Vaccine Frauds: వ్యాక్సిన్ల కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారా ? జరభద్రం.. దోచేస్తున్నారు

ప్రతీకాత్మక చిత్రం

వ్యాక్సిన్‌, వ్యాక్సినేషన్‌ ఆధారంగా సైబర్‌ దాడులు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో భారత్‌, చిలీ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయని మెకాఫె చెబుతోంది.

  • Share this:
కరోనా దేశానికి చేసిన నష్టాల జాబితా చాంతాండంత అంత ఉందనే విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. ఆ లిస్ట్‌లోకి మరో విషయాన్ని కూడా యాడ్‌ చేసుకోవాలి. అదే సైబర్‌ దాడి. కరోనాను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమని వైద్యులు, పరిశోధకులు చెబుతున్నారు. దాంతో చాలామంది ప్రజలు వ్యాక్సిన్‌ కోసం ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా చూసిన హ్యాకర్లు మాల్‌వేర్‌తో దాడి చేస్తున్నారు. అది ఎంత సమస్యాత్మకంగా మారిందంటే... ఈ తరహా దాడుల వల్ల బాధితులు ఉన్న దేశాల్లో మన దేశం టాప్‌లో నిలిచేంతగా. తాజాగా మెకాఫె ఈ వివరాలను వెల్లడించింది.

వ్యాక్సిన్‌కు సంబంధించిన సమాచారం, వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని వెతుకున్నవారిని లక్ష్యంగా చేసుకుని సైబర్‌ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయట. అలాంటి సమాచారాన్ని వెతికేవాళ్ల మొబైల్స్‌లో మాల్‌వేర్‌ను చొప్పించి డేటాను తస్కరిస్తున్నారట సైబర్‌ కేటుగాళ్లు. దీని కోసం హ్యాకర్లు, సైబర్‌ దాడులు చేసేవాళ్లు బోగస్‌ యాప్స్‌, మెసేజ్‌లు, సోషల్‌ మీడియా లింక్‌లను వాడుకుంటున్నారట. ఆ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకున్నా, మెసేజ్‌లు/సోషల్‌ మీడియాలోని లింక్స్‌ క్లిక్ చేసినా మీ మొబైల్‌/సిస్టమ్‌లోకి మాల్‌వేర్‌ వచ్చేస్తుంది. అలా చేరిన మాల్‌ వేర్‌ బ్యాగ్రౌండ్‌లో యాక్టివ్‌గా ఉండి మీ బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత వివరాలు సేకరించి హ్యాకర్లకు అందజేస్తాయి.

వ్యాక్సిన్‌, వ్యాక్సినేషన్‌ ఆధారంగా సైబర్‌ దాడులు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో భారత్‌, చిలీ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయని మెకాఫె చెబుతోంది. ఈ మేరకు ఇటీవల ఓ జాబితాను విడుదల చేసింది. వ్యాక్సినేషన్‌ వివరాలు, స్లాట్‌ వివరాలు ఇస్తామంటున్న ఫేక్‌ యాప్స్‌ను నమ్మొద్దని చాలా రోజుల నుండి ప్రభుత్వం, నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే మన దేశంలో ఇంకా ఇలాంటి పనులు చేస్తూనే ఉన్నారు, సైబర్‌ దాడులకు బాధితులు అవుతున్నారు. డిసెంబరు 2020 నాటికి దేశంలో ఇలాంటి 43 మిలియన్ల మాల్‌వేర్స్‌ను గుర్తించినట్లు మెకాఫె తెలిపింది. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలని, నమ్మకమైన యాప్స్‌, వెబ్‌సైట్స్‌లో మాత్రమే సమాచారం పొందాలని సూచిస్తున్నారు.

యాప్స్‌ విషయానికొస్తే... ప్లేస్టోర్‌ లేదా యాప్‌స్టోర్‌ నుండి మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. మెసేజ్‌లకు సంబంధించి ఏ మాత్రం డౌట్‌ ఉన్నా... ఆ లింక్‌ను క్లిక్‌ చేయకూడదు. సోషల్‌ మీడియాలో వచ్చే పోస్టులు, వార్తలను గుడ్డిగా నమ్మి ఇతరులకు ఫార్వర్డ్‌ చేయూకూడదు.
Published by:Kishore Akkaladevi
First published: