MEITY SEEKS UIDAI OPINION ON AADHAAR SOCIAL MEDIA LINKING BS
Aadhar Link : సోషల్ మీడియాతో ఆధార్ లింక్.. యూఐడీఏఐకి కేంద్రం లేఖ..
ప్రతీకాత్మక చిత్రం
Aadhar Link: ఆధార్‌తో అనుసంధానం చేయడంపై తమ అభిప్రాయం చెప్పాలని యూఐడీఏఐని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కోరింది. ఈ మేరకు యూఐడీఏఐకి లేఖ రాసినట్లు ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
బ్యాంకు ఖాతా, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఇతర ప్రభుత్వ పథకాలు.. ఇలా అన్నింటికీ ఆధార్ కార్డును అనుసంధానం చేసేస్తున్నారు. పథకాలు లబ్ధిదారులకే అందేలా ప్రభుత్వం ఆధార్‌ను లింక్ చేస్తోంది. అసాంఘిక శక్తులను పారదోలడానికి కూడా దీన్ని ఉపయోగిస్తోంది. తాజాగా, సోషల్ మీడియాను ఆధార్‌తో లింక్ చేసే విషయంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే. అయితే, ఆధార్‌తో అనుసంధానం చేయడంపై తమ అభిప్రాయం చెప్పాలని యూఐడీఏఐని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కోరింది. ఈ మేరకు యూఐడీఏఐకి లేఖ రాసినట్లు ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సోషల్ మీడియా ఖాతాలతో ఆధార్ నంబరును అనుసంధానించడానికి సంబంధించిన ఒక పిటిషన్‌పై సుప్రీంకోర్టు గత నెలలో కేంద్రానికి నోటీసులు ఇచ్చింది.
ప్రతీకాత్మక చిత్రం
వాస్తవానికి.. అసాంఘిక చర్యలకు, అశ్లీల కంటెంట్‌కు అడ్డుకట్ట వేసేందుకు సోషల్ మీడియా అకౌంట్లను ఆధార్‌తో లింక్ చేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఫేస్బుక్ సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది. ఇవే డిమాండ్లతో మద్రాస్, బాంబే, మధ్యప్రదేశ్ హై కోర్టుల్లో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటినీ విచారించాలంటూ ఫేస్బుక్ కోరింది. తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలు యూజర్ల ప్రైవసీకి భంగం కలిగిస్తాయంటూ ఫేస్బుక్ వాదిస్తోంది. అయితే ఓ మెసేజ్ ఎవరు పోస్ట్ చేశారో తెలుసుకునేందుకు సోషల్ మీడియా అకౌంట్లను ఆధార్‌తో లింక్ చేయడం అవసరం అని, ప్రొఫైల్స్ ట్రాక్ చేయడం సులువు అవుతుందన్నది పిటిషనర్లు వాదిస్తున్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు భారత ప్రభుత్వానికి, తమిళనాడు పోలీసులకు, గూగుల్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 13 లోగా అభిప్రాయాలు తెలపాలని ఆదేశించింది.
అయితే, దీనిపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఐటీ శాఖ అధికారి తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు పొందే వారి బ్యాంకు ఖాతాలకు మాత్రమే ఆధార్‌ను అనుసంధానించే అవకాశం ఉన్నందున కొత్తగా సోషల్ మీడియా ఖాతాలకు లింక్ చేయడం కష్టమని వెల్లడించారు. ఆధార్ చట్ట ప్రకారం భారత సంచిత నిధితో సంబంధం లేని విషయాలతో ఆధార్ నంబరును అనుసంధానించడం కుదరదని ఆయన స్పష్టం చేశారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.