KNOW HOW TO PREPARE FOR INTERNET SHUTDOWN AND HOW TO SURVIVE WITHOUT INTERNET SS
Internet Shutdown: సడెన్‌గా ఇంటర్నెట్ ఆగిపోతే ఏంటి పరిస్థితి? మీరేం చేయాలో తెలుసుకోండి
Internet Shutdown: సడెన్‌గా ఇంటర్నెట్ ఆగిపోతే ఏంటి పరిస్థితి? మీరేం చేయాలో తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)
Internet Shutdown | ఇంటర్నెట్ లేని రోజుల్లో ఎలా బతికారో అనిపిస్తుంది ఈతరం వాళ్లకి. ఇంటర్నెట్ ఆగిపోతే (Internet Shutdown) ఎలా అన్న సందేహాలు కూడా వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఇంటర్నెట్ లేకుండా జీవించేందుకు ప్రిపేర్ అయి ఉండాలి.
గొడవలు, అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితులు, మరే ఇతర కారణాల వల్లైనా ప్రభుత్వం ఇంటర్నెట్ (Internet) నిలిపివేస్తుంది. అల్లర్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మామూలే. మరి ఇంటర్నెట్ షట్‌డౌన్ (Internet Shutdown) జరిగితే ఏంటి పరిస్థితి? ఈ సందేహం రావడం మామూలే. స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ ఆగిపోతే ప్రపంచం ఆగిపోయినట్టవుతుంది. యాప్స్ ఉపయోగించలేరు. ట్రాన్సాక్షన్స్ చేయలేరు. అప్డేట్స్ తెలుసుకోలేరు. ఎవరికైనా ఏవైనా ముఖ్యమైన ఫైల్స్ పంపాలంటే కుదరదు. మీరు మెయిల్లో సేవ్ చేసుకున్న డాక్యుమెంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోలేరు. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో, ఎప్పుడు ఇంటర్నెట్ ఆపేస్తారో తెలియదు కాబట్టి అన్నింటికీ ఆన్‌లైన్‌పైన ఆధారపడకూడదు. లావాదేవీల కోసం మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ ఉపయోగించడం మంచిదే అయినా ఇంట్లో, పర్సులో కొంత క్యాష్ ఉండటం కూడా అవసరమే. మీరు ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అక్కడ ఇంటర్నెట్ ఆగిపోతే మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బున్నా చిక్కులు తప్పవు. అందుకే జేబులో కూడా క్యాష్ మెయింటైన్ చేయాలి.
మీ టికెట్లు, హోటల్ బుకింగ్స్, ఇతర డాక్యుమెంట్స్ స్మార్ట్‌ఫోన్‌లో స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోవాలి. లేదా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. యాప్‌లో ఉంటే ఇంటర్నెట్ పనిచేయనప్పుడు యాప్స్ ఓపెన్ చేయడం కుదరదు. లేదా ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. మీరు నివసించే ప్రాంతం లేదా మీరు వెళ్లాలనుకునే ప్రాంతానికి సంబంధించి గూగుల్ మ్యాప్స్‌లో ఆఫ్‌లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. దీని వల్ల ఇంటర్నెట్ లేకపోయినా మ్యాప్స్‌లో రూట్ చెక్ చేయడంలో ఇబ్బందులు ఉండవు.
మీరు ఏ నెట్వర్క్ ఉపయోగిస్తున్నా ఔట్‌గోయింగ్ కాల్స్ చేయడానికి బ్యాలెన్స్ తప్పనిసరి. 4జీ కనెక్టివిటీ నిలిపివేస్తే మీరు 2జీ పైన ఆధారపడాల్సి ఉంటుంది. కాల్స్ చేయడానికి మొబైల్లో బ్యాలెన్స్ ఉండాలి. ఇంట్లో మొబైల్ ఇంటర్నెట్ వాడుతున్నా వీలైతే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కూడా తీసుకోండి. మొబైల్ ఇంటర్నెట్ నిలిపివేసినప్పుడు బ్రాడ్‌బ్యాండ్ ద్వారా మీ అవసరాలు చాలా వరకు తీర్చుకోవచ్చు. ఇక ఇంట్లో ల్యాండ్‌లైన్ కనెక్షన్ ఉంటే ఫోన్ కాల్స్ చేయడానికి ఇబ్బంది ఉండదు.
మీరు లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు ఎక్కడ ఇంటర్నెట్ కనెక్టివిటీ బాగుంటుందో చెప్పడం కష్టం. మీకు బోర్ కొట్టకుండా ఉండేందుకు ముందే కొన్ని వీడియోలు, సినిమాలు, గేమ్స్, పాటలు డౌన్లోడ్ చేసిపెట్టుకోండి. జర్నీలో ఇంటర్నెట్ లేకపోయినా మీకు ఫుల్ టైంపాస్ అవుతుంది. ఇంటర్నెట్ షట్‌డౌన్ సమయంలో వీపీఎన్ యాప్ ద్వారా ఇంటర్నెట్కు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇది పనిచేస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.