ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మంగళ్‌యాన్ మిషన్ కథ ముగిసింది. ఇస్రో అంగారక గ్రహంపై అధ్యయనం కోసం మంగళ్‌యాన్ (Mangalyaan) అనే మార్స్ ఆర్బిటర్ క్రాఫ్ట్‌ను(Orbital Craft) ఎనిమిదేళ్ల కిందట పంపించింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్ మిషన్‌కి మంగళ్‌యాన్ మిషన్‌గా పేరు పెట్టింది. అయితే ఇటీవలే ఈ మార్స్ ఆర్బిటర్ స్పేస్‌క్రాఫ్ట్‌లోని ఫ్యూయల్ పూర్తిగా అయిపోయింది. దీని బ్యాటరీ ప్రమాదకరమైన స్థాయిలో క్షీణించింది. ఈ క్రాఫ్ట్ గ్రౌండ్(Ground) స్టేషన్‌తో కమ్యూనికేషన్‌ను(Communication) కూడా కోల్పోయింది. దీంతో ప్రస్తుతం దీనిని రికవర్ చేయడం కుదరదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అక్టోబర్ 3న అధికారిక ప్రకటన చేసింది. ఫలితంగా మంగళ్‌యాన్ మార్స్ మిషన్ సుదీర్ఘ ప్రస్థానానికి ఎండ్ కార్డు పడింది.
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మంగళ్‌యాన్ అంతరిక్ష నౌక సెప్టెంబర్ 24, 2014 నుంచి అంగారకుడి చుట్టూ తిరగడం ప్రారంభించింది. నిజానికి దీనిని ఒక టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్‌గా, కేవలం ఆరు నెలల పని చేసేలా అభివృద్ధి చేశారు. కానీ అది 8 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పని చేసి అద్భుతమైన సేవలను అందించింది. మంగళ్‌యాన్ ఈ ఎనిమిదేళ్ల కాలంలో అంగారక గ్రహంపై ఉపరితల భూగర్భ శాస్త్రం, మార్ఫాలజీ, వాతావరణ ప్రక్రియలు, ఉపరితల ఉష్ణోగ్రత వంటి వివిధ రకాల అంశాలపై అధ్యయనానికి ఎంతగానో దోహదపడింది. ఏప్రిల్ 2022లో సుదీర్ఘ గ్రహణం కారణంగా గ్రౌండ్ స్టేషన్‌తో కమ్యూనికేషన్‌ను మంగళ్‌యాన్ కోల్పోయినట్లు ఇస్రో తెలిపింది.
ఈ మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది?
ఇస్రో 'మంగళ్‌యాన్' అని పిలిచే మార్స్ ఆర్బిటర్ మిషన్ (MOM)ని 5 నవంబర్ 2013న ప్రయోగించింది. ఈ మిషన్‌లో ప్రయోగించిన మంగళ్‌యాన్ వ్యోమనౌక 300 రోజుల గ్రహాంతర ప్రయాణాన్ని పూర్తి చేసి సెప్టెంబర్ 24, 2014న అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించింది. అయితే సెప్టెంబర్ 24న మార్స్ ఆర్బిటర్ మిషన్ (MOM) అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇస్రో సెలబ్రేషన్స్ చేసుకుంది. ఆన్‌బోర్డ్‌లో ఐదు సైంటిఫిక్ పేలోడ్‌లతో తయారుచేసిన మంగళ్‌యాన్ ఎనిమిది సంవత్సరాలలో సోలార్ కరోనాతో పాటు అంగారక ఎక్సోస్పియర్‌పై గొప్ప శాస్త్రీయ అవగాహనను అందించిందని ఇస్రో తాజాగా వెల్లడించింది.
ముగిసిన మంగళ్‌యాన్ సేవలు
మంగళ్‌యాన్ వ్యోమనౌక ప్రొపెల్లెంట్ అయిపోయిందని, దీనివల్ల నిరంతర విద్యుత్ ఉత్పత్తికి కావలసిన ఆల్టిట్యూడ్ పాయింటింగ్‌ను సాధించలేమని ఇస్రో పేర్కొంది. ఇప్పుడు వ్యోమనౌకను తిరిగి పొందలేమని, అది దాని జీవితాంతానికి చేరుకుందని ప్రకటించింది. ఈ మిషన్‌తో మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని విజయవంతంగా చేరుకున్న దేశంగా భారత్ నిలిచింది. ఈ అంతరిక్ష నౌకను ప్రయోగించడంతో ఇండియా రష్యా ROSCOSMOS, యునైటెడ్ స్టేట్స్ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్న నాలుగవ దేశంగా అవతరించింది. 2013కి ముందు మరే ఇతర ఆసియా దేశం ఈ గ్రహాన్ని చేరుకోనందున, భారతదేశం ఈ ప్రయోగంలో మొదటి ఆసియా దేశంగా అవతరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, Mars, Science and technology, Technology