ప్రస్తుతం వివిధ కంపెనీల ఫోన్లకు (Smartphones) ప్రత్యేక ఛార్జర్‌ను వినియోగించాల్సి ఉంటుంది. సాధారణంగా మొబైల్స్ పోర్ట్‌లు అన్నింటికీ ఒకేలా ఉండవు. దీంతో ఒక ఛార్జర్‌ను మరో ఫోన్‌కు వినియోగించలేని పరిస్థితి. ఫలితంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పెరగడానికి కూడా ఇది కారణమవుతోంది. ఈ సమస్యలను దూరం చేసేందుకు వివిధ దేశాలు కామన్ పోర్ట్ తీసుకురావాలని చెబుతున్నాయి. తాజాగా భారత్ కూడా కామన్ ఛార్జింగ్ పోర్ట్‌పై ఒక నిర్ణయానికి వచ్చింది. స్టాండర్డ్ ఛార్జర్లు వచ్చిన తర్వాత.. ఫోన్-తయారీదారులు యూజర్లకు బాక్స్‌లో ఛార్జర్లను రవాణా చేయనవసరం లేదు. వినియోగదారుల వద్ద అప్పటికే అవసరమైన ఛార్జర్లు ఉంటాయి, అవి అన్నింటికీ సరిపోతాయి. ఇలా ఇరు వర్గాల ఖర్చులు ఆదా అవుతాయి. యూరోపియన్ యూనియన్ ఇటీవల ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. 2024 నాటికి అన్ని మొబైల్ డివైజ్‌లు, టాబ్లెట్లకు USB-C పోర్ట్‌లు ఉండటాన్ని తప్పనిసరి చేసింది. ఈ దిశగా ప్రముఖ కంపెనీలు ఇప్పటికే చర్యలు ప్రారంభించాయి. తాజాగా ఇండియాలో కూడా ఈ దిశగా అడుగులు పడుతున్నాయి.
చర్చల్లో ఏకాభిప్రాయం
బుధవారం వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంటర్ మినిస్ట్రియల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో వాటాదారులు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత భారతదేశం అన్ని స్మార్ట్ డివైజ్‌లకు USB టైప్ C ఛార్జింగ్ పోర్ట్ ఉండాలనే నిబంధనలు తీసుకొస్తుందని చెప్పారు.
Mobile Users: ఇండియా జనాభా 140 కోట్ల పైనే.. మరి ఎంత మందికి ఫోన్లున్నాయో తెలుసా?
స్టాండర్ట్ USB-C పోర్ట్‌లకు మారుతున్న ఇండియా
బుధవారం జరిగిన సమావేశానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్, మహారాజా అగ్రసేన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఎన్విరాన్మెంట్, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో, స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైన ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు USB టైప్ - Cని ఛార్జింగ్ పోర్ట్‌గా స్వీకరించడంపై వాటాదారుల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు సింగ్ చెప్పారు. ఫీచర్ ఫోన్ల కోసం వేరే ఛార్జింగ్ పోర్ట్‌ను ఎంపిక చేయడంపై కూడా చర్చలు జరిగినట్లు వివరించారు. స్మార్ట్ వాచ్‌ల వంటి డివైజెస్ కోసం ఒకే ఛార్జింగ్ పోర్ట్‌ల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ టాస్క్‌ఫోర్స్ కింద ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
తప్పని ఈ- వ్యర్థాల ముప్పు
భారత ప్రభుత్వం రెండు స్టాండర్డ్ ఛార్జర్లకు మారే లక్ష్యంతో విస్తృత స్థాయి సంప్రదింపులను నిర్వహిస్తోంది. ఒకటి అన్ని కంపాటబుల్ డివైజ్‌ల కోసం కాగా, మరొకటి తక్కువ-ధర ఫీచర్ ఫోన్ల కోసం. పోర్టబుల్ డివైజ్‌లకు కామన్ ఛార్జర్ తీసుకురావడం వినియోగదారులకు మేలు చేస్తుంది. దేశంలో ఉత్పత్తి అయ్యే భారీ ఈ-వ్యర్థాలను కూడా తగ్గిస్తుంది. ASSOCHAM-EY నివేదిక ప్రకారం.. 2021లో భారతదేశం 5 మిలియన్ టన్నుల ఈ-వ్యర్థాలను ఉత్పత్తి చేసిందని అంచనా. అనేక అధునాతన ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికే స్టాండర్డ్ ఛార్జింగ్ డివైజ్‌లు, పోర్ట్‌ల వైపు కదులుతున్నాయి. యూరోపియన్ యూనియన్ (EU) అన్ని డివైజ్‌లకు USB-C పోర్ట్‌ని స్టాండర్డ్ చేసింది. EU స్టాండర్డ్ పోర్ట్‌కు మారిన తర్వాత.. వాడుకలో లేని ఫోన్లు, డివైజ్‌లను భారతదేశంలో డంప్ చేసే అవకాశం ఉందని ఓ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobiles, Smartphones