ఐసీఐసీఐ బ్యాంకు వినియోగదారులకు సరికొత్త సేవలను అందించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ రోజు నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం, యుటిలిటీ బిల్లులు చెల్లించడం, ట్రేడ్ ఫైనాన్స్ యాక్సెస్ వివరాలను తెలుసుకోవడం.. వంటి సేవలను వినియోగదారులకు వాట్సాప్ ద్వారా అందిస్తామని ప్రకటించింది. మన దేశంలో ఇలాంటి సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తోన్న మొదటి బ్యాంకు ఐసీఐసీఐ కావడం విశేషం. ఈ కొత్త సేవలతో కలిపి వాట్సాప్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంచిన మొత్తం బ్యాంకింగ్ సేవలు 25కి పెరిగాయి. సోషల్ మీడియాకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో వాట్సాప్ ద్వారా తమ వినియోగదారులకు సులువుగా సేవలు అందించగలమనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు చేస్తున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ డిజిటల్ ఛానల్స్ అండ్ పార్టనర్షిప్ హెడ్ బిజిత్ భాస్కర్ తెలిపారు. ‘గత ఆరునెలల్లో రెండు మిలియన్ల మంది వినియోగదారులు వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందారు. దీంతో ఈ సేవలను విస్తరించాలనుకున్నాం. అందుకే కొత్త సేవలను ఈ జాబితాలో చేర్చాం. ఇప్పుడు రిటైల్, ఎన్ఆర్ఐ, కార్పొరేట్, ఎంఎస్ఎంఈ కస్టమర్లు వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా వివిధ రకాల సేవలను పొందవచ్చు’ అని ఆయన వివరించారు.
ఈ సేవలను ఎలా పొందాలి?వినియోగదారులు ముందు 86400 86400 ఐసీఐసీఐ బ్యాంకు సర్వీస్ నంబరును కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకొని 'హాయ్' (Hi) అని మెస్సేజ్ పెట్టాలి. అవసరమైన సేవలను పొందడానికి, దానికి సంబంధించిన కీవర్డ్ టైప్ చేస్తే చాలు. ఆ సేవలకు సంబంధించిన మొత్తం సమాచారం చాట్ లిస్ట్‌లో డిస్ప్లే అవుతుంది.
ఎన్ని రకాల సేవలు ఉన్నాయంటే..
ఫిక్స్డ్ డిపాజిట్లు
వాట్సాప్ ద్వారా వినియోగదారులు ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు. ఇందుకు కస్టమర్లు FD, Fixed Deposit వంటి కీవర్డ్ లను టైప్ చేసి, రూ.10,000 నుంచి రూ.1 కోటి మధ్య ఎఫ్డీ మొత్తం, టెన్యూర్‌ను ఎంటర్ చేయాలి. వివిధ గడువులకు వడ్డీ రేట్లు ఎంత ఉన్నాయి, మెచూరిటీ తరువాత ఎంత మొత్తం లభిస్తుంది.. వంటి వివరాలను చాట్ లిస్ట్‌లో సిస్టమ్ డిస్ప్లే చేస్తుంది.
బిల్లులు చెల్లించవచ్చుఐసీఐసీఐ వినియోగదారులు ఇప్పుడు వాట్సాప్ ద్వారా విద్యుత్, వంట గ్యాస్, పోస్ట్ పెయిడ్ మొబైల్ కనెక్షన్.. వంటి యుటిలిటీ బిల్లులను సులభంగా చెల్లించవచ్చు. విద్యుత్ బిల్లు చెల్లించడానికి విద్యుత్ బోర్డు, మీటర్ నెంబర్ తదితర వివరాలను ఎంటర్ చేయాలి. పోస్ట్‌పెయిడ్ మొబైల్ కనెక్షన్ బిల్లు చెల్లించడానికి, ఫోన్ నంబర్, నెట్‌వర్క్‌ను కస్టమర్ ధ్రువీకరించాలి. వంట గ్యాస్ బిల్లు చెల్లించడానికి, గ్యాస్ ప్రొవైడర్, కస్టమర్ ఐడిని ఎంటర్ చేయాలి. ఈ సేవలను యాక్సెస్ చేయడానికి Pay Bills, Electricity, Gas, Mobile postpaid వంటి కీ వర్డ్స్‌ను టైప్ చేయాలి.
ట్రేడ్ ఫైనాన్స్ సేవలు
ట్రేడ్ ఫైనాన్స్ సంబంధిత బ్యాంకింగ్ సేవల కోసం Trade, Trade services, Customer ID, IE Code వంటి కీ వర్డ్స్‌ను బ్యాంకు నంబర్ వాట్సాప్ చాట్ లిస్ట్‌లో ఎంటర్ చేయాలి. ఆ తరువాత బ్యాంకు అకౌంట్‌తో లింక్ అయ్యి ఉండే కస్టమర్ ఐడి, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ (IE) కోడ్‌ను ఎంటర్ చేసి ట్రేడ్ ఫైనాన్స్ సేవలను పొందవచ్చు.
క్రెడిట్ లిమిట్ తెలుసుకోవచ్చు
క్రెడిట్ లిమిట్‌ను తెలుసుకోవడానికి Trade, Trade services, Limit Availability వంటి కీ వర్డ్స్‌ను వాట్సాప్ చాట్ లిస్ట్‌లో ఎంటర్ చేయాలి. ఆ తరువాత సేవల జాబితా నుంచి మీ అకౌంట్‌పై బ్యాంకు అందించే అన్ని రకాల క్రెడిట్ లిమిట్, వాటికి సంబంధించిన నియమాలను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు.
ఆరు నెలల క్రితమే ప్రారంభం
వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను ఐసీఐసీఐ బ్యాంకు ఆరు నెలల క్రితమే ప్రారంభించింది. ఈ జాబితాలో సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ తనిఖీ చేయడం, చివరి మూడు లావాదేవీలు, క్రెడిట్ కార్డ్ లిమిట్, క్రెడిట్, డెబిట్ కార్డులను సురక్షితమైన పద్ధతిలో బ్లాక్, అన్‌బ్లాక్ చేయడం, ఇన్‌స్టాట్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడం, లోన్ మారటోరియం ఆప్షన్‌ను ఎంచుకోవడం, కొన్ని ప్రముఖ వార్తాపత్రికలను PDF రూపంలో యాక్సెస్ చేయడం... వంటివి ఉన్నాయి. వీటికి వినియోగదారుల నుంచి మంచి స్పందన రావడంతో, తాజాగా మరికొన్ని సేవలను బ్యాంకు ఈ జాబితాకు జత చేసింది.