భారత మొబైల్ మార్కెట్లో గూగుల్ (Google), యాపిల్ (Apple) ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ ఫారెన్ కంపెనీలు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూనే ఒక్కోసారి అనైతిక వ్యాపార పద్ధతులను అనుసరిస్తున్నాయి. వీటి వల్ల చాలామంది ఇండియన్ యూజర్లు ఎఫెక్ట్ అవుతున్నారు. దీనికి పరిష్కారంగా భారత ప్రభుత్వం (Indian Government) ఇండ్‌ఓఎస్ (IndOS) అనే కొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించడానికి కసరత్తులు మొదలెట్టింది. గతంలో టెక్ దిగ్గజం గూగుల్ ఇండియాలో తన ఆధిపత్య మార్కెట్ స్థానాన్ని ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ విధానం ద్వారా దుర్వినియోగం చేసింది. అందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI), గూగుల్‌కు భారీగా పెనాల్టీ కూడా విధించింది. ఆ తర్వాత గూగుల్‌కు పోటీగా ఇండియా సొంత ఓఎస్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
భారతీయ మొబైల్ ఫోన్ మార్కెట్ భవిష్యత్తులో చాలా ఆదాయాన్ని ఆర్జిస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. కాగా ప్రస్తుతం ఇండియన్ మొబైల్ మార్కెట్లో గూగుల్ ఆండ్రాయిడ్ , యాపిల్ iOSలకే భారీ వాటా ఉంది. అయితే ఇండియన్ మొబైల్ మార్కెట్లో గూగుల్, యాపిల్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం IndOS అనే కొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించనుంది.
సెక్యూర్ ఇండియన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించడమే లక్ష్యంగా IndOS ప్రాజెక్టుపై ప్రభుత్వం పని చేస్తోంది. ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి బిజినెస్ స్టాండర్డ్‌తో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. IndOS ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం, స్టార్టప్‌లు, విద్యాసంస్థలు కలిసి అభివృద్ధి చేస్తున్నాయి.
* గూగుల్‌కు చెక్
ప్రత్యర్థులపై అన్యాయంగా ప్రయోజనాలు సాధించే విధంగా, వినియోగదారులకు హాని కలిగించే రీతిలో గూగుల్ వ్యాపార పద్ధతులను అవలంబించిందన్న కారణంతో భారత ప్రభుత్వం ప్రస్తుతం ఈ టెక్ దిగ్గజంపై ఒక కన్నేసింది. కొంతకాలం క్రితం CCI ఆండ్రాయిడ్‌లో దాని ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు గూగుల్‌కు 161 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.
స్మార్ట్‌ఫోన్ తయారీదారుల కోసం ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్‌లపై పరిమితులను మార్చాలని ఆదేశించింది. దాంతో గూగుల్ గూగుల్ తప్పనిసరిగా కాంట్రాక్టులను సవరించాల్సి వస్తోంది. అలాగే కొత్త లైసెన్స్ అగ్రిమెంట్స్ ప్రవేశపెట్టి, 1,100 కంటే ఎక్కువ ఫోన్ల తయారీదారులు, వేలాది యాప్ డెవలపర్‌లతో తన ప్రస్తుత అరేంజ్‌మెంట్లు మార్చాల్సి వస్తోంది.
మరోవైపు మొబైల్ ప్లాట్‌ఫామ్ కోసం కంపెనీ తన మార్కెటింగ్ పద్ధతులను మార్చుకోవాల్సిన యాంటీట్రస్ట్ ఆర్డర్ కారణంగా భారతదేశంలో తన ఆండ్రాయిడ్ ఎకోసిస్టమ్ వృద్ధి నిలిచిపోవచ్చని గూగుల్ నివేదించింది. మొత్తంగా చూసుకుంటే విదేశీ సాంకేతికతపై మన దేశం ఆధారపడటాన్ని తగ్గించడానికి, మొబైల్ డివైజ్‌ల కోసం డొమెస్టిక్ ఎకో సిస్టమ్‌ను సృష్టించడమే లక్ష్యంగా మోదీ సర్కార్ అడుగులు వేస్తూ ఉందని చెప్పవచ్చు. అలాగే, వినియోగదారు డేటా భద్రతను పెంచడం, స్థానిక యాప్ డెవలపర్‌ల కోసం ప్లాట్‌ఫామ్‌ను అందించడం లక్ష్యంగా పెట్టుకుందని అర్థం చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Apple, Central governmennt, Google, India, Tech news