సాధారణంగా మనం గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్నప్పుడు చాలా ఎక్కువ మందికి ఉండే కొన్ని కంప్లైట్స్ గురించి చెప్పాలంటే మొత్తం ఇనుముతో తయారుచేయడం వల్ల దాన్ని పెట్టడం వల్ల ఫ్లోర్ పై తుప్పు మరకలు పడడం ఒకటైతే.. సిలిండర్ అయిపోయే ముందు తెలియకపోవడం కూడా చాలామంది ఎదుర్కొనే సమస్యే.. ఇలాంటి సమస్యలన్నింటి నుంచి మిమ్మల్ని బయట పడేసేందుకే స్మార్ట్ ఎల్పీజీ సిలిండర్స్ వచ్చేస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం రండి. .
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ఓ సరికొత్త బ్రాండ్ ఎల్పీజీ సిలిండర్లను తయారుచేసింది. కంపోజిట్ సిలిండర్ అని పిలిచే ఈ సిలిండర్లు మామూలు వాటి కంటే చాలా తేలిగ్గా ఉంటూ మరెన్నో కొత్త ఫీచర్లను కలిగి ఉంటాయి. వీటితో సిలిండర్ అయిపోయే ముందే మీరు తెలుసుకోవచ్చు కాబట్టి రీఫిల్ కూడా బుక్ చేసుకోవచ్చు. సంప్రదాయబద్ధమైన ఐరన్ సిలిండర్ల నుంచి విముక్తి కలిగించనున్నాయి.
కంపోజిట్ సిలిండర్ అంటే ట్రిపుల్ లేయర్డ్ సిలిండర్ అని చెప్పుకోవచ్చు. దీనిలో మొదటి లేయర్ గా హై డెన్సిటీ పాలీ ఇథిలిన్ (హెచ్డీపీఈ) లైనింగ్ ఉంటుంది. దానిపైన రెండో లేయర్ గా పాలిమర్ ర్యాప్ చేసిన ఫైబర్ గ్లాస్, మూడో లేయర్ గా హెచ్ డీపీఈ అవుటర్ జాకెట్ ఉంటుంది. ఐరన్ సిలిండర్ తో పోల్చితే ఇది చాలా తక్కువ బరువుతో ఉంటుంది. దాని బరువులో సగం మాత్రమే ఉంటుంది. అంతేకాదు.. ఈ సిలిండర్ చూసేందుకు కూడా ట్రాన్స్ పరెంట్ గా ఉంటుంది. దీంతో కాస్త లైట్ దగ్గర పెడితే చాలు.. గ్యాస్ ఎక్కడి వరకు ఉందన్న విషయం సులువుగా తెలుసుకోవచ్చు. దీనివల్ల కస్టమర్లు తమ గ్యాస్ ఎన్ని రోజుల పాటు కొనసాగుతుందన్న విషయం తెలుసుకోవచ్చు. తర్వాత రీఫిల్ ఎప్పుడు బుక్ చేసుకోవాలో కూడా తెలుసుకోవచ్చు. హెచ్డీపీఈ తో తయారుచేయడం వల్ల ఈ సిలిండర్ వల్ల తుప్పు మరకలు అస్సలు ఉండవు. చాలా స్లీక్ డిజైన్ తో చక్కగా ఉంటుంది. ఈ సిలిండర్ ప్రస్తుతానికి హైదరాబాద్ తో పాటు దిల్లీ, గుర్గావ్, ఫరీదాబాద్, లుథియానా ల్లో మాత్రమే అందుబాటులో ఉంచింది ఐఓసీఎల్ సంస్థ. కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులో ఉంచుతామని ఆ సంస్థ వెల్లడించింది. ఇవి ప్రస్తుతం 5,10 కేజీల సైజుల్లో లభిస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న సిలిండర్లను ఇచ్చి ఈ సిలిండర్లను తీసుకునే వీలుంది. అయితే దీనికోసం కొంత సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది. సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్లకు రూ. 3350 (10కేజీలు), రూ,2150(5 కేజీలు) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీ ఉండే ఫ్రీ ట్రేడ్ కేటగిరీలో ప్రస్తుతం ఐదు కేజీల సిలిండర్ మాత్రమే అందుబాటులో ఉంది. జీఎస్టీతో కలిపి ఈ సిలిండర్ ని రూ. 2537 తీసుకోవచ్చు. రీఫిల్ ధర లొకేషన్ ని బట్టి మారుతూ ఉంటుంది. 10, 5 రెండు కేటగిరీలు ఇంటికే డెలివర్ అవుతాయని సంస్థ వెల్లడించింది.
ఇది కూడా చూడండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending