ఈటీఎఫ్- ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ల(exchange traded fund) గురించి ఎప్పుడైనా విన్నారా? ఏదైనా ఇండెక్స్‌ను అనుకరిస్తూ పెట్టుబడి పెట్టే ఫండ్లను ఈటీఎఫ్స్ అంటారు. ఇవి కూడా మ్యూచువల్ ఫండ్స్(Mutual funds) వర్గానికి చెందినవే. కాకపోతే ఓ వైపు షేరులా ఎక్స్ఛేంజీలో లిస్టయి ఉండి, మరోవైపు మ్యూచువల్ ఫండ్లా పనిచేస్తాయి. ఇందులో ఇండెక్స్ ఫండ్(Index fund), బ్యాంక్ ఫండ్, గోల్డ్ ఈటీఎఫ్, లిక్విడిటీ ఈటీఎఫ్ లాంటి పలు రకాల ఫండ్లు ఉన్నాయి. బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకుంటే మీరు గోల్డ్ ఈటీఎఫ్‌లను(Gold ETF) ఎంచుకోవాల్సి ఉంటుంది. మరి వెండిపై పెట్టుబడి పెట్టాలనుకుంటే పరిస్థితి ఏంటి? అసలు సిల్వర్ ఈటీఎఫ్‌లు ఉన్నాయా? అనేగా మీ సందేహం. ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(Asset management Company) ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ దేశంలోనే మొదటిసారిగా సిల్వర్ ఈటీఎఫ్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఫిజికల్ సిల్వర్ లేదా వెండి సంబంధిత సాధనాల్లో ఈ ఫండ్ ద్వారా పెట్టుబడి పెట్టుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. ఈ సరికొత్త ఫండ్‌ను జనవరి 5 నుంచి సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చని, జనవరి 19తో గడువు ముగుస్తుందని తెలిపింది. దీంతో సిల్వర్ ఈటీఎఫ్‌లను ప్రారంభించేందుకు పలు సంస్థలు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, నిప్పన్ మ్యూచువల్ ఫండ్, మిరే అసెట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ లాంటి కంపెనీలు క్యూ కట్టాయి. సిల్వర్ ఈటీఎఫ్‌ల గురించి నవంబరులో సెబీ జారీ చేసిన నిబంధనల ప్రకారం తన నికర ఆస్తుల్లో 95 శాతం వెండి, వెండి సంబంధిత సాధనాల్లో పెట్టుబడి పెట్టాలని సూచించింది.
తాజాగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సిల్వర్ ఈటీఎఫ్ వెండిపై పెట్టుబడులతో ఆ దిశగా ముందడుగు వేసింది. సిల్వర్ ఈటీఎఫ్ అనేది దేశంలోని వెండి ధరలను ట్రాక్ చేసే ఓపెన్ ఎండ్ పథకం. ఈ పథకం ఆదాయాన్ని ఫిజికల్ సిల్వర్ లేదా వెండి సంబంధిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ పెట్టుబడి సాధనం ద్వారా వచ్చే రాబడి దేశీయ వెండి ధరలకు అనుగుణంగా ఉంటుంది. దేశీయ ధరలు లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్(LBMA) నిర్దేశించిన ఫిక్సింగ్ ధరలను అనుసరిస్తాయి.
ఫిజికల్ సిల్వర్‌ను కలిగి ఉండటమే కాకుండా పెట్టుబడిదారు ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రయోజనం పొందవచ్చని ఐసీఐసీఐ ఫండ్ హౌస్ పేర్కొంది. ఎందుకంటే ఇది ఎక్కువ లిక్విడిటీ, తక్కువ స్టోరేజ్ ప్రైజ్‌ను అందిస్తుందని స్పష్టం చేసింది. వెండి నాణ్యత, స్వభావం వల్ల లిక్విడిటీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పెట్టుబడుదారులకు ఇష్టపడే ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో సిల్వర్ ఈటీఎఫ్ ఒకటిగా మారుతుందని తాము విశ్వసిస్తున్నామని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ప్రతినిధి చింతన్ హరియా అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Etf, Latest Technology, Technology