భారతదేశంలో అనతికాలంలోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ (Electric Vehicles) వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ అందరూ ఈ-కార్లకే మొగ్గు చూపుతున్నారు. అయితే ఇండియాలో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్ల ధరలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ కార్పొరేషన్ (Hyundai Motor Corp) నుంచి ఒక తీపి కబురు అందింది. హ్యుందాయ్ కంపెనీ భారతీయుల కోసం చిన్న, సరసమైన ఎలక్ట్రిక్ కారు (Small Electric Car)ను తయారు చేస్తున్నట్లు తాజాగా ఓ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. వాస్తవానికి కంపెనీ ఈ ఏడాది నుంచి అధిక సంఖ్యలో ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్స్ను ఇండియాలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అలానే భవిష్యత్తులో భారత్ కోసం చిన్న ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైందని ఓ అధికారి వెల్లడించారు.
స్థానికంగా విడిభాగాలు తయారు చేయడం ప్రధానం
ఓ తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న హ్యుందాయ్ ఇండియా డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్, సర్వీస్) తరుణ్ గార్గ్.. కంపెనీ ఇండియా కోసం చేస్తున్న ఫ్యూచర్ ప్లాన్స్ గురించి తెలిపారు. ఆయన మాట్లాడుతూ... ఛార్జింగ్ ఎకోసిస్టమ్, సేల్స్ నెట్వర్క్, తయారీ, అసెంబ్లింగ్ ప్రాసెస్ వంటి సమస్యలపై హ్యుందాయ్ కంపెనీలోని అన్ని డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. లోకల్లోనే వీలైనంత ఎక్కువగా తయారీ పనులను పూర్తి చేయడానికి కంపెనీ వీలైనన్ని మార్గాలను వెతుకుతోందని తరుణ్ అన్నారు. ఖర్చులను తగ్గించుకోవడానికి.. కార్లను సరసమైన ధరలలో లాంచ్ చేయడానికి స్థానికంగా భాగాలను ఉత్పత్తి చేయడం, తయారుచేయడం ముఖ్యమని పేర్కొన్నారు.
భారత్లో కంపెనీ తన స్మాల్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV)ను ఎప్పుడు లాంచ్ చేస్తుందనే దానికి తరుణ్ కచ్చితమైన సమాధానం ఇవ్వలేదు. అయితే సరైన సమయంలో, సరైన ధరకు తీసుకొస్తామని మాత్రం తెలిపారు. 2028 నాటికి ఇండియాలో ఆరు ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ చేయాలనే ప్లాన్లో భాగంగా 512 మిలియన్ డాలర్లు (రూ.4 వేల కోట్లు) పెట్టుబడి పెట్టాలని హ్యుందాయ్ నిర్ణయించింది. ఈ ప్లాన్లో స్మాల్ ఈవీ కూడా ఒక భాగంగా ఉంది.
ఇండియాలో EVల వాటా తక్కువే..
ప్రస్తుతం ఇండియాలో మొత్తం కార్ల విక్రయాలలో ఈవీల వాటా 1% కంటే తక్కువగా ఉండటం గమనార్హం. అయితే కాలుష్యం, ఇంధన దిగుమతులను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇందులో భాగంగా 2030 నాటికి ఈవీ వాటాను 30% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2019లో హ్యుందాయ్ కోనా పేరుతో ఒక ఈవీని ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ధర ఎక్కువగా ఉండటం, పబ్లిక్ ఛార్జింగ్ సదుపాయాలు తక్కువగా ఉండటం వల్ల ఈ కార్ సేల్స్ పెద్దగా జరగలేదు. అయితే ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని హ్యుందాయ్ చాలా జాగ్రత్తగా ప్లాన్స్ రూపొందించుకుంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto mobile, Cars, Electric Car, Hyundai