IIT KHARAGPUR RESEARCHERS DEVELOP FOOD PACKAGING FROM CUCUMBER PEELS TO REPLACE PLASTIC MK GH
ఐఐటీ సైంటిస్టుల నూతన ఆవిష్కరణ.. దోసకాయ తొక్కలతో ఏం తయారు చేశారో తెలిస్తే షాక్ తింటారు...
ప్రతీకాత్మకచిత్రం
ఈ తొక్కలతో పర్యావరణ హిత ఆహార ప్యాకేజింగ్ మెటీరియల్ ను తయారు చేయవచ్చని తాజాగా ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) పరిశోధకులు పేర్కొన్నారు.
కీరా దోసకాయలతో ఉన్న ప్రయోజనాలు తెలిసిందే. వీటిని ముక్కలుగా కట్ చేసి సలాడ్లు, పచ్చళ్లు చేస్తుంటాం. కానీ, కీరా దోసకాయలో అత్యంత ప్రాధాన్యత ఉన్న తొక్కలను మాత్రం బయట పడేస్తాం. అయితే, ఈ తొక్కలతో పర్యావరణ హిత ఆహార ప్యాకేజింగ్ మెటీరియల్ ను తయారు చేయవచ్చని తాజాగా ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) పరిశోధకులు పేర్కొన్నారు. మిగతా పండ్లు, కూరగాయల తొక్కలతో పోలిస్తే దోసకాయ తొక్కల్లో సెల్యూలోజ్ పరిమాణం ఎక్కువగా ఉంటుందని, ఈ తొక్కల నుండి తీసుకోబడిన సెల్యులోజ్ నానోక్రిస్టల్స్ బయోడిగ్రేడబుల్ ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌ను తయారు చేయడానికి ఉపయోగించవచ్చని పరిశోధనా బృందం పేర్కొంది. భవిష్యత్‌లో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌ను సృష్టించడానికి దోసకాయ ముక్కలు బాగా పనిచేస్తాయని వారు తెలిపారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని ప్రొఫెసర్ జయీతా మిత్రా, రీసెర్చ్ స్కాలర్ సాయి ప్రసన్నలు సంయుక్తంగా తయారు చేసిన ఈ సెల్యులోజ్ నానో మెటీరియల్ పర్యావరణ అనుకూలంగా ఉంటుంది. ఈ నూతన పరిశోధనపై ఐఐటీ ఖరగ్‌పూర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మిత్రా మాట్లాడుతూ ‘‘వ్యర్థాలుగా భావించే దోసకాయ తొక్కలు 12 శాతం అవశేషాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రస్తుతం సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌లపై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నప్పటికీ, అవి ఇప్పటికీ ఆహార ప్యాకేజింగ్ వస్తువులుగా మార్కెట్లో చెలామణిలో ఉన్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా మా పరిశోధన ఎంతగానో ఉపయోగపడుతుంది.’’ అని ఆమె అన్నారు.
దోసకాయ తొక్కల్లో సెల్యులోజ్ ఎక్కువ..
భారతదేశంలో దోసకాయలను సహజంగా సలాడ్లు, వంటల్లో లేదా ముడి పానీయాల తయారీలో విస్తృతంగా వాడుతుంటాం. దోసకాయ తొక్కల నుండి ఉత్పన్నమయ్యే సెల్యులోజ్ నానోక్రిస్టల్స్లో మార్పుచేయదగిన లక్షణాలున్నాయని వారి అధ్యయనం పేర్కొంది. దీని వల్ల జీవ అధోకరణం, జీవ సౌందర్యం మెరుగవుతుంది. ఈ నానోసెల్యులోజ్ మెటీరియల్స్ ప్రత్యేక లక్షణాల కారణంగా బలమైన, పునరుత్పాదక పదార్థాలుగా ఉద్భవించాయి. దోసకాయ తొక్కల్లో ఇతర కూరగాయల వ్యర్థాల కంటే ఎక్కువ సెల్యులోజ్ ఉంటుందని వారి అధ్యయనం పేర్కొంది. పేపర్ మేకింగ్, కోటింగ్ ఎడిసివ్, బయో కాంపోజిట్స్, ఆప్టికల్ ఫిల్మ్‌లు వంటి వివిధ రంగాల్లో ఈ బయోడిగ్రెడబుల్ మెటీరియల్ ఉపయోగం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.