• Home
  • »
  • News
  • »
  • technology
  • »
  • MICRO SOFT TO SUSPEND INTERNET EXPLORER SERVICES AS IT IS PUSHING MICRO SOFT EDGE GH SK

Internet Explorer: ఇంటర్నెట్ వాడే వారికి ముఖ్య గమనిక.. త్వరలో ఆ సేవలు బంద్..

ప్రతీకాత్మక చిత్రం

ఎక్స్‌ప్లోరర్ స్థానంలో ఎడ్జ్ బ్రౌజర్‌ను మైక్రోసాఫ్ట్ తీసుకువచ్చింది. గూగుల్ క్రోమ్‌కు పోటీగా, ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లతో ఎడ్జ్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఉన్న మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ను ఎక్స్‌ప్లోరర్‌కు బదులుగా వాడుకోవచ్చని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

  • Share this:
తొలితరం వెబ్ బ్రౌజర్లలో అత్యంత విజయవంతమైన ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ సేవలను ఆపేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ బ్రౌజర్ వచ్చే ఏడాది సేవల నుంచి పూర్తిగా వైదొలగనుంది. సుమారు 25 సంవత్సరాల పాటు కోట్ల మంది వినియోగదారుల అవసరాలను ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ తీర్చింది. విండోస్ 95తో విడుదల చేసిన ఈ బ్రౌజర్, వచ్చే ఏడాది రిటైర్ అవుతుందని టెక్ దిగ్గజం ప్రకటించింది. 2022 జూన్ తరువాత విండోస్ 10 కన్స్యూమర్స్ వెర్షన్‌లో ఎక్స్‌ప్లోరర్ కనిపించదని సంస్థ తెలిపింది. ఈ బ్రౌజర్‌ను మైక్రోసాఫ్ట్ దశలవారీగా తొలగిస్తోంది. ఒకవేళ ఇంటర్నెట్‌లో ఎక్స్‌ప్లోరర్ గురించి సెర్చ్ చేసినా, దాని స్థానంలో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన ఎడ్జ్ బ్రౌజర్ కనిపించేలా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది నుంచి సేవలను పూర్తిగా నిలిపేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

ప్రస్తుతం వాడుతున్న బ్రౌజర్లు అందుబాటులోకి రాకముందు, ఎక్కువ మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను వాడేవారు. 2000- 2005 మధ్య ఈ బ్రౌజర్‌కు 90 శాతం మార్కెట్ వాటా ఉండటం విశేషం. కానీ తరువాతి కాలంలో ఎక్స్‌ప్లోరర్‌కు ఆదరణ తగ్గింది. పోటీ సంస్థల ప్రభావంతో దీని మార్కెట్ వాటా సైతం పడిపోయింది. దీనికి తోడు 2013లో మైక్రోసాఫ్ట్ తన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇతర బ్రౌజర్‌లను ప్రమోట్ చేయడంలో విఫలమైనందుకు 561 మిలియన్ల యూరోల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. అనంతరం 2019లో భద్రతా కారణాల దృష్ట్యా దీనికి ఎమర్జెన్సీ ప్యాచ్ జారీ చేయాల్సి వచ్చింది. అప్పటికి సుమారు ఎనిమిది శాతం మంది ప్రజలు దీన్ని ఉపయోగిస్తున్నారని అంచనా. ఇలాంటి పరిణామాలతో ఎక్స్‌ప్లోరర్ మార్కెట్ వాటా మరింత తక్కువకు పడిపోయింది.

ఈ క్రమంలో ఎక్స్‌ప్లోరర్ స్థానంలో ఎడ్జ్ బ్రౌజర్‌ను మైక్రోసాఫ్ట్ తీసుకువచ్చింది. గూగుల్ క్రోమ్‌కు పోటీగా, ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లతో ఎడ్జ్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఉన్న మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ను ఎక్స్‌ప్లోరర్‌కు బదులుగా వాడుకోవచ్చని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. దీంట్లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ మోడ్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. వచ్చే ఏడాది జూన్ 15 నుంచి విండోస్‌కు చెందిన కొన్ని వెర్షన్‌లలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సేవలు అందుబాటులో ఉండవని ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఎక్స్‌ప్లోరర్ ఆధారంగా పనిచేసే కొన్ని రకాల వెబ్‌సైట్లు, యాప్స్ వంటివి.. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ సాయంతో పనిచేస్తాయని పేర్కొంది.
Published by:Shiva Kumar Addula
First published: