అల్ట్రా స్పీడ్ మొబైల్ నెట్వర్క్ అయిన 5జీ (5G Network) గతేడాది భారతదేశం (India)లోని కొన్ని నగరాల్లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయం నుంచి ప్రముఖ దేశీయ టెలికాం కంపెనీలైన ఎయిర్టెల్ (Airtel), జియో (Jio) 5G సేవలను దేశ వ్యాప్తంగా క్రమంగా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ ఫాస్ట్ డేటా స్పీడ్, లో లేటెన్సీ పొందేందుకు చాలామంది ఇండియన్లు 4G నుంచి 5G ఫోన్లకు అప్‌గ్రేడ్ అవుతున్నారు. కొత్తగా ఫోన్లు కొనే వారందరూ 5G మొబైల్స్ మాత్రమే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల నడుమ భారతదేశ 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2023 చివరి నాటికి 70% పైగా పెరుగుతుందని సైబర్‌మీడియా రీసెర్చ్ (CMR) లేటెస్ట్ రిపోర్టు అంచనా వేసింది. 5G ఫోన్లకు దేశంలో ప్రస్తుతం ఉన్న డిమాండ్ చూస్తుంటే 70% మార్కెట్ పెరుగుదల అసాధ్యం ఏమీ కాదని చెప్పవచ్చు.
* పెరిగిన షిప్‌మెంట్స్
2020లో 5జీ నెట్వర్క్ ప్రవేశపెట్టినప్పటి నుంచి భారతదేశంలో 5G స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లు 13 రెట్లు పెరిగాయి. దీనికి కారణం దేశంలో 5జీ నెట్వర్క్ శరవేగంగా విస్తరించడం, 5G మొబైల్ ఫోన్లకు అధిక డిమాండ్ నెలకొనడం అని చెప్పవచ్చు. నిజానికి భారతదేశంలో 5G స్మార్ట్ఫోన్ల మార్కెట్ వాటా 2020లో కేవలం 4% మాత్రమే ఉంది. అయితే ఈ మార్కెట్ వాటా 2023లో 45% కంటే ఎక్కువగా పెరుగుతుందని ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ (IIG), సైబర్ మీడియా రీసెర్చ్ (CMR) అనలిస్ట్ మెంక కుమారి పేర్కొన్నారు.
ఆమె ప్రకారం, 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2020లో ప్రవేశపెట్టిన సంవత్సరం నుంచి గణనీయంగా వృద్ధి చెందింది. అంటే భారతదేశంలో 5G స్మార్ట్ఫోన్ల స్వీకరణ వేగంగా పెరుగుతోంది. ఇది రాబోయే కొన్ని సంవత్సరాలలో మరింత వృద్ధి చెందుతుందని చెప్పవచ్చు.
2022లో దాదాపు 100 5G స్మార్ట్ఫోన్లు భారతదేశంలో లాంచ్ అయ్యాయి. అయితే 2023లో లాంచ్ చేసే కొత్త స్మార్ట్ఫోన్లలో 75% ఫోన్లు 5G- సపోర్ట్‌తోనే రావచ్చని ఆమె అంచనా వేశారు. శామ్సంగ్, వన్‌ప్లస్ , వివో కంపెనీలు 2022లో 5G స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లలో భారతదేశ మార్కెట్‌ను ముందుకు నడిపించాయి.
షియోమీ, రియల్మీ కంపెనీలు 5G వాల్యూ ఫర్ మనీ విభాగంలో వృద్ధికి తమ వంతు సహకారం అందించాయి. వినియోగదారుల డిమాండ్ విపరీతంగా ఉండటం, భారత టెలికాం కంపెనీలు శరవేగంగా 5G నెట్‌వర్క్‌ను విస్తరించడం వల్ల ఈ కొత్త సంవత్సరంలో 5G స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లు మరింత ఊపందుకుంటున్నాయని మెంక కుమారి పేర్కొన్నారు.
భారతదేశంలో 5Gని భారీగా స్వీకరించడం అనేది సరసమైన 5G స్మార్ట్ఫోన్ల అవైలబిలిటీ, వినియోగదారులకు మెరుగైన 5G అవైలబిలిటీ, యాక్సెస్‌పై ఆధారపడి ఉంటుందని ఆమె తెలిపారు. అంతిమంగా 5G స్మార్ట్ఫోన్ల షిప్మెంట్ వృద్ధి వాటి సరసమైన ధరలు, దేశంలో 5G నెట్‌వర్క్‌ల విస్తరణపై ఆధారపడి ఉంటుందని నివేదిక పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g mobile, 5g network, Tech news