జీశాట్‌-31 ప్రయోగం సక్సెస్... మనకేంటి లాభం? ఆ శాటిలైట్ ఏం చేస్తుంది?

ISRO GSAT-31 : కొత్త సంవత్సరాన్ని విజయవంతంగా ప్రారంభించిన ఇస్రో... మరో ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్-31ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆ శాటిలైట్ విశేషాలు తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: February 6, 2019, 6:09 AM IST
జీశాట్‌-31 ప్రయోగం సక్సెస్... మనకేంటి లాభం? ఆ శాటిలైట్ ఏం చేస్తుంది?
నింగిలోకి దూసుకెళ్తున్న రాకెట్ (Image : ISRO / Twitter)
  • Share this:
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జీశాట్-31 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి చేర్చింది. దక్షిణ అమెరికాలో ఉన్న... ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు ప్రయోగ కేంద్రం నుంచీ బుధవారం తెల్లవారు జామున 2.31 గంటలకు ప్రయోగించిన భారత కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌ 31 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఏరియాన్‌ స్పేస్‌ సంస్థకు చెందిన ఏరియాన్‌ 5 రాకెట్‌ ద్వారా ఈ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపారు. జీశాట్‌ 31 ఉపగ్రహం కమ్యూనికేషన్‌ సేవల్ని మరింత సమర్థంగా అందించబోతోంది.

ఇదివరకు ఓ శాటిలైట్ తయారుచెయ్యాలంటే ఇస్రోకి కొన్నేళ్లు పట్టేది. అలాంటిది ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్ వేగంతో శాటిలైట్లు రూపొందిస్తున్నారు. ఇస్రో తయారుచేసిన శాటిలైట్లలో ఇదో ప్రత్యేకమైనదని చెప్పొచ్చు. ఎందుకంటే... ఇది ఏకంగా 15 ఏళ్లపాటూ సేవలు అందించబోతోంది. భూమికి సమాచారాన్ని అందించేందుకు కీలక వ్యవస్థ అయిన జియోస్టేషనరీ కక్ష్యా మార్గంలో ఉన్న క్యూ బ్యాండ్‌ను ఈ శాటిలైట్ ద్వారా మరింత శక్తిమంతంగా మార్చబోతున్నారు.2,535 కేజీల బరువున్న ఈ శాటిలైట్‌ మన దేశానికి మాత్రమే కాదు... దేశం చుట్టుపక్కల ఉన్న దీవులకు కూడా సిగ్నల్స్ అందిస్తుంది. వీశాట్ నెట్‌వ‌ర్క్స్‌, టెలివిజ‌న్ అప్‌లింక్స్‌, డిజిట‌ల్ శాటిలైట్‌, డీటీహెచ్ టెలివిజ‌న్ స‌ర్వీస్, సెల్యూలార్ క‌నెక్టివిటీ వంటి అనేక ప్రయోజనాల కోసం జీశాట్ 31ను ఉపయోగించారు. ఇస్రో ప్రయోగించే ఈ 40వ శాటిలైట్ ద్వారా టీడీహెచ్ సర్వీసులు మరింత సమర్థంగా పనిచేస్తాయి. సమాచార ప్రసారం ఎలాంటి ఆటంకాలూ రాకుండా జరిపేందుకు వీలవుతుంది. ఎక్కడో విసిరేసినట్లు ఉండే దీవులకు కూడా డీటీహెచ్ సహా అనేక సర్వీసులు అందించేందుకు కుదురుతుంది. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహా సముద్రాలపై వైడ్ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్‌ను ఏర్పాటు చెయ్యడం వల్ల ఇది సాధ్యమవుతోందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.


ఇది సక్సెస్ కావడంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన సైంటిస్టులు... మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. అలాగే చంద్రుడి చెంతకు పంపే ఉపగ్రహం చంద్రయాన్ టు ప్రయోగ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి.

 

Photos: హీరోయిన్ సమంత లేటెస్ట్ ఫోటోస్
First published: February 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...