownDetector.com వెబ్‌సైట్ మైక్రోసాఫ్ట్ యూజర్ల ఫిర్యాదులను తాజాగా బయట పెట్టింది. ఈ వెబ్‌సైట్‌లో ఇండియా నుంచి మైక్రోసాఫ్ట్ సేవల అంతరాయానికి సంబంధించి 3,700 ఫిర్యాదులు నమోదయ్యాయి.
భారతదేశంలోని చాలా మంది వ్యక్తులు మైక్రోసాఫ్ట్ టీమ్‌లను ఉపయోగించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు చేశారు. ప్రభావిత నగరాలలో ఢిల్లీ , ముంబై, హైదరాబాద్ , బెంగళూరు, చెన్నై ఉన్నాయి. 63% మంది వినియోగదారులు యాప్‌లో సమస్యలను నివేదించారు. 26% మంది సర్వర్ కనెక్షన్‌తో సమస్యలు ఉన్నట్లు తెలిపారు. 11% మంది వెబ్‌సైట్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి : వాట్సప్ ఛాట్స్‌లో కొత్త ఫీచర్... ఇలా పనిచేస్తుంది
మరోవైపు #MicrosoftTeams అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. చాలా మంది వినియోగదారులు తమ నిరాశను వ్యక్తం చేయడానికి, సమస్య గురించి మీమ్స్, జోకులను పంచుకోవడానికి ట్వీట్స్ చేస్తున్నారు. ఒక యూజర్ ట్వీట్ చేస్తూ, "ఈరోజు #MSTeamsకి ఏమైంది?" అన్నారు. మరొకరు "ఉద్యోగులకు ఆఫీసులో బాగా రెస్ట్ దొరికింది. వారందరూ పండగ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. #MicrosoftTeams పని చేయడం లేదు." అని ట్వీట్ చేశారు.
అంతరాయం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నా, కొంతమంది నెటిజన్లు పరిస్థితిపై జోకులు పేల్చారు. "#MicrosoftTeams అంతరాయానికి ధన్యవాదాలు. మీరు దీన్ని రెండు రోజులు పరిష్కరించరని ఆశిస్తున్నా. ఇప్పుడు మంచి బ్రేక్ కావాలనిపిస్తోంది." అని ఒక సరదాగా వ్యాఖ్యనించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Microsoft, Tech news, Technology