• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • LG CONFIRMED MOVING OUT OF THE SMARTPHONE BUSINESS AFTER THE DECISION WAS FINALLY APPROVED BY ITS BOARD OF DIRECTORS SSR

LG: బాంబు పేల్చిన ఎల్‌జీ.. ఇలాంటి ప్రకటన ఎల్‌జీ చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు..!

LG: బాంబు పేల్చిన ఎల్‌జీ.. ఇలాంటి ప్రకటన ఎల్‌జీ చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు..!

ప్రతీకాత్మక చిత్రం

గత ఆరేళ్ల నుంచి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎల్‌జీ ఘోర నష్టాలను చవిచూసింది. దాదాపు రూ. 33,010 కోట్ల నష్టాలను చవిచూసినట్లు తెలిసింది. మొబైల్ ఫోన్ల బిజినెస్ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించిన ఎల్‌జీ ఇతర ఎలక్ట్రిక్ ఉత్పత్తుల తయారీపై మరింతగా దృష్టి సారించనున్నట్లు...

  • Share this:
    దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ కీలక ప్రకటన చేసింది. స్మార్ట్ ఫోన్ల వ్యాపారానికి స్వస్తి పలుకుతున్నట్లు ఎల్‌జీ ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకున్న తొలి అతిపెద్ద సంస్థ ఎల్‌జీనే కావడం గమనార్హం. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో నష్టాలను చవిచూడటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ దక్షిణ కొరియా సంస్థ తెలిపింది. ఉత్తర అమెరికా‌లో ఇప్పటికీ ఎల్‌జీనే మూడో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా ఉండటం విశేషం. దక్షిణ కొరియాలోనూ ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్లకు మంచి ఆదరణే ఉంది. అయినప్పటికీ బడ్జెట్ ఫోన్ల మార్కెట్‌లో ఎల్‌జీ అంతగా ఆకట్టుకోలేక పోయింది. గత ఆరేళ్ల నుంచి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎల్‌జీ ఘోర నష్టాలను చవిచూసింది. దాదాపు రూ. 33,010 కోట్ల నష్టాలను చవిచూసినట్లు తెలిసింది. మొబైల్ ఫోన్ల బిజినెస్ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించిన ఎల్‌జీ ఇతర ఎలక్ట్రిక్ ఉత్పత్తుల తయారీపై మరింతగా దృష్టి సారించనున్నట్లు తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల విడి భాగాలు, స్మార్ట్ హోమ్స్, కనెక్టెడ్ డివైజెస్ వంటి రంగాలపై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని ఎల్‌జీ చెప్పుకొచ్చింది. మొబైల్ ఫోన్స్ మార్కెట్ నుంచి ఎల్‌జీ తప్పుకుంటున్నప్పటికీ సెల్ ఫోన్ రంగం సరికొత్త ఆవిష్కరణలకు అందరి కంటే ముందు ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను అందుబాటులోకి తీసుకొచ్చింది ఎల్‌జీనే కావడం విశేషం.

    2013లోనే ప్రపంచంలో శాంసంగ్, యాపిల్ కంపెనీల తర్వాత ఫోన్ల తయారీ సంస్థల్లో మూడో అతిపెద్ద సంస్థగా ఎల్‌జీ నిలిచింది. అయితే.. మొబైల్ మార్కెట్‌లో ఓ వెలుగు వెలిగిన ఎల్‌జీ రానురానూ ఆ స్థితి నుంచి పడిపోతూ వచ్చింది. ఎల్‌జీ విడుదల చేసి పలు మోడల్ ఫోన్లలో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ లోపాలు ఆ సంస్థ గుడ్‌విల్‌ను దెబ్బతీశాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కూడా ఆశించినంతలా లేకపోవడం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎల్‌జీని మరింత పతనావస్థకు చేర్చింది. స్మార్ట్‌ఫోన్లలో సాంకేతికతను మెరుగుపరచి వినియోగదారులను ఆకట్టుకోవడంలో.. చైనీస్ మొబైల్ కంపెనీలతో పోటీ పడటంలో ఎల్‌జీ పూర్తిగా చతికిలపడిందని నిపుణులు చెబుతున్నారు.

    అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎల్‌జీ షేర్ ప్రస్తుతం 2 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. గతేడాది ఎల్‌జీ నుంచి ప్రపంచవ్యాప్తంగా 23 మిలియన్ల ఫోన్లు ఉత్పత్తి కాగా, శాంసంగ్ నుంచి 256 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లు విడుదలయ్యాయి. నార్త్ అమెరికాతో పాటు లాటిన్ అమెరికాలో కూడా ఎల్‌జీ ఫోన్లకు కాస్తంత ఆదరణే ఉంది. లాటిన్ అమెరికాలో ఎల్‌జీ ఐదో స్థానంలో ఉంది.

    ఇక.. దక్షిణ అమెరికాలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చైనా కంపెనీలైన ఒప్పో, వివో, షియోమీ ముందంజలో ఉన్నాయి. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో నిలబడలేక నోకియా, హెచ్‌టీసీ, బ్లాక్‌బెర్రీ పూర్తిగా కనుమరుగయిన పరిస్థితి. నోకియా నుంచి అడపాదడపా స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నా ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. ధర విషయంలో రాజీ పడక పోవడం నోకియా స్మార్ట్‌ఫోన్లకు ఆదరణ లేకపోవడానికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే.. ఎల్‌జీ తీసుకున్న నిర్ణయం స్మార్ట్‌ఫోన్ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందనడంలో సందేహమే లేదు.
    Published by:Sambasiva Reddy
    First published: